Pakistan: ‘ప్రధాని ఎన్నికను బహిష్కరిస్తున్నా.. ఈ దొంగలతో కూర్చోలేను’

పాకిస్థాన్‌ కొత్త ప్రధానిని ఎన్నుకోవడానికి రంగం సిద్ధం అయిన వేళ.. తాను జాతీయ అసెంబ్లీకి హాజరుకావడం లేదని మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వెల్లడించారు.

Updated : 11 Apr 2022 16:55 IST

జాతీయ అసెంబ్లీకి రాజీనామా ప్రకటించిన ఇమ్రాన్‌

ఇస్లామాబాద్: పాకిస్థాన్‌ కొత్త ప్రధానిని ఎన్నుకోవడానికి రంగం సిద్ధమైన వేళ.. తాను జాతీయ అసెంబ్లీకి హాజరుకావడం లేదని మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వెల్లడించారు. ఆయనతో సహా పీటీఐ పార్టీ నేతలంతా మూకుమ్మడిగా రాజీనామా చేసి, ప్రధాని ఎన్నికను బహిష్కరించాలని నిర్ణయించుకున్నారు. ‘ఎట్టి పరిస్థితుల్లో మేం ఈ అసెంబ్లీలో కూర్చోం. ఈ దొంగలతో నేను అసెంబ్లీలో కూర్చోలేను’ అంటూ ఆయన తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే ఆయన తన రాజీనామాను ప్రకటించారు.

తమ సభ్యులు రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు పీటీఐ పార్టీ నేత షేక్ రషీద్ వెల్లడించారు. మునుపటి ప్రభుత్వంలో మంత్రిగా చేసిన మురాద్‌ సయీద్.. స్పీకర్‌కు తన రాజీనామా పత్రాన్ని పంపారు. ‘ధన దాహం, అధికార వ్యామోహం నా దేశాన్ని బిచ్చమెత్తేలా చేసింది. ఇలాంటి వాళ్లను నా దేశ పాలకులుగా పరిగణించాలా..?’ అంటూ తన లేఖను సమర్పించారు. 

రాత్రి 8కి నూతన ప్రధాని ప్రమాణ స్వీకారం..?

ప్రతిపక్షాల కూటమి ఎన్నుకునే నూతన ప్రధాని రాత్రి ఎనిమిదింటికి ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. ఆయనచేత పాక్‌ అధ్యక్షుడు అరిఫ్ అల్వీ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. అయితే కొత్త ప్రధానిగా పాకిస్థాన్‌ ముస్లిం లీగ్‌(ఎన్‌) అధ్యక్షుడు షెహబాజ్‌ బాధ్యతలు చేపట్టడం ఖాయంగా కనిపిస్తోంది.

స్వదేశానికి రానున్న మాజీ ప్రధాని షరీఫ్..

పాకిస్థాన్‌ మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్ లండన్‌ నుంచి స్వదేశానికి రానున్నట్లు వార్తలు వస్తున్నాయి. రంజాన్ మాసం అనంతరం ఆయన రాక ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు పాకిస్థాన్ ముస్లిం లీగ్(ఎన్‌) నేత ఒకరు వెల్లడించారు. ఇమ్రాన్‌ ప్రభుత్వం కూలిన వేళ ఆయన పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. కొత్త ప్రధానిగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉన్న హెహబాజ్‌.. నవాజ్‌కు స్వయానా సోదరుడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని