Biden: బైడెన్‌ కుటుంబంపై విచారణకే అగ్రప్రాధాన్యం.. : రిపబ్లికన్ల ప్రకటన

అమెరికా ప్రతినిధుల సభలో రిపబ్లికన్లకు ఆధిపత్యం లభించడంతో బైడెన్‌పై దృష్టిపెట్టారు. అధ్యక్షుడి కుటుంబంపై దర్యాప్తు చేయడానికి అగ్ర ప్రాధాన్యం ఇస్తామని చెబుతున్నారు

Updated : 18 Nov 2022 12:09 IST

ఇంటర్నెట్‌డెస్క్: అమెరికా ప్రతినిధుల సభలో రిపబ్లికన్లకు ఆధిపత్యం లభించడంతో బైడెన్‌పై దృష్టిపెట్టారు. అధ్యక్షుడి కుటుంబంపై దర్యాప్తు చేయడానికి అగ్ర ప్రాధాన్యం ఇస్తామని చెబుతున్నారు. జోబైడెన్‌ కుమారుడు హంటర్‌ విదేశీ వ్యాపారాలపై దర్యాప్తు ఎదుర్కోవాల్సి ఉంటుందని రిపబ్లికన్లు ప్రకటించారు. వాస్తవానికి ఇప్పటికే హంటర్‌ బైడెన్‌పై ఫెడరల్‌ దర్యాప్తు జరుగుతోంది. అతడు నేరుగా ఎక్కడా పరిపాలనలో భాగం కాదు. కాకపోతే హంటర్‌పై దర్యాప్తు చేస్తే.. అతడి వ్యాపారాల్లో జోబైడెన్‌ జోక్యం వంటి విషయాలు బయటపడతాయని చెబుతున్నారు. ముఖ్యంగా గతంలో జోబైడెన్‌ ఉపాధ్యక్షుడిగా ఉన్నప్పటి విషయాలు వెలుగులోకి వస్తాయని పేర్కొన్నారు. 

గురువారం ఓ ప్రెస్‌కాన్ఫరెన్స్‌లో ప్రతినిధుల సభ పర్యవేక్షణ కమిటీ ఛైర్మన్‌ జేమ్స్‌ కోమర్‌ మాట్లాడుతూ.. ‘కుటుంబ వ్యాపార వ్యవహారాలకు సంబంధించి జోబైడెన్‌ అమెరికా ప్రజలకు అబద్ధాలు చెప్పారు. కుటుంబ వ్యాపారాలను బలోపేతం చేసుకోవడంలో అధ్యక్షుడి హస్తం ఉంది. ఒకరకంగా చెప్పాలంటే అత్యున్నత పదవిని దుర్వినియోగం చేశారు’ అని వెల్లడించారు. పన్ను ఎగవేత, వైర్‌ఫ్రాడ్‌ వంటి వాటిల్లో హంటర్‌ పేరు వచ్చింది. దీనిపై హంటర్‌ లాయర్‌ మాట్లాడుతూ.. తాము రిపబ్లికన్ల ప్రకటనలపై స్పందించమని పేర్కొన్నారు. ‘బైడెన్‌ కుటుంబ వ్యాపార వ్యవహారాలు జాతీయ భద్రతకు ముప్పుగా మారాయి’ అని ఒహియోకు చెందిన రిపబ్లికన్లు ట్వీట్‌ చేశారు. మరోవైపు ఈ దర్యాప్తులపై శ్వేతసౌధం స్పందించింది. ఇవన్నీ రాజకీయ ప్రేరేపితమైనవని వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని