Ukraine Crisis: ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం పదేళ్లు కొనసాగొచ్చు..!

రెండు నెలలుగా ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో యుద్ధం 10 సంవత్సరాల పాటు కొనసాగొచ్చంటూ యూకే విదేశాంగ సెక్రటరీ లిజ్‌ ట్రస్ వ్యాఖ్యానించారు.

Published : 28 Apr 2022 14:20 IST

లండన్‌: రెండు నెలలుగా ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో యుద్ధం 10 సంవత్సరాల పాటు కొనసాగొచ్చంటూ యూకే విదేశాంగ సెక్రటరీ లిజ్‌ ట్రస్ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఈ దాడిలో పుతిన్ విజయం సాధిస్తే.. ఐరోపాలో భయంకరమైన దుస్థితి, ప్రపంచవ్యాప్తంగా తీవ్ర పరిణామాలుంటాయని ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ యుద్ధం సుదీర్ఘకాలం కొనసాగొచ్చని, అందుకు ఐరోపా సిద్ధంగా ఉండాలని లిజ్‌ ట్రస్ హెచ్చరించారు. బ్రిటన్, దాని మిత్ర దేశాలు రష్యాను ఉక్రెయిన్‌ నుంచి వెళ్లగొట్టేందుకు వేగంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే ఈ సంక్షోభం వేళ.. అంతర్జాతీయ భద్రత విషయంలో మార్పులు తెచ్చేలా ముందుకు కదలాలన్నారు. ప్రపంచ నికర సంపదలో 50 శాతానికి పైగా వాటా ఉన్న జీ7 దేశాలు దురాక్రమణ దారుల్ని అడ్డుకొనే అంశంలో కీలకంగా వ్యవహరించాలన్నారు. ఈ సందర్భంగా పుతిన్‌ను ఉద్దేశించి, ఆమె కఠిన పదజాలం వాడారు. ఇక, రష్యా సేనలు ఉక్రెయిన్‌లోనే కొనసాగితే.. జార్జియా, మాల్దొవా దేశాలపై కూడా అవి దాడులు చేసే అవకాశం ఉందని యూకే ప్రభుత్వంలోని కొందరు అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు.

ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌పై రష్యా తన సైనిక చర్యను ప్రారంభించింది. అమెరికా, దాని మిత్ర దేశాలు రష్యాను ఆంక్షల చట్రంలో బంధించాయి. అయినా మాస్కో ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఊహించని రీతిలో ఉక్రెయిన్ నుంచి ప్రతిఘటన ఎదురుకావడంతో.. పుతిన్ సేనలు రెచ్చిపోయి, విధ్వంసానికి పాల్పడుతున్నాయి. దాంతో ఇరువైపు ప్రాణ, ఆస్తి నష్టం సంభవిస్తోంది. అమాయకుల్ని హతమార్చడం, లైంగిక దాడులకు పాల్పడటం వంటివి ప్రపంచాన్ని కలవరపెడుతున్నాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని