Austria: ఆర్థిక అసమానతలకు చలించి.. రూ.224 కోట్ల సంపద దానం!

దేశంలో ఆర్థిక అసమానతలను గమనించిన ఓ యువతి.. ఏకంగా రూ.224 కోట్ల విలువైన ఆస్తుల దానానికి ముందుకొచ్చారు.

Published : 21 Jun 2024 00:17 IST

వియన్నా: దేశంలో ఆర్థిక అసమానతలను గమనించిన ఓ యువతి.. కుటుంబం నుంచి తనకు వారసత్వంగా దక్కిన ఆస్తుల పునఃపంపిణీకి ముందుకొచ్చారు. వాటి విలువ ఏకంగా రూ.224 కోట్లు ఉండటం గమనార్హం. మార్లిన్ ఎంగెల్‌హార్న్ (31) అనే యువతి ఆస్ట్రియాలోని ఓ సంపన్న పారిశ్రామిక కుటుంబంలో జన్మించారు. ఆమెకు వారసత్వంగా రూ.వందల కోట్ల విలువైన ఆస్తులు దక్కాయి. అయితే, దేశంలో ఆర్థిక అసమానతలు ఉన్నాయని భావించిన ఆమె.. దాదాపు తన సంపద మొత్తాన్ని (రూ.224 కోట్లు) దానం చేసేందుకు సిద్ధమయ్యారు.

ఈ క్రమంలోనే స్థానికంగా విభిన్న రంగాల నిపుణులతో కూడిన ఓ బృందాన్ని (గుటెర్‌ ర్యాట్‌) సంప్రదించారు. సంపద పునఃపంపిణీపై ఆ బృందం తన ప్రణాళికలతో ముందుకొచ్చింది. దేశంలోని దాదాపు 77 సంస్థలకు ఆ సంపదను పంచుతామని తెలిపింది. వాతావరణ మార్పులు, విద్య, ఆరోగ్యం, స్త్రీ-పురుష సమానత్వానికి కృషి చేసే సంస్థలు, మహిళా ఆశ్రయ కేంద్రాలు, నిరాశ్రయులు నడిపించే వార్తాపత్రికలు, అగ్నిమాపక విభాగాలు, ప్రజాస్వామ్య అనుకూల సంస్థలు ఈ జాబితాలో ఉన్నాయి. ఒకేసారి కాకుండా దీర్ఘకాలిక వ్యవధిలో ఆర్థిక సాయం అందుతుందని తెలిపింది.

మెలోని పాత వీడియో వైరల్‌.. లేడీ గ్యాంగ్‌స్టర్‌ అంటున్న నెటిజన్లు

‘‘సంపద పునఃపంపిణీ అంటే.. సంపదను సమాజమే సృష్టిస్తుందని గుర్తించడం. ప్రజల జీవితాలను మెరుగుపరిచేందుకు అందులో కొంత భాగాన్ని సమాజానికి పునఃపంపిణీ చేయాలి. తద్వారా సామాజిక, పర్యావరణ సమస్యల పరిష్కార మార్గాలపై దృష్టి సారించొచ్చు’’ అని గుటెర్‌ ర్యాట్‌ తెలిపింది. ‘‘ప్రజాస్వామ్య విలువలకు అనుగుణంగా సంపద పునఃపంపిణీతో దేశంలో ఆర్థిక అసమానతలను కొంతమేర రూపుమాపేందుకు యత్నిస్తోన్నా. ఇలా చేయడం అద్భుతంగా అనిపిస్తోంది’’ అని ఆమె పేర్కొన్నట్లు స్థానిక వార్తాసంస్థ తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని