Imran Khan: మళ్లీ పాక్‌ సైన్యాన్ని టార్గెట్‌ చేసిన ఇమ్రాన్‌.. అమెరికాపై యూటర్న్‌!

పాకిస్థాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌(Imran khan) ఆ దేశ సైన్యాన్ని మరోసారి టార్గెట్‌ చేశారు.

Published : 15 Nov 2022 01:37 IST

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌(Imran khan) ఆ దేశ సైన్యాన్ని మరోసారి టార్గెట్‌ చేశారు. స్వతంత్ర సంస్థలను గతంలో నిర్వీర్యం చేయడంతో పాటు రాజకీయ కుటుంబాలతో చేతులు కలిపి చట్టానికి తామే అతీతులన్నట్టుగా సైన్యం వ్యవహరిస్తోందని ఆరోపించారు. పాకిస్థాన్‌లో ముందస్తు ఎన్నికలు ప్రకటించాలన్న డిమాండ్‌తో లాంగ్‌ మార్చ్‌ చేపట్టిన ఇమ్రాన్‌ ఖాన్‌.. ఇటీవల పంజాబ్‌ ప్రావిన్స్‌లో ఓ యువకుడు జరిపిన కాల్పుల్లో గాయపడి ప్రస్తుతం కోలుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ బ్రిటిష్‌ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇమ్రాన్‌ సైన్యంపై తీవ్ర ఆరోపణలు గుప్పించారు.

2011లో పంజాబ్ మాజీ గవర్నర్ సల్మాన్ తసీర్‌ను ఓ మత తీవ్రవాది చంపిన విధంగానే తననూ హత్య చేసేందుకు ప్రధాని షెహబాజ్ షరీఫ్, పాక్‌ అంతర్గత వ్యవహారాల మంత్రి రాణా సనావుల్లా, మేజర్ జనరల్ ఫైసల్ నసీర్‌లు కలిసి కుట్ర పన్నారని ఆరోపించారు. గతంలో స్వతంత్ర సంస్థల్ని మిలటరీ నిర్వీర్యం చేసిందన్న ఇమ్రాన్‌‌.. షరీఫ్‌ కుటుంబంలాంటి రాజకీయ వారసత్వాలతో కలిసి చట్టానికి తామే అతీతులు అన్నట్టుగా ప్రవర్తిస్తోందని వ్యాఖ్యానించారు. గతంలో ఇమ్రాన్‌ ఖాన్‌ అధికారంలో ఉన్న సమయంలో తమను బలిపశువులుగా మార్చేందుకు సహకరించే వ్యక్తిని ఆర్మీ చీఫ్‌గా నియమించేందుకు ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రయత్నిస్తున్నారంటూ విపక్షాలు ఆరోపించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ ఏడాది ఏప్రిల్‌లో ఇమ్రాన్‌ అధికారం కోల్పోయిన తర్వాత ఆ పరిస్థితి తారుమారైంది. దోచుకున్న సంపదను కాపాడుకొనేందుకు, సార్వత్రిక ఎన్నికల్లో మోసాలకు పాల్పడేందుకు షెహబాజ్‌ సారథ్యంలోని సంకీర్ణ ప్రభుత్వం తమకు నచ్చిన వ్యక్తిని ఆర్మీ చీఫ్‌ని నియమించాలని చూస్తోందంటూ ఇప్పుడు ఇమ్రాన్‌ ఖానే ఆరోపణలు చేయడం గమనార్హం.

ఇకపై అమెరికాను నిందించను..

తన ప్రభుత్వం కూలిపోవడంలో అమెరికా(America) పాత్ర ఉందని ఆరోపణలు చేస్తోన్న పాకిస్థాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌(Imran Khan).. తాజాగా అగ్రరాజ్యం విషయంలో యూటర్న్‌ తీసుకున్నారు. ఇకపై ఈ విషయంలో అమెరికాను నిందించబోనని ఓ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. తాను మళ్లీ పాక్‌ ప్రధానిగా ఎన్నికైతే ఆ దేశంతో సంబంధాలను(Pak- US Relations) సరిదిద్దుకోవాలని భావిస్తున్నట్లు తెలిపారు. తాను ప్రధాని పీఠం నుంచి దిగిపోయేలా పాక్‌ ప్రస్తుత ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌, అమెరికాలు కుట్ర పన్నాయని ఇమ్రాన్‌ గతంలో ఆరోపించిన విషయం తెలిసిందే.

తాజాగా ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ.. ‘నాకు సంబంధించినంతవరకు ఈ అధ్యాయం ముగిసిపోయింది. నేను దాన్ని మర్చిపోయా. ఈ విషయంలో ఇకపై అమెరికాను నిందించను. తిరిగి ఎన్నికైతే ఆ దేశంతో గౌరవప్రద సంబంధాలు కోరుకుంటున్నా. నేను నాయకత్వం వహించాలనుకుంటున్న పాకిస్థాన్.. ప్రతి దేశంతో, ముఖ్యంగా అమెరికాతో సత్సంబంధాలు కలిగి ఉండాలి. అగ్రరాజ్యంతో మా సంబంధం.. యజమాని- సేవకుడు/బానిస సంబంధం వంటిది. ఆ దేశం.. మమ్మల్ని ఒక కిరాయి తుపాకీలా ఉపయోగించుకుంది. అయితే, ఈ విషయంలో అమెరికా కంటే సొంత ప్రభుత్వాలనే ఎక్కువగా విమర్శించా’ అని ఇమ్రాన్‌ పేర్కొన్నారు.

పాకిస్థాన్‌లో రాజకీయ సుస్థిరతను నెలకొల్పేందుకు.. ముందస్తు ఎన్నికలే ఏకైక మార్గమని ఇమ్రాన్‌ అన్నారు. త్వరలో ఎన్నికలు నిర్వహించకపోతే.. దేశ ఆర్థిక వ్యవస్థ దిగజారుతుందని హెచ్చరించారు. పాక్‌ సైన్యం గతంలో దేశంలోని స్వతంత్ర వ్యవస్థలను బలహీనపర్చిందని ఆరోపించిన ఇమ్రాన్‌.. తాజాగా దేశాభివృద్ధి విషయంలో తన భవిష్యత్తు ప్రణాళికల్లో సైన్యం నిర్మాణాత్మక పాత్ర పోషించగలదన్నారు. ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్యకు ఒక రోజు ముందు మాస్కోను సందర్శించడం.. ఇబ్బందికర సందర్భంగా ఖాన్ అంగీకరించారు. అయితే, తన పర్యటన నెలల ముందే నిర్ణయమైనట్లు చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని