Hong Kong: 5 లక్షల విమాన టికెట్లు ఫ్రీ.. పర్యాటకులకు హాంకాంగ్‌ ఆఫర్‌!

హాంకాంగ్‌ పర్యాటకాన్ని పునరుద్ధరించేందుకు స్థానిక యంత్రాంగం ‘హలో హంకాంగ్‌’ పేరిట వినూత్న కార్యక్రమాలు చేపట్టనుంది. ఇందులో భాగంగా సందర్శకులకు 5 లక్షల విమాన టికెట్లను ఉచితంగా అందజేస్తామని తాజాగా ప్రకటించింది.

Published : 03 Feb 2023 02:24 IST

హాంకాంగ్‌: కొవిడ్‌(Covid) పరిస్థితులతో దారుణంగా దెబ్బతిన్న తమ పర్యాటక రంగాన్ని(Tourism) పునరుద్ధరించేందుకు హాంకాంగ్‌ (Hong Kong) నడుం బిగించింది. ప్రపంచవ్యాప్తంగా సందర్శకులను ఆకర్షించేందుకుగానూ వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుడుతోంది. ఈ క్రమంలోనే 5 లక్షల విమాన టికెట్లు ఉచితంగా అందజేస్తామని అక్కడి పాలన యంత్రాంగం తాజాగా ప్రకటించడం గమనార్హం. ఈ మేరకు హాంకాంగ్‌ సీఈవో జాన్ లీ ‘హలో హాంకాంగ్ (Hello, Hong Kong)’ అనే పర్యాటక ప్రచారాన్ని ప్రారంభించారు. సందర్శకులను ఆకర్షించేందుకు 5 లక్షల ఉచిత విమాన టిక్కెట్లను అందజేస్తామని చెప్పారు. ‘హాంకాంగ్ ఇప్పుడు చైనాతోపాటు మొత్తం ప్రపంచంతో అనుసంధానమై ఉంది. ఐసొలేషన్‌, క్వారంటైన్‌ వంటి ఆంక్షలు లేవు. పర్యాటకులు, వ్యాపారవేత్తలు, పెట్టుబడిదారులకు ఇది సరైన సమయం’ అని తెలిపారు.

‘హలో హాంకాంగ్‌’ ప్రచారంలో భాగంగా ఇక్కడి మూడు విమానయాన సంస్థలు.. 2 బిలియన్ హాంకాంగ్ డాలర్ల (రూ.రెండు వేల కోట్లకుపైగా) విలువైన విమాన టికెట్లు అందజేస్తాయి. ఒకటి కొంటే ఒకటి ఉచితం, లక్కీ డ్రాలు, క్రీడల వంటి కార్యక్రమాల ద్వారా వాటిని అందజేయనుంది. ఈ ఏడాది మార్చి నుంచి ఆరునెలలపాటు ఇది కొనసాగుతుందన్నారు. సందర్శకులకు ప్రత్యేక ఆఫర్లు, వోచర్లు, ఇతర ప్రోత్సాహకాలూ ఇవ్వనుంది. ఈ వినూత్న కార్యక్రమాల ద్వారా దాదాపు 15 లక్షల మంది పర్యాటకులను ఆకర్షించాలనేది హాంకాంగ్‌ ప్రణాళిక. వేసవిలో హాంకాంగ్‌వాసులకూ అదనంగా 80 వేల విమాన టికెట్లు అందజేస్తామని హాంకాంగ్‌ ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ సీఈవో ఫ్రెడ్‌ లామ్‌ తెలిపారు.

కొవిడ్ సమయంలో హాంకాంగ్‌ ‘జీరో కొవిడ్‌’ విధానాన్ని పాటించింది. కఠిన నిబంధనలతో.. ప్రపంచ దేశాలతో సంబంధాలు తెంచుకుంది. సింగపూర్‌, జపాన్‌, తైవాన్‌ వంటి దేశాలతో పోల్చితే ఆంక్షలను నెమ్మదిగా సడలించింది. దీంతో పర్యాటక పోటీలో వెనుకంజ ఉంది. జనవరిలో చైనా ప్రధాన భూభాగంతో సరిహద్దును తిరిగి తెరిచినప్పటికీ.. పర్యాటకరంగ పునరుద్ధరణ మందగించింది. ఫలితంగా ఆర్థిక వ్యవస్థ దెబ్బతింది. మహమ్మారికి ముందు 2019లో హాంకాంగ్‌లో 5.6 కోట్ల మంది సందర్శకులు పర్యటించగా.. 2022లో ఆ సంఖ్య 2019తో పోల్చితే దాదాపు ఒక శాతం మాత్రమే. దీంతో పర్యాటకంలో గత వైభవాన్ని పొందేందుకు హాంకాంగ్‌ సంకల్పించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని