Dubai Airport: 2 విమానాలు ఒకే రన్‌వేపైకి.. తక్షణమే స్పందించిన సిబ్బంది..!

ప్రమాదాన్ని గుర్తించి సిబ్బంది వెంటనే స్పందించడంతో రెండు ఎమిరేట్స్ విమానాల మధ్య పెను ప్రమాదం తప్పింది. 

Published : 14 Jan 2022 21:16 IST

దుబాయ్‌: ప్రమాదాన్ని గుర్తించి సిబ్బంది వెంటనే స్పందించడంతో రెండు ఎమిరేట్స్ విమానాల మధ్య పెను ప్రమాదం తప్పింది. భారత్‌కు బయలుదేరిన విమానాల్లోని వందల ప్రయాణికుల ప్రాణాలు నిలిచాయి. గత ఆదివారం దుబాయ్‌ ఎయిర్‌పోర్టులో రెండు విమానాలు టేకాఫ్‌ సమయంలో ఒకే రన్‌వేపైకి రావడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ఎమిరేట్స్ విమానాల షెడ్యూల్ ప్రకారం, రెండూ బయలుదేరే సమయాల మధ్య ఐదు నిమిషాల తేడా మాత్రమే ఉండటం ఈ పరిస్థితికి దారితీసింది.

EK-524 (దుబాయ్ నుంచి హైదరాబాద్‌), EK-568 (దుబాయ్ నుంచి బెంగళూరు) పేరిట ఉన్న రెండు విమానాలు ఐదు నిమిషాల వ్యవధిలో గమ్యస్థానం వైపు ప్రయాణించేందుకు సిద్ధమయ్యాయి. బెంగళూరుకు వెళ్లాల్సిన విమానం టేకాఫ్‌ అవుతుండగా.. హైదరాబాద్ వెళ్లాల్సిన విమానం వేగంగా రన్‌వే వైపు దూసుకురావడం ప్రారంభించింది. దూసుకొస్తున్న ప్రమాదాన్ని గుర్తించిన ఏటీసీ అధికారులు వెంటనే స్పందించారు. వెంటనే హైదరాబాద్‌కు వచ్చే విమానానికి టేకాఫ్‌ తిరస్కరించడంతో అది నెమ్మదించింది. అనంతరం బెంగళూరుకు వెళ్లాల్సిన విమానం బయలుదేరగా.. EK-524 విమానం ట్యాక్సీ బేకి వెళ్లి, కొన్ని నిమిషాల తర్వాత టేకాఫ్‌ అయ్యింది.

తీవ్రమైన భద్రతాలోపాన్ని బయటపెట్టిన ఈ ఘటనపై యూఏఈకి చెందిన విమానయాన దర్యాప్తు సంస్థ ఏఏఐఎస్‌ దర్యాప్తు ప్రారంభించింది. అలాగే ఎమిరేట్స్‌ ఎయిర్‌లైన్స్‌ ఈ ఘటనను ధ్రువీకరించింది. ప్రయాణికుల భద్రతకే తాము అధిక ప్రాధాన్యత ఇస్తామని తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని