ukraine :పుతిన్‌ దాచిపెట్టాడు.. పై వాడు బయటపెట్టాడు

రక్తసిక్తమైన ఉక్రెయిన్‌లో అసువులు బాసిన ప్రజల్లో ఏ ఒక్కరి మరణానికి  సాక్ష్యాలు లేవు. రావు..

Published : 08 Apr 2022 02:00 IST

ఉపగ్రహ చిత్రాలు వాస్తవాలు చెబుతున్నాయి

దిల్లీ: రక్తసిక్తమైన ఉక్రెయిన్‌లో అసువులు బాసిన ప్రజల్లో ఏ ఒక్కరి మరణానికి  సాక్ష్యాలు లేవు. రావు.. రాలేవనే ధైర్యంతోనే రష్యన్‌ సైనికులూ, వారికి ఆదేశాలు జారీ చేసిన పుతిన్‌ సృష్టించిన మారణహోమం నాగరిక సమాజం జీర్ణించుకోలేకపోతోంది. ఇసుమంత  పశ్చాత్తాపం లేని రష్యన్‌ సేనలకు గుణపాఠం చెప్పాలనిపించిందేమో మాక్సర్‌ ఉపగ్రహ రూపంలో నిజానిజాలు ప్రపంచ ప్రజల కళ్లముందుకు వచ్చాయి. వాటిని ఆధారంగా చేసుకుని ఐక్యరాజ్య సమితి, హ్యూమన్‌ రైట్స్‌ వాచ్‌ బుచా హత్యలపై స్వతంత్ర దర్యాప్తును కోరుతున్నాయి.

ఉపగ్రహ చిత్రాలు చూపించిన దారుణాలు...

 మాక్సర్‌ ఉపగ్రహాలు బుచా వీధుల్లో మార్చి 30న రష్యన్‌ సైనికులు సృష్టించిన బీభత్సానికి సంబంధించి ఆధారాలను చూపించి రష్యన్‌ దళాలకు వ్యతిరేకంగా తిరుగులేని సాక్ష్యాలను చేకూర్చాయి. వీధుల్లో చెల్లాచెదురుగా ఉన్న  పౌరుల మృతదేహాలను చిత్రించాయి. మార్చి 31న తీసిన మరో చిత్రంలో బుచాలోని చర్చి మైదానంలో సామూహిక సమాధి ఉండే అవకాశం ఉందని చూపించింది. ఈ చిత్రంలో దాదాపు 45 అడుగుల పొడవున్న కందకం ఉంది. మార్చి 10 న తీసిన చిత్రం కందకం తవ్వడానికి ప్రారంభంలా కనిపిస్తోంది. మాక్సర్‌ గూగుల్‌ మాప్స్‌, గూగుల్‌ ఎర్త్‌ వంటి సంస్థలకు చిత్రాలు అందిస్తోంది. రష్యన్‌ దళాలు సృష్టించిన బీభత్సాన్ని డాక్యుమెంట్ రూపంలో అందించింది. ఈ సంస్థకు చెందిన నాలుగు ఉపగ్రహాలు అంతరిక్షంలో  ఉన్నాయి.

రష్యా నిరాకరణ

ఇంత జరిగినా రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ఏప్రిల్‌ 3 న చేసిన టెలిగ్రామ్‌ పోస్ట్‌లో హత్యలకు బాధ్యతను నిరాకరించింది. రష్యన్‌ సేనలు మార్చి 30 నాటికి ఉక్రెయిన్‌ నుంచి వెనుదిరిగినట్లు   చెబుతోంది.  మరో వైపు ఇతర దేశాల నుంచి వస్తోన్న నివేదికలు ఈ యుద్ధ నేరాలు అంతర్జాతీయ మానవ హక్కుల చట్టం ఉల్లంఘనపై తీవ్రమైన ప్రశ్నలను లెవనెత్తుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని