Hinduja group: హిందుజా కుటుంబ సభ్యులు నలుగురికి జైలు శిక్ష

భారతీయ మూలాలున్న సంపన్న హిందుజా గ్రూప్‌ కుటుంబ సభ్యులు నలుగురికి స్విట్జర్లాండ్‌లోని జెనీవా కోర్టు జైలు శిక్ష విధించింది.

Published : 22 Jun 2024 05:27 IST

ఇంటి పనివాళ్లను వేధించిన కేసులో స్విట్జర్లాండ్‌ కోర్టు తీర్పు

జెనీవా: భారతీయ మూలాలున్న సంపన్న హిందుజా గ్రూప్‌ కుటుంబ సభ్యులు నలుగురికి స్విట్జర్లాండ్‌లోని జెనీవా కోర్టు జైలు శిక్ష విధించింది. ఇంటి పనివారికి తక్కువ వేతనాలు ఇవ్వడంతో పాటు వేధింపులకు గురిచేశారనే ఆరోపణలపై విచారణ జరిపిన న్యాయస్థానం శుక్రవారం తీర్పు వెలువరించింది. మానవ అక్రమ రవాణాకు పాల్పడుతున్నారనే తీవ్రమైన నేరారోపణను తోసిపుచ్చింది. నాలుగు నుంచి నాలుగున్నర ఏళ్ల పాటు జైలు శిక్షపడిన వారిలో ప్రకాశ్‌ హిందుజా, ఆయన భార్య కమల్, కుమారుడు అజయ్, కోడలు నమ్రత ఉన్నారు. నిరక్షరాస్యులైన భారతీయులను తీసుకొచ్చి జెనీవాలోని తమ విలాసవంతమైన విల్లాలో సేవకులుగా నియమించుకున్నారని, వారి పాస్‌పోర్టులను ప్రకాశ్‌ హిందుజా కుటుంబం తీసేసుకుందని ప్రాసిక్యూషన్‌ ఆరోపించింది. వేతనాలను స్విస్‌ కరెన్సీలో కాకుండా రూపాయల్లో చెల్లిస్తున్నారని, అదీ కూడా సేవకుల చేతికి ఇవ్వకుండా భారత్‌లోని వారి బ్యాంకు ఖాతాల్లో జమచేస్తున్నారని తెలిపింది. రోజుకు 18 గంటలకు పైగా పనిచేయించుకోవడం, తగు విశ్రాంత సమయాన్ని ఇవ్వకపోవడం, విల్లాను వదిలి వెళ్లటానికి అనుమతించకపోవడం తదితర నేరారోపణలను మోపింది. స్విట్జర్లాండ్‌ చట్టాలను ఉల్లంఘించారని ప్రాసిక్యూషన్‌ ఆరోపించింది. తీర్పు వెలువడే సమయంలో నిందితులు నలుగురు కోర్టులో లేరు. వారి మేనేజర్‌ ఒకరు హాజరయ్యారు. అతనికి కోర్టు 18 నెలల జైలు శిక్ష విధించినప్పటికీ అమలు చేయకుండా నిలిపివేసింది. ఈ తీర్పును ఉన్నత న్యాయస్థానంలో సవాల్‌ చేస్తామని ప్రకాశ్‌ హిందుజా తరఫు న్యాయవాది తెలిపారు. 2007లోనూ ఇవే తరహా నేరాలకు కోర్టు... ప్రకాశ్‌ హిందుజాను దోషిగా తేల్చింది. రెండు దశాబ్దాల కిందట స్విస్‌ పౌరసత్వాన్ని పొందిన ఈ కుటుంబం పన్నులకు సంబంధించిన కేసును కూడా ఎదుర్కొంటోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని