Earthquake: అతి తీవ్రమైన ఐదు భూకంపాలివే..!

రిక్టర్‌ స్కేల్‌పై 9 తీవ్రత దాటిన భూకంపాలు కూడా నమోదయ్యాయి. అవి సృష్టించిన రాకాసి సునామీ అలలు భారీ ప్రాణనష్టాన్ని కలిగించాయి. అత్యంత ప్రమాదకరమైన ఐదు భూకంపాల వివరాలు తెలుసుకొందాం..

Updated : 06 Feb 2023 17:36 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: తుర్కియే(Turkey), సిరియా(Syria)లో నిమిషాల వ్యవధిలోనే వరుస భూకంపాలు చోటు చేసుకొన్నాయి. అమెరికా జియోలాజికల్‌ సర్వే అంచనాల ప్రకారం మృతుల సంఖ్య 1,000-10,000 మధ్య ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గత భూకంపాల తీవ్రత, అక్కడ నివసించే జనాభాను దృష్టిలో పెట్టుకొని ఈ అంచనాలను తయారు చేసింది. ఓ పక్క గడ్డకట్టుకుపోయే చలిలో సహాయక చర్యలు జరుగుతున్నాయి. చాలా భవనాలు పేకమేడల్లా కూలిపోయాయి. భూకంపం తెల్లవారుజామున చోటు చేసుకోవడంతో మృతుల సంఖ్య భారీగానే ఉండే అవకాశమున్నట్లు అధికార వర్గాలు భయపడుతున్నాయి. ఇప్పటికే దాదాపు 1600 మందికి పైగా మృతి చెందినట్లు వార్తలొస్తున్నాయి.

తుర్కియే భౌగోళికంగా భూకంప జోన్‌లో ఉంది. ఇక్కడ గతంలో కూడా భారీ భూకంపాలు సంభవించాయి. భూకంప లేఖినిపై 7.8 తీవ్రత నమోదైంది. సిస్మోగ్రాఫిక్‌ పరికరాలను రూపొందించాక.. అమెరికా జియోలాజికల్‌ సర్వే ప్రకారం ప్రపంచంలో చిలీ, అలాస్కా, సుమత్ర దీవులు, జపాన్‌ దీవులు, రష్యాలో వచ్చిన కొన్ని భూకంపాలు తొమ్మిదికి పైగా తీవ్రతతో చోటుచేసుకున్నాయి. ఇక తొమ్మిదవ అతిపెద్ద భూకంపం 1950లో అస్సాం,టిబెట్‌ సరిహద్దుల్లో చోటు చేసుకొంది. 

రికార్డుల్లో నమోదైన అతిపెద్ద భూకంపం..

1960 మే 22న చిలీలోని బయో-బయో ప్రాంతంలో 9.5 తీవ్రతతో భూమి దాదాపు 10 నిమిషాలు కంపించింది. రికార్డుల్లో నమోదైన భూకంపాల్లో ఇదే అతిపెద్దది. సముద్రంలో 25 మీటర్ల ఎత్తున ఏర్పడ్డ  రాకాసి అలలు దక్షిణ చిలీ, హవాయి, జపాన్‌, ఫిలిప్పీన్స్‌, తూర్పు న్యూజిలాండ్, ఆస్ట్రేలియా తీరాలను తాకాయి.  ఈ భూకంపం, సునామీల్లో చనిపోయిన వారి సంఖ్య 1,000 నుంచి 6,000 మధ్య ఉంటుంది. దాదాపు నాలుగు బిలియన్‌ డాలర్ల ఆస్తినష్టం చోటు చేసుకొంది.

పండగరోజున వణికించి..

1964 అలాస్కాలో భారీ భూకంపం వచ్చింది. ఆ రోజు గుడ్‌ఫ్రైడే. భూకంప లేఖినిపై 9.2 తీవ్రతతో 4.38 నిమిషాలు భూమి కంపించింది. ఇప్పటి వరకు నమోదైన భూకంపాల్లో రెండో అతిపెద్దది. చాలా చోట్ల భూమి చీలిపోయింది. ఇళ్లు, ఇతర నిర్మాణాలు నేలమట్టం అయ్యాయి. భూకంపానికి  తొమ్మిది మంది  ప్రాణాలు కోల్పోయారు. ఈ భూకంపం నుంచి పుట్టిన సునామీ అలల కారణంగా 131 మంది మరణించారు. సునామీ అలలు పెరూ, మెక్సికో, జపాన్‌, న్యూజిలాండ్‌ దేశాలను తాకాయి. 

సుమత్ర భూకంపం ఓ పీడకల..

2004 డిసెంబర్‌ 26వ తేదీన సుమత్రా తీరంలోని సముద్ర ప్రాంతంలో 9.1 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. భూకంప లేఖనిపై నమోదైన మూడో అతిపెద్ద భూకంపం ఇదే. ఈ భూకంపం నుంచి పుట్టిన అలలు 14 దేశాల తీరాలను అతలాకుతలం చేసి మొత్తం 2,27,898 మంది ప్రాణాలను  బలిగొంది. మానవ చరిత్రలో చవిచూసిన అతిపెద్ద  ఉపద్రవాల్లో ఇది కూడా ఒకటి.  భూకంపం వచ్చిన రెండు గంటలకు రాకాసి అల ఒకటి భారత్‌లో అండమాన్‌-నికోబార్‌ దీవులు, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు తీరాలను తాకింది. కేరళలో దీని ప్రభావం కనిపించింది. రెండు నుంచి ఐదు సునామీ అలలు తీరాలను తాకినట్లు రికార్డులు చెబుతున్నాయి. 

2011లో జపాన్‌లో భూకంపం..

జపాన్‌ చరిత్రలో అతిపెద్ద భూకంపం 2011లో నమోదైంది. టొహోకు వద్ద 9.1 తీవ్రతతో భూకంపం వచ్చింది. దీంతో దాదాపు 40 మీటర్ల ఎత్తుతో భయంకరమైన సునామీ అలలు విరుచుకుపడ్డాయి. దాదాపు 15,500 మంది మరణించారు. 4.5లక్షల మంది నిరాశ్రయులైపోయారు. ఇక ఫుకుషిమా అణు రియాక్టర్‌ ధ్వంసమై ప్రజలను బెంబేలెత్తించింది. 1986 నాటి చెర్నోబిల్‌ అణు విద్యుత్‌ ప్లాంటు దుర్ఘటన తరవాత ఇది రెండో అతిపెద్ద  అణుప్రమాదం. ఈ ఘటన తర్వాత 12 లక్షల టన్నుల రేడియోధార్మిక జలాలను అక్కడకు దూరంగా ఉన్న ఓ ప్రదేశంలో ఉంచిన వెయ్యి ట్యాంకుల్లోకి తరలించారు. ఈ జలాల్లో పెద్ద మొత్తంలో సీజియం, ట్రీటియం, కోబాల్ట్‌, కార్బన్‌-12 లాంటి రేడియోధార్మిక ఐసోటోప్‌లు ఉన్నాయి. 

వెంటాడి ప్రాణాలు తీసిన రాకాసి అలలు..

రష్యాకు చెందిన కమ్చట్కా ద్వీపకల్పంలో 1952లో 9 తీవ్రతతో భారీ భూకంపం వచ్చింది. ఇది దాదాపు 18 మీటర్లున్న మూడు భారీ సునామీ అలలను పుట్టించింది. సెవెరే-కురిల్స్క్‌ ప్రాంతంపై ఇవి పెను ప్రభావం చూపాయి. భూకంపం వచ్చిన వెంటనే ఇక్కడి ప్రజలు ప్రాణభయంతో సమీపంలోని కొండలపైకి పారిపోయారు. దీంతో తొలి సునామీ అల నుంచి తప్పించుకొన్నారు. కానీ, వీరు తిరిగి ఇళ్లకు వచ్చాక  రెండో సునామీ అల విరుచుకుపడింది. ఇక్కడ నివసించే మొత్తం 6,000 మందిలో 2,336 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత సోవియట్‌ ప్రభుత్వం ప్రజలను ఇక్కడి నుంచి ఖాళీ చేయించి వేరే చోట పునరావాసం ఏర్పాటు చేసింది. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు