Updated : 22 Apr 2022 12:45 IST

Ukraine Crisis: రష్యాకు మింగుడుపడని మేరియుపొల్‌ భూగర్భనగరం..!

 ఉక్రెయిన్‌ దళాలకు కవచంగా మారిన కర్మాగారం

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

‘అజోవ్‌స్తల్‌’పై దాడులు చేయవద్దు.. దానిని ముట్టడించి కూర్చోండి.. పురుగు కూడా లోపలికి వెళ్లడానికి వీల్లేదు’ ఇదీ రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయిగుకు అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ఇచ్చిన ఆదేశం..! ఉక్రెయిన్‌ పారిశ్రామిక మణిహారాల్లో అజోవ్‌స్తల్‌ ఒకటన్న విషయం పుతిన్‌కు తెలుసు. అందుకే.. రష్యా దళాలు దానిని ధ్వంసం చేయకుండా నిలువరించారు. ఉక్రెయిన్‌ దళాలు ఈ కర్మాగారంలోని కిలోమీటర్ల కొద్దీ సొరంగాలను కవచంగా చేసుకొని రష్యా దళాలను ఎదుర్కొంటున్నాయి. దీంతో ప్రపంచం దృష్టి మొత్తం మేరియుపొల్‌ భూగర్భనగరంగా పేరుపడిన ‘అజోవ్‌స్తల్‌’పై పడింది.

ఐరోపాలో అత్యుత్తమ ఉక్కుకర్మాగారం..

అజోవ్‌స్తల్‌ ఉక్కు కర్మాగారం ఏటా దాదాపు 40 లక్షల టన్నుల ముడి ఇనుమును ఉత్పత్తి చేస్తుంది. ఇది మేరియుపొల్‌ ఆర్థిక వ్యవస్థకు గుండెకాయ లాంటిది. వేల సంఖ్యలో ఉద్యోగులు దీనిలో పనిచేస్తున్నారు. ఈ ఉక్కు కర్మాగారాన్ని 1930ల్లో సోవియట్‌ హయాంలో నిర్మించారు. 1933 నుంచి ఉత్పత్తి ప్రారంభమైంది. కానీ, రెండో ప్రపంచ యుద్ధ సమయంలో జర్మన్‌ నాజీలు 1941 నుంచి 1943 వరకు దీనిని ఆక్రమించారు. ఆ తర్వాత తిరిగి సోవియట్‌ సేనలు దీనిని స్వాధీనం చేసుకొని సముద్రం ఒడ్డున నాలుగు మైళ్ల పొడవునా కర్మాగారం విభాగాలను నిర్మించాయి. ఈ కర్మాగారాన్ని చూస్తే మేరియుపొల్‌ కింద మరో నగరం ఉందా..? అనేట్లు ఉంటుంది. ఐరోపా ఖండంలోని అతిపెద్ద ఉక్కు కర్మాగారాల్లో ఇది కూడా ఒకటి.

సొరంగాల మయం..

ఈ కర్మాగారం 11 చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉంది. రైలు లైన్లు, గోదాములు, బొగ్గు కొలిమిలు,కర్మాగారాలు, చిమ్నీలు, సొరంగాలతో నిండి ఉంటుంది. ఇందులో దాదాపు 24 కిలోమీటర్లు పొడవైన సొరంగాలు ఉన్నాయి. సేనలు వేగంగా పొజిషన్లు మార్చుకొనేలా ఇవి సహకరిస్తాయి. అర్బన్‌ వార్ఫేర్‌కు అత్యంత అనుకూలమైన వాతావరణం ఇక్కడ ఉంది. దీనికి తోడు యుద్ధం మొదలు కావడానికి ముందే ఉక్రెయిన్‌ ఇక్కడికి నిత్యావసరాలు, మందుగుండు భారీ ఎత్తున తరలించింది. దీంతో ఉక్రెయిన్‌కు చెందిన 36వ మెరైన్‌ గ్రూప్‌, అజోవ్‌ బ్రిగేడ్‌లు వీటిల్లో దాక్కొని రోజుల తరబడి యుద్ధం చేస్తున్నాయి. దీంతో ఒక దశలో ఇక్కడ రష్యా దళాలు విసిగిపోయి.. నక్కిన వారిని బయటకు రప్పించేందుకు రసాయన ఆయుధాలతో దాడులు చేస్తాయని పశ్చిమ దేశాలు భయపడ్డాయి. రష్యా దళాలు మొండిగా ఈ భూభాగంలో ముందుకు వెళితే భారీగా నష్టపోతాయని పుతిన్‌ గ్రహించారు. అందుకే.. దీనిపై దాడి చేయకుండా కేవలం ముట్టడించి సమయం కోసం ఎదురు చూడాలని ఆదేశించారు. అజోవ్‌స్తల్‌పై దాడి అసాధ్యమని పుతిన్‌ అభిప్రాయపడ్డారు.

మాస్కో సన్నిహితుడి చేతికి.. 

2006 ఉక్రెయిన్‌ ఒలిగార్క్‌ రినాత్‌ అక్మితోవ్‌కు చెందిన మెట్‌ ఇన్వెస్ట్‌ గ్రూప్‌ దీనిని కొనుగోలు చేసింది. రినాత్‌కు రష్యాతో  మంచి సంబంధాలు ఉన్నాయి. 2014లో వేర్పాటు వాదం ఊపందుకోవడంతో రినాత్‌ ఉక్రెయిన్‌ వైపు మొగ్గాల్సి వచ్చింది. తాజాగా ఉక్రెయిన్‌పై రష్యా దాడిని కూడా రినాత్‌ ఖండించారు. రినాత్‌ ఉక్రెయిన్‌లోనే అత్యంత సంపన్నుడు.

ఆద్యంతం గోప్యంగా ఉక్రెయిన్‌..

అజోవ్‌స్తల్‌లో పోరాటం చేస్తోన్న వారి వివరాలు వెల్లడించే విషయంలో ఉక్రెయిన్‌ అత్యంత అప్రమత్తంగా ఉంటోంది. అక్కడ ఎంత మంది ఉన్నారన్న విషయాన్ని అస్సలు వెల్లడించడంలేదు. ఎందుకంటే పుతిన్‌ ప్రధాన లక్ష్యాల్లో ఒకటైన ‘అజోవ్‌ రెజిమెంట్‌’ కూడా ఈ ఉక్కు కర్మాగారంలోనే ఉంది. ఒకప్పుడు అజోవ్‌ రెజిమెంట్‌ వ్యవస్థాపకుడు ఆండ్రీ బిలెన్స్కీ  ఈ కర్మాగారాన్ని తమ దళానికి కోటగా అభివర్ణించాడు.  ఇక గురువారం పుతిన్‌ ప్రకటనను ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఎద్దేవా చేశారు. ఇప్పటి వరకు అజోవ్‌స్తల్‌ను రష్యా దళాలు స్వాధీనం చేసుకోలేకపోయాయన్నారు. మరోపక్క ఈ  స్టీల్‌ ప్లాంట్‌లో ఉన్న దళాలు ఆయుధాలు, ఆహారం, ఔషధాల కొరతను ఎదుర్కొంటున్నట్లు పలు వీడియోలు బయటకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అజోవ్‌స్తల్‌ బయట వేచి ఉన్న రష్యా దళాలు ఫ్యాక్టరీని పూర్తిగా చుట్టుముట్టి విజయం కోసం వేచి చూస్తున్నాయి.  మే9న మాస్కో సేనలు.. నాజీ జర్మనీపై సాధించిన విజయానికి గుర్తుగా ‘విక్టరీడే’ జరుపుకొంటాయి. నాటి కల్లా పుతిన్‌ నియోనాజీలుగా అభివర్ణించిన అజోవ్‌ రెజిమెంట్‌ను ఓడించాలన్నది రష్యా లక్ష్యంగా  కనిపిస్తోంది.

Read latest World News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని