sudan: సూడాన్‌ పబ్లిక్‌ హెల్త్‌ ల్యాబ్‌ ఆక్రమణ.. డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిక

సూడాన్‌లోని (Sudan) పబ్లిక్‌ హెల్త్‌ ల్యాబ్‌ (Public Health Lab)ను సాయుధ బలగాలు ఆక్రమించుకోవడంపై డబ్ల్యూహెచ్‌వో ఆందోళన వ్యక్తం చేసింది. అనుకోనిదేదైనా జరిగి ల్యాబ్‌లోని వ్యాధికారక జీవాలు బయటకి వస్తే.. చాలా ప్రమాదమని హెచ్చరించింది.

Updated : 25 Apr 2023 18:09 IST

జెనీవా: సూడాన్‌లో (Sudan) చోటు చేసుకుంటున్న పరిణామాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఆందోళన వ్యక్తం చేసింది. అక్కడి సాయుధ బలగాలు సెంట్రల్ పబ్లిక్‌ ల్యాబ్‌ను (Public Central Lab) ఆక్రమించుకోవడాన్ని తప్పుబట్టింది. ఇందులో పోలియో, మీజిల్స్‌ సహా రకరకాల వ్యాధులకు సంబంధించిన నమూనాలు ఉన్నాయని, ఒక వేళ ప్రమాదవశాత్తు అవి బయటకి వస్తే జీవ వినాశనానికి దారిస్తాయని హెచ్చరించింది. ఈ చర్య ‘మానవాళికి ఇది చాలా చాలా ప్రమాదకరం’ అని సూడాన్‌లో డబ్ల్యూహెచ్‌వో ప్రతినిధి సయీద్‌ అబిద్‌ తెలిపారు. వీలైనంత త్వరగా బలగాలు అక్కడి నుంచి నిష్క్రమించాలని కోరారు. ‘‘ సాయుధ బలగాల్లోని ఓ వర్గం సెంట్రల్‌ పబ్లిక్‌ హెల్త్‌ ల్యాబ్‌ను ఆక్రమించింది. దీంతో జీవసంబంధమైన ప్రమాదం పొంచి ఉంది.’’ అని సయీద్‌ అబిద్‌ తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఆయన విలేకరులతో మాట్లాడారు.

దాదాపు ప్రతి దేశంలోనూ ఓ సెంట్రల్‌ పబ్లిక్‌ ల్యాబ్‌ ఉంటుంది. దేశంలో గతంలో విజృంభించిన వివిధ వ్యాధులకు సంబంధించిన వైరస్‌లను, నమూనాలను ఇక్కడ భద్రపరుస్తారు. భవిష్యత్‌లో మళ్లీ వ్యాధులు చెలరేగితే వాటిపై పరిశోధనలు చేసేందుకు ఈ నమూనాలు ఉపయోగపడతాయి. ఈ ల్యాబ్‌ మొత్తం కేంద్ర ఆరోగ్యశాఖ పర్యవేక్షణలో జాతీయ వ్యాధుల నియంత్రణ విభాగం అధీనంలో ఉంటుంది. ఒకవేళ ఏదైనా వైరస్‌ ఈ ల్యాబ్‌ నుంచి బయటకి వచ్చిందంటే.. రోజుల వ్యవధిలోనే దేశవ్యాప్తంగా విజృంభించే అవకాశం ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా ప్రజలను ముప్పుతిప్పలు పెట్టిన కరోనా వైరస్సే ఇందుకు ఉదాహరణ. ఆ వైరస్‌ చైనాలోని వూహాన్‌ ల్యాబ్‌ నుంచే బయటకి వచ్చి ఉంటుందని పలువురు శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్న సంగతి తెలిసిందే. ఇంతటి కీలకమైన పబ్లిక్‌ హెల్త్‌ ల్యాబ్‌ను సాయుధ బలగాలు స్వాధీనం చేసుకోవడంపై డబ్ల్యూహెచ్‌వో తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. అనుకోనిదేదైనా జరిగి అక్కడి వైరస్‌లుగానీ, వ్యాధికారక జీవాలుగానీ బయటకి వస్తే భారీ జీవసంబంధ ప్రమాదం చోటుచేసుకునే అవకాశం ఉందని హెచ్చరించింది.

సూడాన్‌పై పట్టు కోసం ఆర్మీ, ఆర్‌ఎస్‌ఎఫ్‌ బలగాల మధ్య గత 10 రోజులుగా భీకర పోరు సాగుతున్న విషయం తెలిసిందే. 2021 అక్టోబరులో సైనిక తిరుగుబాటుతో సూడాన్‌లో తాత్కాలిక ప్రభుత్వం కుప్పకూలింది. ఆ తర్వాత పారామిలిటరీ గ్రూపు ఆర్‌ఎస్‌ఎఫ్‌తో సైన్యానికి విభేదాలు పెరిగాయి. ర్యాపిడ్ సపోర్ట్‌ ఫోర్సెస్‌ను సైన్యంలో విలీనం చేసేందుకు సూడాన్‌ ఆర్మీ రూపొందించిన ప్రతిపాదన.. ఆర్మీ- పారా మిలిటరీ బలగాల మధ్య ఘర్షణలకు దారితీసింది. ఈ విషయమై సైన్యాధినేత అబ్దెల్‌ ఫతా అల్‌ బుర్హాన్‌, పారా మిలటరీ కమాండర్‌ మహ్మద్‌ హందాన్‌ డగ్లో మధ్య కొన్ని వారాలుగా నెలకొన్న విభేదాలు తారస్థాయికి చేరాయి. ఈ క్రమంలోనే ఆర్మీ, పారామిలటరీ బలగాల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని