Sri Lanka: శ్రీలంకను ముంచిన ఆ నలుగురు..!

శ్రీలంక ఆర్థికంగా కొనఊపిరి స్థితికి చేరింది.. మరి కొన్ని నెలల్లో దేశం మొత్తం దివాలా తీసే ప్రమాదం ఉంది. దాదాపు 2.2 కోట్ల మంది జీవితాలు ప్రమాదంలో పడ్డాయి. పరిస్థితి ఇంతగా దిగజారడానికి.. ప్రధానంగా రాజపక్సా కుటుంబంలోని నలుగురు అన్నదమ్ములే కారణం. వా

Updated : 07 Apr 2022 16:11 IST

 దేశ ఆర్థిక వ్యవస్థకు ఉచ్చుబిగించిన రాజపక్స కుటుంబం

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

శ్రీలంక ఆర్థికంగా కొనఊపిరిలో ఉంది.. మరి కొన్ని నెలల్లో దేశం మొత్తం దివాలా తీసే ప్రమాదం ఉంది. దాదాపు 2.2 కోట్ల మంది జీవితాలు ప్రమాదంలో పడ్డాయి. పరిస్థితి ఇంతగా దిగజారడానికి.. ప్రధానంగా రాజపక్స కుటుంబంలోని నలుగురు అన్నదమ్ములే కారణం. వారు దశాబ్దాలుగా అధికారం చలాయిస్తున్నారు. సంక్షోభం ప్రారంభం వరకు ఈ కుటుంబానికి చెందినవారు ప్రాతినిధ్యం వహించే మంత్రిత్వశాఖల వద్ద అత్యధిక బడ్జెట్‌ నిధులు ఉన్నాయి. ఇప్పటికీ ఇద్దరు సోదరులు దేశానికి అధ్యక్ష, ప్రధాని పదవులను వదలడంలేదు.

కుటుంబ పాలన ఇలా..

శ్రీలంకలో సంక్షోభం ముదిరి రాజీనామాల పర్వం మొదలు కాకముందు వరకు ప్రభుత్వ పాలనలో రాజపక్స కుటుంబీకులదే హవా. ప్రధానిగా మహింద రాజపక్స వ్యవహరిస్తుండగా.. ఆయన సోదరుడు గొటబాయ అధ్యక్షుడిగా బాధ్యతలు వహిస్తున్నారు. ఇక మరో సోదరుడు బసిల్‌ రాజపక్స ఆర్థిక మంత్రిగా ఉండగా.. ఇంకో సోదరుడు చమాల్‌ నీటి పారుదల శాఖామంత్రిగా ఉన్నారు. మహింద కుమారులు  కూడా ప్రభుత్వంలో కీలక పదవులను పొందారు. వీరిలో నమాల్‌ క్రీడా, యువజన శాఖ మంత్రిగా.. యషిత ప్రధాని కింద చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌గా వ్యవహరిస్తున్నారు. ఇక చమాల్‌ కుమారుడు  శశీంద్ర వరి,తృణధాన్యాల శాఖకు మంత్రిగా వ్యవహరిస్తున్నారు. ఎంపీలుగా, ఇతర రాజ్యాంగ పదవుల్లో కూడా భారీ ఎత్తున రాజపక్స బంధుగణమే తిష్టవేసింది. 

75శాతం బడ్జెట్‌ నిధులు వీరి వద్దే..

వివిధ కీలక శాఖలు రాజపక్స కుటుంబం కనుసన్నల్లో ఉండటంతో వాటికి వచ్చే నిధులపై పెత్తనం మొత్తం వారిదే. బ్లూమ్‌బెర్గ్‌ కథనం ప్రకారం 75శాతం శ్రీలంక బడ్జెట్‌ నిధులు ఈ కుటుంబ సభ్యుల వద్ద ఉన్న శాఖల ఆధీనంలో ఉన్నాయి. కానీ, శ్రీలంకలో సంక్షోభ నివారణకు వారు పెద్దగా చేసింది ఏమీలేదు. ఫలితంగా ఆ దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఎన్నడు చూడనంతగా ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుపోయింది. ఈ కుటుంబీకులు కొన్నేళ్ల నుంచి లోటుబడ్జెట్లు ప్రవేశపెట్టడం, భారీగా పన్ను రాయితీలను ప్రకటించడంతో అంతంత మాత్రంగా ఉన్న ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. ఎరువులకు విదేశీ మారకద్రవ్య చెల్లింపులు మిగల్చడానికి సేంద్రియ వ్యవసాయం వైపు మొగ్గడంతో వ్యవసాయ దిగుబడులు పూర్తిగా పడిపోయాయి.  ప్రస్తుతం శ్రీలంక వద్ద 2 బిలియన్‌ డాలర్లు ఉండగా.. చెల్లించాల్సిన అప్పులు 7 బిలియన్‌ డాలర్ల వరకు ఉన్నాయి. వీటిల్లో బిలియన్‌ డాలర్లను జులైలో బాండ్ల మెచ్యూరిటీలకు చెల్లించాలి. అంటే మరో మూడు నెలలే సమయం ఉంది.  

ఆ నలుగురిలో మూల స్తంభం..!

రాజపక్స సోదరుల్లో మహిందకు అత్యధికంగా ప్రజాకర్షణ ఉంది. 76ఏళ్ల మహింద ప్రస్తుతం ప్రధానిగా కొనసాగుతున్నారు. ఆయన 2004లో కూడా ఒక సారి ఈ పదవిలో ఉన్నారు. ఇక అధ్యక్షుడిగా 2005,2015ల్లో పనిచేశారు. 2009లో ఎల్‌టీటీఈ ఉద్యమాన్ని అణిచివేయడంతో మెజార్టీ వర్గమైన సింహళ బౌద్ధుల్లో భారీ మద్దతు లభించింది. ఎల్‌టీటీఈ అణచివేత సమయంలో దాదాపు 40,000 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఈ హత్యలపై దర్యాప్తునకు మహింద ఎప్పుడూ అంగీకరించలేదు. అంతేకాదు అక్కడ ఉన్న సింహళులు, తమిళులు మధ్య వైషమ్యాలను తొలగించేందుకు పెద్దగా ప్రయత్నించలేదనే విమర్శలున్నాయి. 

శ్రీలంక అప్పుల ఊబిలో కూరుకుపోవడానికి ఆద్యుడు కూడా మహిందే. 2007లో తొలిసారి క్యాపిటల్‌ మార్కెట్ల నుంచి సొమ్ముతేవడం మొదలుపెట్టాడు. ఇప్పుడు మొత్తం విదేశీ అప్పుల్లో వాటి వాటా 38శాతానికి సమానం. ఆయన చైనా నుంచి 7 బిలియన్‌ డాలర్లను అప్పుగా తెచ్చారు. ఇప్పుడు ఆ సొమ్ము వడ్డీతో కలుపుకొని కొండలాగా పెరిగిపోయింది. వాస్తవానికి ఈ అప్పు తెచ్చిన సొమ్ములో చాలా వరకు పక్కదారిపట్టింది. మొత్తం అప్పుల్లో చైనాకు చెల్లించాల్సినవే 10శాతం ఉన్నాయి. 

అన్నకు అండగా ‘ది టర్మినేటర్‌’

ప్రస్తుతం శ్రీలంకకు అధ్యక్షుడిగా ఉన్న 72 ఏళ్ల గొటబాయ రాజపక్స అన్నకు తగిన సోదరుడిగా నిలిచాడు. ఇతడికి అమెరికా-శ్రీలంక పౌరసత్వాలు ఉన్నాయి. పదవి కట్టబెట్టేందుకు ఏకంగా చట్టసవరణే చేశారు. మహింద అధ్యక్షుడిగా పనిచేసే రోజుల్లో గొటబాయ డిఫెన్స్‌ సెక్రటరీగా వ్యవహరించారు. ప్రత్యర్థులను అపహరించేందుకు ‘వైట్‌వ్యాన్స్‌’గా పిలిచే డెత్‌స్క్వాడ్‌లను నిర్వహించినట్లు ఆరోపణలు కూడా ఎదుర్కొన్నాడు. సొంత కుటుంబీకులు అతడిని ‘ది టర్మినేటర్‌’ అని పిలుస్తారు. ఎల్‌టీటీఈ ఉద్యమాన్ని అత్యంత దారుణంగా అణచివేసింది ఇతనే. 

మిస్టర్‌ పర్సంటేజ్‌..

70ఏళ్ల బాసిల్‌ రాజపక్సను శ్రీలంక ఆర్థిక మంత్రిగా గొటబాయ నియమించారు. ప్రభుత్వ వర్గాల్లో ‘మిస్టర్‌ టెన్‌ పర్సెంట్‌’గా పిలిచే బాసిల్‌పై లెక్కలేనన్ని అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ కాంట్రాక్టుల్లో ఆయన 10శాతం తీసుకొంటారనే పేరుంది. గొటబాయ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అతడిపై ఉన్న అవినీతి కేసులను ఎత్తివేశారు. 

బాడీ గార్డ్‌ నుంచి మంత్రిగా..

79 ఏళ్ల చమాల్‌ రాజపక్స ప్రస్తుతం ఇరిగేషన్‌మంత్రిగా ఉన్నారు. రక్షణశాఖలో కూడా ఇతని హవా నడుస్తుంది. మహింద అధ్యక్షుడిగా ఉన్న సమయంలో పార్లమెంట్‌ స్పీకర్‌గా  వ్యవహరించారు. దీంతోపాటు షిప్పింగ్‌, ఏవియేషన్‌ శాఖలను చూసిన అనుభవం కూడా ఉంది. పోలీస్‌ ఆఫీసర్‌గా కెరీర్‌ ప్రారంభించిన చమాల్‌ శ్రీలంక తొలి మహిళా ప్రధాని సిరిమావో బండారునాయకే వద్ద బాడీగార్డ్‌గా పనిచేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని