Heart Transplant: తన ‘పాత గుండె’ను తానే చూసుకుని.. ఉప్పొంగిపోయి!

16 ఏళ్ల క్రితం గుండె మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్న మహిళ.. ఇటీవల తన పాత గుండెను చూసుకుని పొంగిపోయారు. దీన్ని లండన్‌లోని హంటేరియన్‌ మ్యూజియంలో భద్రపరిచారు.

Published : 23 May 2023 01:51 IST

లండన్‌: ఇది 2007 నాటి మాట. అప్పటికి 22 ఏళ్ల వయసున్న ఓ యువతికి గుండె మార్పిడి (Heart Transplantation) శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయ్యింది. కాల చక్రం గిర్రున తిరిగింది. ఇప్పుడామెకు 38 ఏళ్లు. ఈ క్రమంలోనే.. ఒకప్పుడు తన శరీరంలోనే ఉండి లబ్‌ డబ్‌మంటూ కొట్టుకున్న ఆ హృదయం (Heart) ఒక్కసారిగా ఆమె కళ్లముందు ప్రత్యక్షమైంది. మ్యూజియంలో భద్రపరిచిన తన సొంత గుండెను చూసుకున్న ఆమె ఉద్విగ్నానికి గురైంది. ఇదంతా నమ్మశక్యం కాని అద్భుతంగా వర్ణించింది. బ్రిటన్‌ రాజధాని లండన్‌ (London)లోని హంటేరియన్‌ మ్యూజియం (Hunterian Museum) ఈ ఘటనకు వేదికగా నిలిచింది.

ఇక్కడి హాంప్‌షైర్‌లోని రింగ్‌వుడ్‌కు చెందిన జెనిఫర్‌ సటన్‌.. యూనివర్సిటీ విద్యార్థిగా ఉన్న సమయంలో హృదయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్లు తేలింది. గుండె మార్పిడి చేయని పక్షంలో ప్రాణాలకే ప్రమాదమని వైద్యులు చెప్పారు. అప్పటికి ఆమె వయసు 22 ఏళ్లు. శరీరానికి సరిపోయే గుండె కోసం అన్వేషణ సాగిస్తుండగానే.. ఆమె ఆరోగ్యం క్షీణించసాగింది. ఎట్టకేలకు 2007 జూన్‌లో ఓ దాత దొరికారు. అయితే, ఆమెకు 13 ఏళ్ల వయసున్నప్పుడు ఆమె తల్లి సైతం ఇలాంటి శస్త్రచికిత్స అనంతరం మృతి చెందారు. దీంతో ఆమె తొలుత ఆందోళన చెందింది. చివరకు, ఆమె హృదయ మార్పిడి శస్త్రచికిత్స విజయవంతమైంది.

ఆపరేషన్‌ అనంతరం కళ్లు తెరిచాకా నన్ను నేనే కొత్త మనిషిగా భావించానని అప్పటి జ్ఞాపకాలను ఆమె గుర్తుచేసుకున్నారు. శస్త్రచికిత్స ద్వారా తొలగించిన తన హృదయాన్ని ప్రదర్శనలో ఉంచేందుకుగానూ ‘రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్‌’కు అనుమతి ఇచ్చారు. ఈ క్రమంలోనే అవయవాల నమూనాలను ప్రదర్శించే ‘హంటేరియన్ మ్యూజియం’లో దాన్ని భద్రపరిచారు. ఇప్పుడు దాన్ని పౌరులందరి సందర్శన కోసం అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ క్రమంలోనే ఆమె తన సొంత హృదయాన్ని చూసుకుని పొంగిపోయారు. ఇది తన స్నేహితురాలని, 22 ఏళ్లపాటు తనను బతికి ఉంచిందని.. పాత హృదయాన్ని చూపిస్తూ గర్వంగా చెప్పారు.

అవయవదానాన్ని ఇతరులకు ఇచ్చే గొప్ప బహుమతిగా అభివర్ణించిన ఆమె.. దీన్ని ప్రోత్సహించేందుకుగానూ తాను వీలైనంత మేర కృషి చేస్తానని చెప్పారు. ఒకవేళ అవయవ దాతే లేకపోతే తన జీవితంలో అద్భుతమైన 16ఏళ్లు కోల్పేయేదాన్నని తెలిపారు. పెళ్లి తదితర గొప్ప క్షణాలు ఎప్పటికీ జరిగేవి కావని గుర్తుచేశారు. తన హృదయాన్ని వీలైనంత మేర ఆరోగ్యంగా ఉంచుకుంటున్నట్లు పేర్కొన్నారు. శస్త్రచికిత్స పూర్తయిన ఏడాదికి ఆమె కొత్త గుండె మనుగడ 93 శాతంగా తేలిందని, ఆమె కోలుకోవడం అద్భుతమని అప్పట్లో శస్త్రచికిత్స నిర్వహించిన సర్జన్ స్టీఫెన్ లార్జ్ తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు