Indain Navy: భారత జలాల్లోకి పాక్‌ యుద్ధనౌక.. వెనక్కి తరిమిన కోస్ట్‌గార్డ్‌ ‘డోర్నియర్‌’

పాకిస్థాన్(Pakistan) నౌకాదళానికి చెందిన ఓ యుద్ధనౌక గుజరాత్(Gujarat) తీరంలో సముద్ర సరిహద్దు రేఖను దాటి భారత జలాల్లో(Indian Waters)కి ప్రవేశించింది. అయితే, భారత తీర రక్షక దళాని(Coast Gaurd)కి...

Published : 08 Aug 2022 02:17 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పాకిస్థాన్ (Pakistan) నౌకాదళానికి చెందిన ఓ యుద్ధనౌక గుజరాత్(Gujarat) తీరంలో సముద్ర సరిహద్దు రేఖను దాటి భారత్‌ జలాల్లో(Indian Waters)కి ప్రవేశించింది. అయితే, భారత తీర రక్షక దళాని(Coast Gaurd)కి చెందిన సముద్ర నిఘా విమానం ‘డోర్నియర్(Dornier)’ వెంటనే దాన్ని గుర్తించడంతో.. కాసేపటికి తోకముడిచింది. జులైలో భారీ వర్షాలు కురుస్తోన్న సమయంలో ఈ ఘటన జరిగినట్లు అధికారిక వర్గాలు ఓ వార్తా సంస్థకు వెల్లడించాయి. ‘‘పీఎన్‌ఎస్‌ ఆలంగీర్(PNS Alamgir)’ రెండు దేశాల మధ్య సముద్ర సరిహద్దు రేఖ మీదుగా భారత జలాల్లోకి ప్రవేశించింది. సముద్ర తీరంలో నిఘా కోసం అప్పటికే సమీప వైమానిక స్థావరం నుంచి బయలుదేరిన ‘డోర్నియర్’ విమానం.. ఈ నౌక ఆచూకీని గుర్తించింది. దానిపై నిఘా కొనసాగిస్తూనే.. దాని ఉనికి గురించి కమాండ్ సెంటర్‌కు సమాచారం అందించింది. మరోవైపు.. వెంటనే వెనక్కి వెళ్లిపోవాలంటూ పాక్‌ యుద్ధనౌకకు హెచ్చరికలూ జారీ చేసింది. అయితే, నౌకా సిబ్బంది వాటిని పట్టించుకోలేదు’ అని సంబంధిత అధికారులు తెలిపారు.

‘‘పీఎన్‌ఎస్‌ ఆలంగీర్‌’ చుట్టూ చక్కర్లు కొడుతూనే ఉన్న ‘డోర్నియర్’.. నౌక ఉద్దేశాన్ని కనిపెట్టేందుకు రేడియో కమ్యూనికేషన్ ద్వారా సంప్రదించేందుకు యత్నించింది. అయితే.. పూర్తి నిశ్శబ్దాన్ని కొనసాగించాలని భావించిన ఆలంగీర్‌ కెప్టెన్‌.. దానికి స్పందించలేదు. అయితే, కొద్దిసేపటికి తమ ఉనికిని పసిగట్టేశారని తెలుసుకున్న నౌక సిబ్బంది వెనక్కి తగ్గారు’ అని తెలిపారు. భారత్ వైపు నుంచి మరిన్ని బలగాలు చేరుకునే అవకాశం ఉందని వారు గ్రహించి ఉండొచ్చన్నారు. పట్టుబడకుండా భారత జలాల్లోకి ఎంత దూరం వరకు చొరబడగలమో తెలుసుకోవడమే వారి ఉద్దేశం కావొచ్చని అభిప్రాయపడ్డారు. కానీ, లోపలికి వచ్చిన వెంటనే దొరికిపోయారన్నారు. ఇదిలా ఉండగా.. కొన్నాళ్లుగా గుజరాత్‌ వెంబడి భారత్‌- పాక్‌ సరిహద్దు ప్రాంతమైన ‘సర్‌ క్రీక్‌’ నుంచి సముద్ర జలాల వరకు పాక్‌ కార్యకలాపాలు పెరిగాయి. ముఖ్యంగా నార్కో- టెర్రరిజం విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో ఇండియన్ కోస్ట్ గార్డ్‌, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇక్కడ పకడ్బందీ నిఘా నిర్వహిస్తుంటాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని