Human Trafficking: ఉద్యోగాల ఆశ చూపించి... వ్యభిచారంలోకి దింపి..

ఆగ్నేయాసియా దేశమైన లావోస్‌ (Laos)లోని యువతులను ఆకర్షణీయమైన ప్రకటనలతో ఉచ్చులో దింపుతున్నారు. ఉద్యోగాలను ఆశగా చూపి బలవంతంగా వ్యభిచారంలోకి దించుతున్నారు.

Published : 04 Mar 2023 21:17 IST

వియంటిన్‌: మంచి అందమైన యువతి భార్యగా కావాలి.. ఆకర్షణీయమైన వేతనం (Salary).. ఇలాంటి ప్రకటనలు (Human Trafficking) ఆగ్నేయాసియా దేశమైన లావోస్‌ (Laos) సామాజిక మాధ్యమాల్లో తరచుగా కనిపిస్తుంటాయి. అయితే ఈ ప్రకటనల ద్వారా వారిని చైనా నేరస్థులు ఆకర్షించి బలవంతంగా వ్యభిచారంలోకి దింపుతున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి.

గ్రామీణ ప్రాంతాలపైనే గురి

లావోస్‌ పేద దేశం కావడంతో ఇతర దేశాలకు వెళ్లి సంపాదించాలని అనేకమంది ఆశిస్తుంటారు. వీరి అవసరాలను చైనా వ్యవస్థీకృత నేరస్థుల ముఠాలు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నాయి. పట్టణ ప్రాంతాల్లో ఈ నేరాలపై అవగాహన ఉండటంతో ఎక్కువ మంది వీరి ఉచ్చులో పడటంలేదు. అయితే అమాయకులైన గ్రామీణ యువతులు వీరికి చిక్కుతున్నట్టు స్థానిక ఎన్జీవోలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఈ యువతులకు కనీస వేతనం కూడా ఇవ్వకుండా నానాహింసలకు గురిచేస్తున్నట్టు సమాచారం. చైనాకు వెళ్లిన అనంతరం అక్కడ నుంచి తిరిగిరాలేక నరకకూపాల్లో ఉండలేక నానా అవస్థలు పడుతున్నారని వారి బంధువులు వాపోతున్నారు. అనేక ప్రాంతాల్లో పేద తల్లిదండ్రులు తమ కుమార్తెలను చైనా వారికిచ్చి పెళ్లిచేసి పంపించివేస్తున్నారు.

ఆర్థిక సాయం అందించి

లావోస్‌ పేద దేశమని, ఆదుకునేందుకు పెట్టుబడులు పెడుతున్నామని చైనాకు చెందిన పెట్టుబడిదారులు ముందుకు వచ్చారు. మెకాంగ్‌ నదీ తీరంలోని థాయ్‌లాండ్‌, మియన్మార్‌, లావోస్‌ కూడలిలో ఏకంగా ప్రత్యేక ఆర్థిక మండలిని కూడా ఏర్పాటు చేశారు. అయితే ఈ ఆర్థికమండలి చైనా వ్యాపారులకే అనుకూలిస్తోందని స్థానికులకు ఏ మాత్రం కాదని ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. లావోస్‌ నుంచి చైనాకు రైలుమార్గాన్ని చైనా కంపెనీలు నిర్మించాయి. అయితే ఆదాయం మాత్రం చైనాకే వెళుతోంది.

తప్పనిసరి పరిస్థితుల్లో వ్యభిచారంలోకి..

అసలే బీదదేశమైన లావోస్‌లో కరోనా అనంతరం పరిస్థితులు మరింత దిగజారాయి. దీంతో పేద యువతులు, మహిళలను వ్యవస్థీకృత ముఠాలు బలవంతంగా వ్యభిచారంలోకి  నెట్టివేస్తున్నాయి. ఇటీవల కాలంలో లావోస్‌తో సరిహద్దులను చైనా తెరవడంతో చైనీయుల రాక తిరిగి మొదలైంది. దీంతో పాటు వ్యవస్థీకృత నేరాల ముఠాలు రంగంలోకి దిగాయి. సెజ్‌ ప్రాంతంలో అడుగుపెట్టిన పలువురు మహిళలు, యువతుల జాడ తెలియకపోవడంపై నిరసనలు వ్యక్తమవుతున్నా స్థానిక యంత్రాంగం పట్టించుకోవడం లేదు. ఈ సెజ్‌ చైనా సంస్థల ఆధీనంలో ఉండటం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని