Pope Francis: నేను ఆరోగ్యంగా ఉన్నా: పోప్‌ ఫ్రాన్సిస్‌

తాను ఆరోగ్యంగానే ఉన్నానని, ఆదివారం యధావిధిగా భక్తులను ఉద్దేశిస్తూ ప్రసంగిస్తానని పోప్‌ ఫ్రాన్సిస్‌ (Pope Francis) అన్నారు. శ్వాస సంబంధమైన సమస్యలతో రోమ్‌లోని జెమెల్లీ ఆస్పత్రిలో చేరిన ఆయన తాజాగా డిశ్చార్జి అయ్యారు.

Updated : 01 Apr 2023 19:50 IST

రోమ్‌: శ్వాస తీసుకోవడంతో ఇబ్బంది తలెత్తి.. ఆస్పత్రిలో చేరిన క్రైస్తవ మతపెద్ద పోప్‌ ఫ్రాన్సిస్‌ (Pope Francis) తాజాగా డిశ్చార్జి అయ్యారు. శనివారం సాయంత్రం తిరిగి వాటికన్‌సిటీకి పయనమయ్యారు. శ్వాస, ఊపిరితిత్తుల సమస్యలతో బుధవారం పోప్‌ఫ్రాన్సిస్‌ రోమ్‌లోని జెమెల్లీ ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. పరీక్షించిన వైద్యులు సమస్య నయమైందని నిర్ధారించుకున్న తర్వాత ఆయన్ను ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు.  ఆస్పత్రి నుంచి కారులోకి ఎక్కేంత వరకు చేతికర్ర సాయంతో ఆయనే నడిచి వచ్చారు. ఆస్పత్రి ఎదుట తన కోసం వేచి చూస్తున్న క్రైస్తవ భక్తులు, మీడియా వాళ్లతో కాసేపు మాట్లాడారు. ‘నేను ఆరోగ్యంగానే ఉన్నాను. ఆదివారం యధావిధిగా సెయింట్‌ పీటర్స్‌ స్క్వేర్‌ నుంచి భక్తులను ఉద్దేశించి మాట్లాడుతాను’ అని పోప్‌ తెలిపారు.

కారులోకి ఎక్కే ముందు కుమార్తెను కోల్పోయి ఆస్పత్రిలో రోదిస్తున్న ఓ మాతృమూర్తి వద్దకు వెళ్లి పోప్ పరామర్శించారు. మృతిరాలి ఆత్మకుశాంతి చేకూరేలా తల్లిదండ్రులతో కలిసి ప్రార్థనలు చేశారు. మోచేయి విరిగిపోయిన ఓ బాలుడిని చూస్తూ కారులోంచి చేతులు ఊపుతూ పలకరించారు. ఆస్పత్రిలో ఉన్నప్పుడు మీరు భయపడ్డారా? అని విలేకరులు ప్రశ్నించగా.. ‘లేదు.. అస్సలు భయపడలేదు’ అని పోప్‌ బదులిచ్చారు. ఆస్పత్రి సిబ్బంది రోగులతో చాలా సున్నితంగా మసలుకుంటున్నారంటూ ప్రశంసించారు. ‘నేను పిల్లల విభాగానికి వెళ్లి చూశాను. అక్కడి సిబ్బంది పిల్లల పట్ల వహిస్తున్న జాగ్రత్తలు బాగున్నాయి ’ అని చెప్పారు. ఇలా విలేకరులు వరుస ప్రశ్నలు సంధిస్తుండగా.. ‘నేను నాలుగు రోజుల పాటు నిద్రపోవాల్సిన అవసరముందేమో’ అంటూ పోప్‌  సరదాగా బదులిచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని