Biden: సందేహం అక్కర్లేదు.. నేనే అధ్యక్ష అభ్యర్థిని: బైడెన్‌

Biden: బైడెన్‌ అధ్యక్ష అభ్యర్థిత్వంపై ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆయన స్పందించారు. తాను పోటీ నుంచి వైదొలగబోనని స్పష్టం చేశారు.

Updated : 04 Jul 2024 11:03 IST

Biden | వాషింగ్టన్‌: డెమోక్రాటిక్‌ పార్టీ తరఫున రాబోయే అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేది తానేనని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) స్పష్టం చేశారు. పోటీ నుంచి వైదొలగాలని తనపై ఎలాంటి ఒత్తిడి లేదని తెలిపారు. గతవారం రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి ట్రంప్‌తో (Donald Trump) జరిగిన సంవాదంలో బైడెన్ తడబడిన విషయం తెలిసిందే. దీన్ని బైడెన్ సైతం స్వయంగా అంగీకరించారు. ఈనేపథ్యంలో ఆయన గెలుపుపై స్వపక్షంలో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఆయన్ని తప్పించాలని కొన్నివర్గాల నుంచి డిమాండ్లు వినిపిస్తున్నాయి. వీటికి బదులుగానే బైడెన్‌ తాజాగా స్పందించారు.

‘‘అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి డెమోక్రాటిక్‌ పార్టీ నామినీని నేనే. నన్నెవరూ తప్పుకోమనడం లేదు. నేనే పోటీ నుంచి వైదొలగడం లేదు. తుదివరకు పోరాడతా. మనమే గెలవబోతున్నాం. ట్రంప్‌ను ఓడించేందుకు మాకు అండగా నిలవండి’’ అని మద్దతుదారులకు రాసిన లేఖలో బుధవారం బైడెన్‌ (Biden) అన్నారు. విరాళాలు అందజేయాలని విజ్ఞప్తి చేశారు.

‘‘జీవితంలో నేను చాలాసార్లు కింద పడ్డాను. పైకి లేచి పోరాడాను. ఎన్నిసార్లు పడిపోయావన్నది కాదు.. ఎంత వేగంగా కోలుకున్నావనేదే ముఖ్యమని మా నాన్న చెబుతుండేవారు. అమెరికా సైతం వెనకబడిన ప్రతిసారీ బలంగా పుంజుకొని తానేంటో నిరూపించుకుంది. నేనూ అదే చేయబోతున్నాను. 2020లోలాగే ట్రంప్‌ను ఇప్పుడు కమలాహ్యారిస్‌తో కలిసి నేను ఓడించబోతున్నాను. అది అంత సులభం కాదు. దానికి మీ మద్దతు కావాలి’’ అని బైడెన్‌ (Biden) రాసుకొచ్చారు.

ఆయన సేవలు మరవొద్దు: వైట్‌హౌస్‌

అధ్యక్ష భవనం శ్వేతసౌధం ఇదేతరహా ప్రకటన చేసింది. బైడెన్‌ (Biden) పోటీ నుంచి తప్పుకోవడం లేదని స్పష్టంచేసింది. ఆయన ప్రస్తుతం తన రాజకీయ జీవితంలోనే అత్యంత గడ్డుకాలం ఎదుర్కొంటున్నారని పేర్కొంది. ట్రంప్‌తో సంవాదంలో తడబాటుపై ఆయన ఇప్పటికే స్పష్టతనిచ్చారని అధికార ప్రతినిధి కరీన్ జీన్-పియర్ గుర్తుచేశారు. ఇలాంటి ఆందోళనలు వ్యక్తమవడం సహజమే అయినప్పటికీ.. గతంలో ఆయన పనితీరును గమనించాలని సూచించారు. నాలుగేళ్లుగా అమెరికాకు చేస్తున్న సేవలను మరవొద్దని తెలిపారు.

మరో నాలుగేళ్ల పాటు బైడెన్‌ (Biden) సమర్థంగా పని చేయగలరని భావిస్తున్నామని జీన్-పియర్ అన్నారు. ఇప్పుడున్న రాజకీయ నాయకుల్లో ఆయనకున్న పాలనా అనుభవం మరెవరికీ లేదని తెలిపారు. బలమైన ఆర్థికవ్యవస్థ నిర్మాణానికి ఆయన ఇంకా పని చేయాలనుకుంటున్నారని పేర్కొన్నారు. రోజువారీ మీడియా సమావేశంలో బుధవారం ఆమె బైడెన్‌ను సమర్థించేందుకు పలు ప్రయత్నాలు చేశారు. ఆయన తన నిర్ణయాన్ని మార్చుకునే అవకాశం ఉందా? ఆయన స్థానంలో కమలా హ్యారిస్‌ బాధ్యతలు స్వీకరిస్తారా? అంటూ ఎదురైన పలు ప్రశ్నలకు ఆమె ‘లేదు’ అని సమాధానం చెప్పాల్సివచ్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు