Prince Harry: ఆ విషయాలన్నీ చెప్తే.. రాజకుటుంబం నన్నెప్పటికీ క్షమించదు..!

చిన్ననాటి నుంచి తాను చవిచూసిన అవమానాలను ప్రిన్స్‌ హ్యారీ(Prince Harry) ఆత్మకథ రూపంలో బయటపెట్టారు. అలాగే రాజ కుటుంబం తన భార్యకు క్షమాపణ చెప్పాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు. 

Updated : 14 Jan 2023 15:08 IST

వాషింగ్టన్‌: బ్రిటన్(Britain) రాజకుటుంబం గురించి ప్రిన్స్‌ హ్యారీ(Prince Harry) వెల్లడించిన విషయాలు సంచలనాన్ని కలిగించాయి. ‘స్పేర్‌’(Spare)పేరిట రాసిన ఆత్మకథలో చిన్నతనం నుంచి ఆయన ఎదుర్కొన్న అవమానాలను వెల్లడించారు. తన వద్ద రెండు పుస్తకాలకు సరిపడా విషయాలున్నాయని, కొన్నింటిని తన పుస్తకంలో చేర్చలేదని తెలిపారు. వాటన్నింటి గురించి చెబితే తన తండ్రి, సోదరుడు ఎన్నటికీ తనను క్షమించరన్నారు. ఈ మేరకు ఓ మీడియా సంస్థతో మాట్లాడారు. అలాగే తన భార్య మేఘన్‌తో ప్రవర్తించిన తీరుకు రాజకుటుంబం ఆమెకు క్షమాపణ చెప్పాలని కోరుకుంటున్నానని అన్నారు.  

‘ఈ విషయాలను వెల్లడించడం ద్వారా నేను రాజకుటుంబాన్ని ముక్కలు చేయాలని ప్రయత్నించడం లేదు. ఇది వారిని రక్షించే ప్రయత్నమే. నా దగ్గర మరో పుస్తకానికి సరిపడా సమాచారం ఉంది. కానీ నాకూ నా సోదరుడు, తండ్రికి మధ్య జరిగిన విషయాలు వెల్లడిస్తే.. ఇక వారు ఎప్పటికీ నన్ను క్షమించరు. మీరు నాకు చేసిన దానికి మాత్రం మిమ్మల్ని క్షమించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నా గురించి నెగెటివ్‌గా చెప్పేబదులు.. మీరు నాతో కూర్చొని, మాట్లాడాలనుకుంటున్నా. నేను కోరుకునేది జవాబుదారీతనం, నా భార్యకు మీ క్షమాపణ మాత్రమే’ అని తెలిపారు. 

అమెరికా నటి అయిన మేఘన్‌ మెర్కెల్‌ను హ్యారీ 2018లో ప్రేమ వివాహం చేసుకున్నారు. ముందు నుంచే మేఘన్‌ విషయంలో రాజకుటుంబం (Royal Family)లో విభేదాలున్నాయి. పెళ్లి తర్వాత ఇవి మరింత తీవ్రమవడంతో 2020లో హ్యారీ-మేఘన్‌ దంపతులు రాచరిక విధులను వదులుకొని అమెరికాలో స్థిరపడ్డారు. మేఘన్‌ విషయంలో కుటుంబం చూపిన వివక్ష కారణంగానే తాను కుటుంబానికి దూరమయ్యానని హ్యారీ అనేకసార్లు బహిరంగంగానే వెల్లడించారు. ఈ క్రమంలోనే ‘స్పేర్’ పుస్తకాన్ని విడుదల చేశారు. దీనిలో ఆయన ఎదుర్కొన్న అవమానాలు గురించి బయటపెట్టారు. అలాగే తన తల్లి డయానా మరణం విషయంలో అనేక ప్రశ్నలు మిగిలే ఉన్నాయని కూడా వ్యాఖ్యానించారు. 

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని