Rishi Sunak: వాళ్లు అధికారంలోకి వస్తే.. అక్రమ వలసలే - సునాక్‌

అక్రమ వలసదారులు దేశంలోకి ప్రవేశించేందుకు క్యూ కడుతున్నారని.. వారంతా లేబర్‌ ప్రభుత్వం అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారని బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌ పేర్కొన్నారు.

Published : 25 Jun 2024 21:48 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌:  వేలాదిగా అక్రమ వలసదారులు దేశంలోకి ప్రవేశించేందుకు ఎదురుచూస్తున్నారని బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌ హెచ్చరించారు. అటువంటి వారంతా ఫ్రాన్స్‌లోని కలైస్‌లో వేచిచూస్తున్నారని పేర్కొన్నారు. బ్రిటన్‌లో లేబర్‌ పార్టీ అధికారంలోకి రావాలని వారు కోరుకుంటున్నట్లు చెప్పారు. ఈ ఏడాది తొలి ఆరు నెలల్లోనే  దాదాపు 13వేల మంది బ్రిటన్‌లోకి అక్రమంగా వచ్చారని అన్నారు. 

సార్వత్రిక ఎన్నికలకు గడువు సమీపిస్తున్న వేళ లేబర్‌ పార్టీ నేత కైర్‌ స్టార్మర్‌పై ప్రధాని రిషి సునాక్‌ విమర్శలు గుప్పించారు. అక్రమ వలసదారులను ఆ పార్టీ అనుమతించేందుకు సిద్ధంగా ఉందన్నారు. వలసలను కట్టడి చేసే ప్రణాళిక స్టార్మర్‌ వద్ద లేదని.. వాళ్లు అధికారంలోకి వస్తే రువాండా విధానాన్ని వెనక్కి తీసుకుంటారని ఆరోపించారు. జులై 4న బ్రిటన్‌లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి.

బ్రిటన్‌లోకి అక్రమ వలసలు పెరుగుతున్నట్లు ప్రభుత్వ నివేదికలు చెబుతున్నాయి. 2022లోనే 45 వేల మంది వచ్చినట్లు సమాచారం. ఇంగ్లీష్‌ ఛానల్‌ ఈదుతూ, పడవల్లో ప్రమాదకర రీతిలో ప్రయాణిస్తూ వందల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటివారిని అడ్డుకునేందుకు కొత్త ప్రణాళిక అమలు చేస్తున్న రిషి సునాక్‌ ప్రభుత్వం.. అలాంటి వారిని రువాండాకు తరలిస్తోంది. ఒకవేళ ప్రభుత్వం మారితే ఈ విధానాన్ని పక్కన పెట్టొచ్చని ఎన్నికల ప్రచారంలో సునాక్‌ చెబుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని