Erdogan: జైలు నుంచి అధ్యక్షపీఠం వరకు.. ఎర్డోగాన్‌ రాజకీయ ప్రస్థానం..!

రెండు దశాబ్దాలుగా తుర్కియేను పాలిస్తున్న ఎర్డోగాన్‌ (Recep Tayyip Erdogan).. తాజా అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి విజయం సాధించారు.

Published : 29 May 2023 19:46 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: రెండు దశాబ్దాలుగా తుర్కియే పాలకుడిగా కొనసాగుతున్న తయ్యిప్‌ ఎర్డోగాన్‌ (Recep Tayyip Erdogan) తాజా అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి విజయం సాధించారు. మలి విడత కౌంటింగ్‌లో 52శాతం ఓట్లు సాధించడంతో మరో ఐదేళ్ల పాలనకు మార్గం సుగమం చేసుకున్నారు. ఒకవేళ ఈ దఫా పూర్తిస్థాయిలో పదవీకాలం చేపడితే ఈ శతాబ్దిలో తుర్కియేను (Turkey) అత్యధిక కాలం పాలించిన నేతగా రికార్డు సృష్టించనున్నారు. 2003లో తొలిసారి అధికార పగ్గాలు చేపట్టిన ఎర్డోగాన్‌ (Erdogan).. ప్రధానమంత్రిగా, అధ్యక్షుడిగా (2014) తుర్కియేను తనదైన శైలిలో ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన రాజకీయ ప్రస్థానాన్ని పరిశీలిస్తే..

నల్లసముద్రం తీర ప్రాంతంలోని ఓ కోస్టుగార్డు కుటుంబంలో 1954, ఫిబ్రవరిలో ఎర్డోగాన్‌ (Erdogan) జన్మించారు. ఐదుగురు పిల్లలకు మెరుగైన జీవితం కల్పించాలనే ఉద్దేశంతో.. ఆయన కుటుంబం ఇస్తాంబుల్‌కు మకాం మార్చింది. చిన్నతనంలో కుటుంబ అదనపు ఆదాయం కోసం నిమ్మరసం, నువ్వులతో తయారు చేసిన రొట్టెలను ఎర్డోగాన్‌ విక్రయించేవారు. ఇస్లామిక్‌ స్కూల్‌లో పాఠశాల విద్య తర్వాత.. ఇస్తాంబుల్‌లోని మర్‌మారా యూనివర్సిటీలో మేనేజిమెంట్‌ డిగ్రీ పూర్తిచేశారు.

జైలుకి వెళ్లి..

1970, 80దశకంలో సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాలుపంచుకున్న ఎర్డోగాన్‌.. నెక్మెట్టిన్ ఎర్బాకన్‌ స్థాపించిన రాజకీయ పార్టీలో చేరారు. 90వ దశకంలో పార్టీకి పెరిగిన ఆదరణతో.. 1994లో ఇస్తాంబుల్‌ మేయర్‌గా ఎంపికయ్యారు. నాలుగేళ్లపాటు ఎర్డోగాన్‌ ఆ పదవిలో కొనసాగారు. అయితే, కొంతకాలానికి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీపై నిషేధం విధించడంతో ఎర్డోగాన్‌ నాలుగు నెలలు జైలుకు వెళ్లాల్సి వచ్చింది. బయటకు వచ్చిన తర్వాత నూతన ఉత్సాహంతో ముందుకెళ్లిన ఆయన.. రాజకీయ మిత్రుడు అబ్దుల్లా గుల్‌ సహకారంతో 2001 ఆగస్టు నెలలో కొత్త పార్టీని స్థాపించారు. 2002లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో ఎర్డోగాన్‌ నేతృత్వంలోని ఏకేపీ లేదా జస్టిస్‌ అండ్‌ డెవలెప్‌మెంట్‌ పార్టీ మెజార్టీ సీట్లు సాధించింది. దీంతో 2003లో ప్రధానమంత్రిగా తొలిసారి బాధ్యతలు చేపట్టిన ఎర్డోగాన్‌ వెనక్కి తిరిగి చూసుకోలేదు. నేటికీ అధికారంలో కొనసాగుతున్న ఆయన.. ఇటు ఏకేపీ పార్టీకి ఛైర్మన్‌గా కొనసాగుతున్నారు.

పార్లమెంటరీ వ్యవస్థలో సంస్కరణలు..

2003 నుంచి ఇప్పటివరకు మూడుసార్లు ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయన.. దేశ ఆర్థికవృద్ధిని గాడిన పెడుతూ అంతర్జాతీయ స్థాయిలోనూ ఓ సంస్కర్తగా పేరు తెచ్చుకున్నారు. ఎన్నో మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు రూపకల్పన చేసి తుర్కియేను ఆధునికత వైపు పరుగులెత్తించారు. పేదరికం నుంచి లక్షల మంది బయటపడేసేందుకు కృషిచేయడంతో పాటు.. విద్య, న్యాయ రంగాల్లో సంస్కరణలు చేపట్టారు. ముఖ్యంగా మద్యం అమ్మకాలపై నియంత్రణ కొనసాగించారు. ఈ క్రమంలో అరబ్‌ దేశాల నుంచి ప్రశంసలు అందుకున్నారు. ఈజిప్టు, జోర్దాన్‌, లెబనాన్‌, మొరాకోతోపాటు యూఏఈలో నిర్వహించిన ఓ ఒపీనియన్‌ పోల్‌లో ఎర్డోగాన్‌ పనితీరుకు మెజార్టీ ప్రజలు జై కొట్టారు. 2010 ఏడాది చివర్లోనే పార్లమెంటు ఎన్నికల ప్రక్రియలో మార్పులకు ఉద్దేశించిన ప్రజాభిప్రాయసేకరణలోనూ విజయం సాధించారు. అదే సమయంలో ఎర్డోగాన్‌ నిరంకుశంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు మొదలయ్యాయి.

ప్రధాని నుంచి అధ్యక్షుడిగా..

2014లో తొలిసారి జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ఎర్డోగాన్‌ విజయం సాధించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడి అధికారాలను బలోపేతం చేస్తానని ప్రతిజ్ఞ చేసి, అందుకు కొంత సమయం పడుతుందని తన మద్దతుదారులకు హామీ ఇచ్చారు. 2016లో సైన్యంలోని కొందరి నుంచి తిరుగుబాటు ప్రయత్నం జరిగింది. వీటిని అణచివేసేందుకు ఎర్డోగాన్‌ అత్యవసర అధికారాలను ఉపయోగించడంతో సైనిక తిరుగుబాటు ప్రయత్నం విఫలమైంది. దీంతో ఆయన శక్తి మరింత పెరిగింది. ఇదే సమయంలో దేశంలో మొదలైన ఆందోళనలను అణచివేయడంతోపాటు మీడియాపైనా ఆంక్షలు విధించారు. అనేక విభాగాల్లో ప్రక్షాళన మొదలుపెట్టిన ఎర్డోగాన్‌.. అనేక విభాగాల్లో ఎంతోమందిని తొలగించారు. ఓ విదేశీ ఎన్‌జీఓను కూడా బహిష్కరించారు.

2017లో ప్రధానమంత్రి పదవిని రద్దు చేసి అధ్యక్షుడికే అన్ని అధికారాలు కట్టబెట్టే ప్రతిపాదనపై ప్రజాభిప్రాయం సేకరించారు. ఇందులోనూ ప్రజలు ఆయనకే మద్దతు తెలిపారు. దీంతో ప్రధాని పదవి రద్దై.. అధ్యక్షుడి చేతిలోనికే పాలన మొత్తం వచ్చేసింది. ఇది జరిగిన మరుసటి ఏడాది ఎన్నికల్లోనూ ఎర్డోగాన్‌ను విజయం వరించింది. అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత సామాజిక మాధ్యమాలు, వెబ్‌సైట్లపై ఆంక్షలకు ఉపక్రమించారు. మీడియాపై ఆంక్షలు విధించడంతోపాటు ఎంతోమంది జర్నలిస్టులను అరెస్టు చేయడం అంతర్జాతీయంగా విమర్శలు వచ్చాయి.

ప్రతికూల గాలి వీచినప్పటికీ..

2019లో తొలిసారిగా ఎర్డోగాన్‌ పార్టీ ఇస్తాంబుల్ మేయర్‌ పీఠాన్ని కోల్పోయింది. ప్రతిపక్ష రిపబ్లికన్‌ పీపుల్స్‌ పార్టీకి చెందిన ఎక్రెమ్‌ ఇమామోగ్లు ఈ పదవిని చేపట్టారు. అయితే, ప్రముఖులను అవమానపరిచారనే అభియోగాలపై ఇమామోగ్లుకు జైలుశిక్ష పడింది. 2023 ఎన్నికల్లో ఎర్డోగాన్‌కు ప్రత్యర్థిగా ఆయన గట్టిపోటీ ఇచ్చే ప్రమాదం ఉందని ఎర్డోగాన్‌ పార్టీ భావించింది. మరోవైపు 2022లో ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం మొదలుపెట్టిన తర్వాత.. ఇరు దేశాల మధ్య మధ్యవర్తిత్వం వహించేందుకు ఎర్డోగాన్‌ నేతృత్వంలోని తుర్కియే ముందుకు వచ్చింది. ఇలా మే 14న జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో తొలిరౌండు ఫలితాల్లో ఏ పార్టీకి సరైన మెజార్టీ రానప్పటికీ.. తుది ఫలితాల్లో ఎర్డోగాన్‌ పార్టీ విజయం సాధించింది. మలి విడత కౌంటింగ్‌లో 52.14శాతం ఓట్లతో విజయం సాధించిన ఎర్డోగాన్‌.. మరో ఐదేళ్ల పదవీకాలాన్ని నిలబెట్టుకున్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు