IN PICS: మహా విషాదంలో మౌన రోదనలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న చిత్రాలు..

తుర్కియే (Turkey), సిరియా (Syria)లో ప్రకృతి సృష్టించిన విలయం మాటలకందని మహా విషాదాన్ని మిగిల్చింది. ఈ పెను విపత్తుకు సంబంధించిన చిత్రాలు హృదయాలను మెలిపెడుతున్నాయి.

Updated : 10 Feb 2023 15:00 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కంటికి రెప్పలా కాపాడుకుంటున్న కన్న కూతుర్ని కోల్పోయిన ఓ తండ్రి.. భుజానెత్తుకుని పెంచిన తండ్రిని పోగొట్టుకున్న కొడుకు.. బొడ్డుతాడు ఊడకముందే అనాథగా మారిన పసికందు.. ప్రకృతి సృష్టించిన భూప్రళయంతో అల్లకల్లోలంగా మారిన తుర్కియే (Turkey), సిరియా (Syria)లో హృదయాల్ని మెలిపెడుతున్న ఇలాంటి విదారక దృశ్యాలెన్నో..! ఈ దయనీయ పరిస్థితులను చూసి సహాయక బృందాలు.. ఫొటో జర్నలిస్టులు సైతం కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ ఘోర విపత్తుకు సంబంధించిన చిత్రాలు యావత్‌ ప్రపంచాన్ని కదిలిస్తున్నాయి.

ఆ తండ్రి శోకం..

సోమవారం చోటుచేసుకున్న భూకంప (Earthquake) తీవ్రతకు మెసుట్‌ హాన్సర్‌ నివాసముంటున్న ఇల్లు కుప్పకూలింది. ఈ విపత్తు సమయంలో బెడ్‌పై ఆదమరిచి నిద్రపోతున్న మెసుట్‌ 15 ఏళ్ల కుమార్తె ఇర్మాక్‌ శిథిలాల కింద నలిగి ప్రాణాలు కోల్పోయింది. భవన దిమ్మెల మధ్యలో చేయి మాత్రమే కన్పిస్తోంది. కుమార్తె మృతదేహాన్ని చూసి ఆ తండ్రి గుండె బద్దలైంది. కన్నబిడ్డ చేయి పట్టుకుని మౌనంగా రోదిస్తూ అలాగే కూలబడ్డాడు. చలి వణికిస్తున్నా కూతుర్ని వదిలి వెళ్లలేక అలాగే కూర్చుండిపోయాడు. తుర్కియేలో (Turkey) కన్పించిన హృదయ విదారక దృశ్యాన్ని తన కెమెరాలో బంధించాడో జర్నలిస్టు. ఆ సమయంలో మాటలు రాలేదని, ఆ తండ్రి వేదన చూసి తనకే కన్నీళ్లు వచ్చాయని ఆ జర్నలిస్టు చెప్పారు.

చివరి ముద్దు..

భూకంపం శిథిలాల కింద చిక్కుకున్న ఓ కుటుంబంలో తల్లీతండ్రి బయటపడగా వారి కుమార్తె ప్రాణాలు కోల్పోయింది. ప్రాణం లేని బిడ్డను చూసి ఆ తల్లి గుండెలవిసేలా రోదించింది. అంతిమ సంస్కారాలకు తీసుకెళ్తుండగా చిన్నారి చేతిపై చివరిసారిగా ముద్దుపెట్టి కుమార్తెకు కన్నీటి వీడ్కోలు పలికింది. తుర్కియే, సిరియా (Syria) సరిహద్దుల్లోని రేహనిల్‌ ప్రాంతంలో కన్పించిందీ దృశ్యం.

పుడమి ఒడిలో పుట్టి..

సిరియాలోని జిండిరెస్‌ ప్రాంతంలో శిథిలాల మధ్యలో జన్మించిందో శిశువు. భూకంపం (Earthquake)తో భవనం కూలిపోగా.. బండరాళ్ల మధ్య చిక్కుకున్న ఓ నిండు గర్భిణి మరణం అంచుల్లోనూ ప్రసవ వేదన భరిస్తూ బిడ్డకు జన్మనిచ్చింది. తర్వాత ఆ తల్లి కన్నుమూయగా.. బిడ్డ ఏడుపు విన్న సహాయక సిబ్బంది పాపను కాపాడారు. బొడ్డుతాడుతో కన్పించిన ఆ పసికందును పట్టుకుని ఓ వ్యక్తి పరిగెడుతున్న దృశ్యం.. యావత్‌ ప్రపంచాన్ని కదిలించింది.

థాంక్యూ భారత్‌..

భూకంపంతో అతలాకుతలమైన తుర్కియేకు భారత్‌ (India) ఆపన్నహస్తం అందించింది. ‘ఆపరేషన్‌ దోస్త్ (Operation Dost)‌’లో భాగంగా భారత్‌ నుంచి ఎన్డీఆర్‌ఎఫ్‌ బలగాలు తుర్కియే వెళ్లి సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. ఈ సందర్భంగా తమ దేశానికి చేస్తున్న సాయానికి చలించిన ఓ తుర్కిష్‌ మహిళ.. భారత సైనికురాలిని ఆప్యాయంగా ముద్దుపెట్టుకుని కృతజ్ఞతలు తెలిపింది. ‘దోస్త్‌’ అనే పదానికి  తుర్కిష్‌, హిందూస్థానీ భాషల్లో అర్థం ‘స్నేహితుడు’. భారత్‌ ఈ ఆపరేషన్‌కు అందుకే ‘దోస్త్‌’ అనే పేరు పెట్టింది.  

కష్టం.. ప్రాణమై తిరిగొచ్చిన వేళ..

సిరియాలోని ఇడ్లిబ్‌ నగరంలో భూకంప ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టిన సిబ్బంది కొన్ని గంటల పాటు శ్రమించి ఓ చిన్నారిని శిథిలాల నుంచి సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. వారి కష్టం ఫలించి ఓ ప్రాణం నిలబడటంతో ఆ సిబ్బంది పాపను ప్రేమగా ఎత్తుకొని ఆనందపడ్డారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని