China zero-Covid: చైనాలో జీరో కొవిడ్‌ ఎత్తేస్తే 20 లక్షల మరణాలు!?

చైనా జీరో కొవిడ్‌ విధానంపై (China zero-Covid policy) ఆ దేశ పౌరుల నుంచి నిరసన వ్యక్తమవుతుండడంతో ఆంక్షలు సడలించాలని ప్రభుత్వం చూస్తోంది. ఒకవేళ పూర్తిగా జీరో కొవిడ్‌ ఎత్తివేస్తే భారీ సంఖ్యలో మరణాలు సంభవించే (Covid deaths) అవకాశం ఉందని పరిశోధకులు చెబుతున్నారు.

Published : 03 Dec 2022 13:46 IST

బీజింగ్‌: కొవిడ్‌ మహమ్మారి నుంచి ప్రపంచ దేశాలన్నీ దాదాపు బయటపడగా.. వైరస్‌ వెలుగు చూసిన చైనాను (china) మాత్రం పట్టిపీడిస్తోంది. వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోవడానికి ఆ దేశం జీరో కొవిడ్‌ విధానాన్ని అనుసరిస్తోంది. కఠిన లాక్‌డౌన్లను విధిస్తోంది. దీనిపై ఆ దేశ పౌరుల్లో నిరసన వ్యక్తమవుతోంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమ అసంతృప్తి గళాన్ని వినిపిస్తున్నారు. దీంతో జీరో కొవిడ్‌ విధానాన్ని సడలించేందుకు చైనా ముందుకొచ్చినట్లు తెలుస్తోంది. అయితే, పూర్తి స్థాయి ఆంక్షలు ఎత్తివేస్తే ఎదురయ్యే పరిణామాల పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. ఒకవేళ ఇప్పటికిప్పుడు ఆంక్షలను పూర్తిగా సడలిస్తే భారీ స్థాయిలో మరణాలు సంభవించే అవకాశం ఉందని పరిశోధకులు పేర్కొంటున్నారు. ప్రజల్లో హెర్డ్‌ ఇమ్యూనిటీ, వ్యాక్సినేషన్‌ రేటు తక్కువగా ఉండడం వంటివి అందుకు కారణాలని చెబుతున్నారు. శుక్రవారం నాటికి చైనాలో 5,233 కొవిడ్‌ సంబంధిత మరణాలు సంభవించగా.. 3.31 లక్షల మందిలో కొవిడ్‌ లక్షణాలు కనిపించాయి.

  • హాంకాంగ్‌ తరహాలో పూర్తిగా కొవిడ్‌ ఆంక్షలను సడలిస్తే మెయిన్‌ల్యాండ్‌ చైనాలో దాదాపు 20 లక్షల మరణాలు సంభవించే అవకాశం ఉందని గ్వాంగ్జీ ప్రాంతంలో ఉన్న సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ హెడ్‌ జౌ జియాటంగ్‌ అంచనా వేశారు. గత నెలలో షాంఘై జర్నల్‌లో ప్రచురితమైన తన పరిశోధనా పత్రంలో ఈ విషయం పేర్కొన్నారు. అలాగే కొవిడ్‌ కేసులు 23 కోట్లకు చేరే అవకాశం ఉందని అంచనా వేశారు.
  • చైనా, అమెరికాకు చెందిన పలువురు పరిశోధకులు ఈ ఏడాది మే నెలలో మరో అంచనాను వెలువరించారు. వ్యాక్సినేషన్‌ ప్రక్రియను వేగవంతం చేయకుండా, ఆరోగ్య మౌలిక సదుపాయాలు మెరుగుపర్చకుండా జీరో కొవిడ్‌ పాలసీ నుంచి చైనా పూర్తిగా వైదొలిగితే దాదాపు 15 లక్షల మరణాలు సంభవించే అవకాశం ఉందని వారు పేర్కొన్నారు. కొవిడ్‌ దశ పీక్‌కు చేరినప్పుడు ఇన్సింటివ్‌ కేర్‌లకు 15 రెట్ల డిమాండ్‌ ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేశారు. వ్యాక్సినేషన్‌పై దృష్టి పెడితే మరణాల సంఖ్య తగ్గే అవకాశం ఉందని వారు పేర్కొన్నారు.
  • జీరో కొవిడ్‌ను పూర్తిగా ఎత్తివేస్తే 13 లక్షల నుంచి 21 లక్షల మంది మరణించే అవకాశం ఉందని బ్రిటిష్‌ సైంటిఫిక్‌ ఇన్ఫర్మేషన్‌ అండ్‌ అనలటిక్స్‌ కంపెనీ ఎయిర్‌ఫినిటీ పేర్కొంది. వ్యాక్సినేషన్‌, బూస్టర్‌ రేట్‌ తక్కువగా ఉండడం, హైబ్రిడ్‌ ఇమ్యూనిటీ లేకపోవడం వంటి కారణాల వల్ల భారీగా మరణాలు సంభవించే అవకాశం ఉందని తెలిపింది. హాంకాంగ్‌లో ఫిబ్రవరిలో సంభవించిన బీఏ.1 వేవ్‌ను పరిగణనలోకి తీసుకుని అంచనా కట్టినట్లు తెలిపింది.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని