Zelensky: అదొక నరకంగా మారి ఉంటుంది.. అందుకే రష్యా అడ్డుకుంటోంది..!

మేరియుపొల్‌ నగరంలో సృష్టించిన మారణకాండను దాచిపెట్టాలని రష్యా చూస్తోందని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలన్‌స్కీ ఆరోపించారు.

Published : 07 Apr 2022 11:45 IST

కీవ్‌: మేరియుపొల్‌ నగరంలో సృష్టించిన మారణకాండను దాచిపెట్టాలని రష్యా చూస్తోందని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలన్‌స్కీ ఆరోపించారు. అందుకే తాము పంపే మానవతా సాయాన్ని అడ్డుకుంటోందని మండిపడ్డారు. ‘మేరియుపొల్‌లో జరిగిన దారుణాలను ఈ ప్రపంచం చూస్తుందేమోనని రష్యా భయపడుతోంది. అందుకే మేం పంపే మానవతా సాయాన్ని అడ్డుకుంటోంది. అక్కడ భారీ స్థాయిలో విషాదం నెలకొని ఉండి ఉంటుంది. అదొక నరకంగా మారి ఉంటుంది. పదుల్లో కాదు.. వేలల్లో ప్రజలు మృతి చెంది ఉంటారు. ఎంతోమంది గాయపడి ఉంటారు. రష్యా ఆ హింసాకాండను దాచిపెట్టాలని చూస్తోంది. కానీ, అది అసాధ్యం. అక్కడ చనిపోయిన ఉక్రెయిన్ వాసులందరినీ సమాధి చేయలేదు. ఇప్పటికే బుచా నగరంలో జరిపిన నేరాలను రష్యా దాచాలని యత్నించింది. అక్కడ కుటుంబాలకు కుటుంబాలనే దహనం చేసింది. నిన్న మాకు నిర్జీవంగా మారిన మరో కుటుంబం కనిపించింది. చనిపోయిన వారిలో తల్లి, తండ్రి, ఇద్దరు చిన్నారులున్నారు. మీకు తెలుసా.. చిట్టి చేయి కనిపించిందక్కడ. అందుకే నేను వారిని నాజీలన్నది’ అని రష్యా సృష్టిస్తోన్న ఆకృత్యాలను తీవ్రంగా ఖండించారు.

పుతిన్‌ సేనలు బుచా పట్టణంలో అమాయక ప్రజల తలల్లో తూటాలు దింపారని, ముక్కుపచ్చలారని బాలికలపై లైంగికదాడికి తెగబడ్డారంటూ కొన్ని దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. 45 అడుగుల పొడవైన సామూహిక సమాధిని ఉపగ్రహ చిత్రాలు బయటపెట్టాయి. రష్యా సైన్యం ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసిన అనంతరం వెళ్లిన వారికి కనిపించిన దయనీయ పరిస్థితులవి. దీనిపై అంతర్జాతీయ సమాజం భగ్గుమంది. ఇప్పుడు మేరియుపొల్‌లో ఎలాంటి పరిస్థితులు కనిపిస్తాయోనని ఉక్రెయిన్‌లో ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇక ఈ రక్తపాతం మధ్య శాంతి చర్చల గురించి అడిగిన ప్రశ్నకు జెలెన్‌స్కీ స్పందించారు. ‘అవి ఎలాగైనా జరగాలి. అవి లేకుండా యుద్ధాన్ని ఆపడం కష్టమని నేను భావిస్తున్నాను’ అని అంగీకరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని