Deaths in India: దేశంలో ఆ మూడు సమస్యల వల్లే 42శాతం మరణాలు

హృద్రోగ సమస్యలు, న్యుమోనియా, ఆస్తమా వల్ల దేశంలో భారీ స్థాయిలో మరణాలు చోటుచేసుకుంటున్నట్లు తాజా నివేదికలో వెల్లడైంది.

Published : 27 May 2022 02:05 IST

కొవిడ్‌ కారణంగా 9శాతం మంది మృత్యువాత

దిల్లీ: హృద్రోగ సమస్యలు, న్యుమోనియా, ఆస్తమా వల్ల దేశంలో భారీ స్థాయిలో మరణాలు చోటుచేసుకుంటున్నట్లు తాజా నివేదికలో వెల్లడైంది. 2020 సంవత్సరంలో దేశం మొత్తం సంభవించిన మరణాల్లో 42శాతం ఈ మూడు సమస్యల వల్లే సంభవించినట్లు తేలింది. ఆ ఏడాది దేశంలో వైద్యపరంగా ధ్రువీకరించిన మొత్తం 18లక్షల మరణాల్లో తొమ్మిది శాతం కొవిడ్‌ కారణంగా మరణించారు.

కొవిడ్‌ కారణంగా లక్షా 60వేల మంది..

దేశంలో మరణాలకు సంబంధించిన కారణాలను విశ్లేషించడంలో భాగంగా ‘రిపోర్ట్‌ ఆన్‌ మెడికల్‌ సర్టిఫికేషన్‌ ఆఫ్‌ కాజ్‌ ఆఫ్‌ డెత్‌ 2020’ పేరుతో రిజిస్ట్రార్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (RGI) నివేదిక విడుదల చేసింది. 2020లో దేశంలో మొత్తంగా 81.15లక్షల మరణాలు నమోదుకాగా వీటిలో వైద్యపరంగా ధ్రువీకరించిన మరణాల సంఖ్య 18,11,688గా ఉంది. ప్రసరణ వ్యవస్థ (గుండెకు)కు సంబంధించిన సమస్యలతో 32.1శాతం మంది ప్రాణాలు కోల్పోగా శ్వాసవ్యవస్థ సంబంధిత వ్యాధులతో మరో 10శాతం మంది ప్రాణాలు కోల్పోయారు. వీటిలో దాదాపు తొమ్మిది శాతం అనగా 1,60,618 మరణాలు కొవిడ్‌తోనే సంభవించాయి. అయితే, 2020కు సంబంధించి కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొన్న కొవిడ్‌ మరణాల (1,48,994) కంటే ఇవి ఎక్కువగా ఉండడం గమనార్హం. మే 25 నాటికి దేశవ్యాప్తంగా 5,24,507 మరణాలు సంభవించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ చెబుతోంది.

రిజిస్ట్రార్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా నివేదిక ప్రకారం 2020లో వివిధ రకాల ఆరోగ్య సమస్యలతో మరణించిన వారి సంఖ్య ఈవిధంగా ఉంది.

*  దేశంలో అత్యధిక మరణాలు ఊపిరితిత్తులు, గుండెకు సంబంధించిన సమస్యలే కారణంగా నిలుస్తున్నాయి. వీటిని ‘ప్రసరణ వ్యవస్థ’ కారణ మరణాలుగా వర్గీకరించారు.

* రెండో స్థానంలో న్యుమోనియా, ఆస్తమా సంబంధిత మరణాలను మాత్రం శ్వాసకోస వ్యవస్థ సంబంధిత మరణాలుగా పేర్కొన్నారు.

వైద్యపరంగా ధ్రువీకరించిన మొత్తం మరణాల్లో 8.9శాతం కేసులను ‘కోడ్స్‌ ఫర్‌ స్పెషల్‌ పర్పసెస్‌’ జాబితాలో చేర్చి, వాటిని కొవిడ్‌-19 మరణాలుగా పేర్కొన్నారు.

ప్రాణాంతక సెప్టిసీమియా, క్షయ వంటి వ్యాధుల కారణంగా 7.1శాతం మరణాలు చోటుచేసుకున్నాయి.

* ఎండోక్రైన్‌, పోషకాహార, జీవక్రియ వ్యాధులకు (మధుమేహం) సంబంధించి 5.8శాతం మరణాలు నమోదయ్యాయి.

* గాయాలు, విషప్రయోగం వంటి వాటితో 5.6శాతం మరణాలు సంభవించాయి.

* వైద్యపరంగా ధ్రువీకరించిన మరణాల్లో 4.7శాతం క్యాన్సర్‌ వల్లే నమోదయ్యాయి.

* మొత్తంగా తొమ్మిది రకాల ఆరోగ్య సమస్యలతోనే 88.7శాతం మంది చనిపోయారు. మిగతావి 11.3శాతంగా నమోదయ్యాయి.

* అన్ని రకాల మరణాల్లో పురుషులు 64శాతం, మహిళలు 36శాతంగా ఉన్నారు.

* 2020లో దేశంలో అత్యధిక మరణాలు (5,17,678) మాత్రం 70ఏళ్లు అంతకుపైబడిన వారిలోనే ఉన్నాయి.

* 45ఏళ్ల వయసు పైబడిన వారిలో ఎక్కువ మరణాలు హృద్రోగ సమస్యలతోనే చోటుచేసుకున్నట్లు నివేదిక చెబుతోంది.

* మొత్తం మరణాల్లో 5.7శాతం ఏడాదికంటే తక్కువ వయసున్న చిన్నారుల్లో కనిపించాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు