USA: భారత వ్యతిరేకి ఇల్హాన్‌ ఒమర్‌కు షాక్‌..!

అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్‌ పంతం నెగ్గించుకొన్నారు. డెమొక్రటిక్‌ పార్టీకి చెందిన ఇల్హాన్‌ ఒమర్‌ను కీలక కమిటీ నుంచి తొలగించారు. గతంలో ఇల్హాన్‌ చర్యలతో భారత్‌-అమెరికా సంబంధాలు దెబ్బతినే పరిస్థితి తలెత్తింది.  

Published : 04 Feb 2023 01:48 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: అమెరికా(USA) ప్రతినిధుల సభలో డెమొక్రటిక్‌ పార్టీ సభ్యురాలు ఇల్హాన్‌ ఒమర్‌కు రిపబ్లికన్లు షాకిచ్చారు. అత్యంత శక్తిమంతమైన హౌస్‌ ‘ఫారెన్‌ అఫైర్స్‌ (విదేశీ వ్యవహారాల) కమిటీ’ నుంచి తొలగించారు. ఆమె 2019లో ఇజ్రాయెల్‌, యూదులకు వ్యతిరేకంగా చేసిన ప్రకటనల చూస్తే ఫారెన్‌ అఫైర్స్‌ కమిటీలో ఉండటానికి అర్హురాలు కాదని రిపబ్లికన్‌ పార్టీ సభ్యులు వాదించారు. దీనిపై జరిగిన ఓటింగ్‌లో ఇల్హాన్‌కు వ్యతిరేకంగా 218, అనుకూలంగా 211 ఓట్లు వచ్చాయి. ఇల్హాన్‌ను తొలగించడాన్ని డెమొక్రటిక్‌ పార్టీ తప్పుపట్టింది. దీనిని రాజకీయ కక్షసాధింపు చర్యగా అభివర్ణించింది.

ఓటింగ్‌కు ముందు ఇల్హాన్‌ మాట్లాడుతూ ‘‘నేను ఒక్కసారి ఈ కమిటీలో లేనంతమాత్రాన.. నా గళాన్ని, నాయకత్వాన్ని అణచివేయలేరు. అవి బిగ్గరగా, బలంగా మారుతాయి’’ అని పేర్కొన్నారు. ఒమర్ తరచూ యూదు వ్యతిరేక వ్యాఖ్యలు చేయడం, ఆధారాల్లేని వాదనలను బలపర్చడం వంటివి చేస్తుంటారు. ప్రస్తుతం ప్రతినిధుల సభలో రిపబ్లికన్లకు మెజార్టీ ఉండటంతో ఇల్హాన్‌ను తొలగించారు. తాను ఎట్టి పరిస్థితుల్లో ఇల్హాన్‌ను ఆ కమిటీలో ఉండనీయబోనని రిపబ్లికన్‌ నేత మెకార్థీ గతేడాది జనవరిలోనే ప్రకటించారు. ప్రస్తుతం మెకార్థీ ప్రతినిధుల సభ స్పీకర్‌గా ఎన్నికయ్యారు.

భారత వ్యతిరేక వైఖరి..

గతేడాది ఏప్రిల్‌లో ఇల్హాన్‌ ఒమర్‌ భారత్‌-అమెరికా సంబంధాలు దెబ్బతినేలా ప్రవర్తించారు. ఆమె పాక్‌ ఆక్రమిత కశ్మీర్లో పర్యటించారు. ‘కశ్మీర్‌పై అమెరికా మరింత శ్రద్ధ పెట్టాలి’ అని వ్యాఖ్యానించారు. అప్పట్లో ఇమ్రాన్‌ ఖాన్‌తో ఆమె భేటీ అవడాన్నిభారత్‌ తీవ్రంగా పరిగణించింది. భారత్‌ ప్రాదేశిక సమగ్రతను ఆమె ఉల్లంఘించారని మన విదేశాంగ శాఖ అభ్యంతరం చెప్పింది. దీంతో అమెరికా విదేశాంగ శాఖ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఇల్హాన్‌ తన వ్యక్తిగత హోదాలో అక్కడకు వెళ్లిన అనధికారిక పర్యటన అని వెల్లడించింది. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు