Published : 19 May 2022 02:33 IST

Ukraine Crisis: ‘తుపాకీతో కాల్చి.. చనిపోయానని భావించి గోతిలో పాతిపెట్టారు’

ప్రాణాలతో బయటపడ్డ ఉక్రెయిన్‌ వాసి దీనగాథ

కీవ్‌: రష్యా అమానుష దాడులతో ఉక్రెయిన్‌ ప్రజలు నరకం అనుభవిస్తున్నారు. అమాయకులను చిత్రహింసలకు గురిచేస్తూ వారి ప్రాణాలను పొట్టనపెట్టుకుంటున్నారు. పుతిన్‌ సేనల అమానుషానికి సోదరులను కోల్పోయి, చావుబతుకుల మధ్య బయటపడిన ఓ వ్యక్తి.. తమకు జరిగిన అన్యాయాన్ని కళ్లకు కట్టినట్లు వివరించాడు. చిత్రహింసలకు గురిచేసి, మృతిచెందాడని భావించి తనను గోతిలో పాతిపెట్టగా.. అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడగలిగినట్లు వివరించాడు.

రష్యా సేనల దురాగతాలను మైకోలా కులిచెంకో (33) అనే వ్యక్తి సీఎన్‌ఎస్‌ వార్తాసంస్థతో పంచుకున్నాడు. సైనిక చర్య ప్రారంభించిన మూడున్నర వారాల తర్వాత..రష్యా సైనికులు తమపై బాంబు దాడి జరిగిందని ఆరోపిస్తూ, కులిచెంకో ఉంటున్న ఇంట్లోకి ప్రవేశించి సోదాలు చేశారు. తనతోపాటు సోదరులు యెవ్‌హెన్‌, దిమిత్రో కూడా ఆ ఇంట్లో ఉన్నట్లు కులిచెంకో తెలిపారు. తమ ముగ్గురిని మోకాళ్ల మీద కూర్చోబెట్టి ఇంటిలో సోదాలు జరిపినట్లు పేర్కొన్నాడు. తమ తాతకు చెందిన సైనిక పతకాలతోపాటు పారాట్రూపర్‌గా పనిచేస్తున్న యెవ్‌హెన్‌కు సంబంధించిన ఓ బ్యాగు ఇంట్లో లభించడంతో అనుమానంతో తమను ఓ బేస్‌మెంట్‌లోపలికి తీసుకెళ్లినట్లు వివరించాడు.

నోట్లో తుపాకీ పెట్టి ఇనుప రాడ్డుతో దాడి

‘బేస్‌మెంట్‌ లోపల మమ్మల్ని మూడు రోజులపాటు చిత్రహింసలకు గరిచేస్తూ విచారించారు. మాకేమీ తెలియదని మొరపెట్టుకున్నా విడిచిపెట్టలేదు. నాలుగో రోజు అయినా వదిలేస్తారని భావించాం. కానీ అలా జరగలేదు. నోట్లో తుపాకీ పెట్టి ఓ ఇనుప రాడ్డుతో తీవ్రంగా కొట్టారు. ఈ దెబ్బలకు తాళలేక నా ఇద్దరు సోదరులు సృహకోల్పోయారు’ అని ఆ దాడి ఘటనలను కులిచెంకో గుర్తుచేసుకుంటూ.. ఇంతటితో ఈ దురాగతం ఆగలేదని చెప్పుకొచ్చాడు. అనంతరం తమ ముగ్గురి కళ్లకు గంతలు కట్టి, ఓ సైనిక వాహనంలో నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లినట్లు పేర్కొన్నాడు.

ప్రాణాలు కాపాడుకునేందుకు చనిపోయినట్లు..

ఆ నిర్మానుష్య  ప్రాంతంలో గుంత తవ్వి అక్కడికి మమ్మల్ని తీసుకెళ్లారు. అక్కడ మళ్లీ మోకాళ్ల మీద కూర్చోబెట్టారు. ముందుగా మా పెద్దన్నయ్యను కాల్చి చంపారు. అనంతరం నా పక్కనే ఉన్న యెవ్‌హెన్‌ను పొట్టనబెట్టుకున్నారు. ఆపై నా దవడలో ఓ రౌండ్‌ కాల్చారు. ఒక్కసారిగా కళ్లు బైర్లుకమ్మాయి. ప్రాణాలతో ఉన్నప్పటికీ మృతిచెందినవాడిలా కిందపడిపోయా. నేనూ చనిపోయనని భావించారు. అనంతరం మా దేహాలను ఆ గోతిలో పడేసి, పైన మట్టి కప్పి వెళ్లిపోయారు’ అని కులిచెంకో పేర్కొన్నాడు. ‘ఆ గోతి లోపల ప్రాణాలను బిగబట్టుకొని తల్లడిల్లిపోయా. శ్వాస తీసుకోలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. కొద్దిసేపటికి నా బలాన్నంతా కూడగట్టుకొని, నాపై పడిఉన్న పెద్దన్నయ్య శవాన్ని పక్కకు జరిపి ఎలాగోలా గోతిలోనుంచి బయటకు రాగలిగా’ అంటూ ఆ భయానక, అసహాయ ఘటనను గుర్తుచేసుకున్నాడు.

ఓ మహిళ సహాయంతో కోలుకున్నా..

అనంతరం సమీపంలోని పొలాల గుండా ఓ ఇంటికి చేరుకోగలిగానని, అక్కడే ఓ మహిళ తనకు సహాయం చేసిందని కులిచెంకో వివరించాడు. అక్కడే కొద్దిరోజులు చికిత్స తీసుకున్న తర్వాత ప్రస్తుతం ఇంటికి చేరుకున్నట్లు తెలిపారు. ‘అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడగలిగా. రష్యా దురాగతాలు ప్రపంచానికి తెలియాలి. అందుకే నా గాథను వినిపించా’ అని అతడు పేర్కొన్నాడు.

Read latest World News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts