Twitter: అవును.. అందుకు చింతిస్తున్నా..!

దిగ్గజ సామాజిక మాధ్యమం ట్విటర్‌ వ్యవస్థాపకుడు జాక్‌ డోర్సే కీలక వ్యాఖ్యలు చేశారు.

Published : 05 Apr 2022 02:09 IST

ట్విటర్‌ వ్యవస్థాపకుడు జాక్‌ డోర్సే

వాషింగ్టన్‌: దిగ్గజ సామాజిక మాధ్యమం ట్విటర్‌ వ్యవస్థాపకుడు జాక్‌ డోర్సే కీలక వ్యాఖ్యలు చేశారు. యూజ్‌నెట్‌, ఐఆర్‌సీ, ఈ మెయిల్‌ వంటి సమాచార మార్పిడి వేదికలు అద్భుతంగా పనిచేస్తోన్న కాలంలో కేంద్రీకరణ విషయంలో తాను కొంత తప్పుచేశానని అన్నారు. తద్వారా ఇంటర్నెట్‌ దెబ్బతిన్న మాట వాస్తవమన్నారు. ప్రపంచ వ్యాప్తంగా వార్తల కవరేజీ, సమాచార వెల్లడికి ట్విటర్‌ కేంద్ర బిందువుగా మారిన నేపథ్యంలో జాక్‌ డోర్సే ఈ విధంగా స్పందించారు.

‘యూజ్‌నెట్‌ (Usenet), ఐఆర్‌సీ (irc), వెబ్‌తోపాటు ఈమెయిల్‌ (w PGP - ప్రెటీ గుడ్‌ ప్రైవసీ) వంటి సమాచార మార్పిడి వేదికలు అద్భుతంగా పనిచేస్తున్న రోజుల్లో.. ఆవిష్కరణను కేంద్రీకరించడం వంటి చర్యలు ఇంటర్నెట్‌ను దెబ్బతీశాయి. అందుకు నేను కూడా కొంతవరకు బాధ్యుడనే. ఆ వాస్తవాన్ని గ్రహించాను. అందుకు చింతిస్తున్నాను’ అని ట్విటర్‌ వ్యవస్థాపకుడు జాక్‌ డోర్సే ట్విటర్‌లో పేర్కొన్నారు. అయితే, సామాజిక మాధ్యమ దిగ్గజ సంస్థగా ఎదిగిన ట్విటర్‌ను 2006లో స్థాపించిన జాక్‌ డోర్సే.. సంస్థ సీఈఓ బాధ్యతల నుంచి 2021లో తప్పుకున్న సంగతి తెలిసిందే.

ఇదిలాఉంటే, మార్కెట్‌లోకి వచ్చిన కొన్ని సంవత్సరాల్లోనే ఇంటర్నెట్‌ ప్రపంచంపై ట్విటర్‌ తిరుగులేని ఆధిపత్యాన్ని సాధించుకుంది. మునుపటి సమాచార మార్పిడి వేదికలను పక్కకు నెట్టి.. ప్రభుత్వాలు కూడా అధికారిక సమాచారం వెల్లడికి దీనిపైనే ఆధారపడే స్థాయికి ఎదిగింది. ఈ క్రమంలో ఎన్నో ఆరోపణలు ఎదుర్కొంటోన్న ట్విటర్‌.. పలు దేశాల్లో నిషేధానికి గురయ్యింది. ఈ నేపథ్యంలో సమాచార మార్పిడికి అద్భుతమైన వేదికలు ఉన్న సమయంలో కేంద్రీకరణతో ఇంటర్నెట్‌కు నష్టం వాటిల్లిందని సంస్థ సహవ్యవస్థాపకుడు అంగీకరించడం గమనార్హం. ముఖ్యంగా అత్యంత ప్రజాదరణ పొందిన ట్విటర్‌ రూపకల్పనలో తప్పిదం జరిగిందంటూ బహిరంగంగా ఒప్పుకోవడం కూడా చాలా అరుదైన విషయమేనని విశ్లేషకులు చెబుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని