Imran khan: నన్ను చంపేందుకు ముగ్గురు షూటర్లు ప్రయత్నించారు: ఇమ్రాన్‌

పంజాబ్‌ ప్రావిన్స్‌లోని వజీరాబాద్‌లో నవంబర్‌ తొలి వారంలో తనపై జరిగిన హత్యా ప్రయత్నంలో ముగ్గురు షూటర్లు పాల్గొన్నట్టు పాక్‌ మాజీ ప్రధాని, పాకిస్థాన్‌ తెహ్రీక్‌-ఎ-ఇన్సాఫ్‌ (పీటీఐ) అధ్యక్షుడు ఇమ్రాన్‌ ఖాన్‌(Imran Khan) అన్నారు.

Published : 28 Nov 2022 01:45 IST

ఇస్లామాబాద్‌: పంజాబ్‌ ప్రావిన్స్‌లోని వజీరాబాద్‌లో నవంబర్‌ తొలి వారంలో తనపై జరిగిన హత్యా ప్రయత్నంలో ముగ్గురు షూటర్లు పాల్గొన్నట్టు పాక్‌ మాజీ ప్రధాని, పాకిస్థాన్‌ తెహ్రీక్‌-ఎ-ఇన్సాఫ్‌ (పీటీఐ) అధ్యక్షుడు ఇమ్రాన్‌ ఖాన్‌(Imran Khan) అన్నారు. దేశంలో మధ్యంతర ఎన్నికలు నిర్వహించాలన్న డిమాండ్‌తో ఆయన చేపట్టిన లాంగ్‌ మార్చ్‌లో ప్రసంగించేందుకు సిద్ధమవుతుండగా దుండగుల కాల్పుల్లో ఆయన కుడికాలికి గాయాలైన విషయం తెలిసిందే. ఆ ఘటన తర్వాత పార్టీ కార్యకర్తలను ఉద్దేశించిన ర్యాలీలో ఆయన తొలిసారి ప్రసంగించారు. పాక్‌లో అత్యంత శక్తిమంతమైన సైన్యం ప్రధాన కార్యాలయం ఉన్న రావల్పిండిలో శనివారం రాత్రి నిర్వహించిన భారీ ర్యాలీలో మాట్లాడిన ఇమ్రాన్‌ ఖాన్‌.. తనను హత్య చేసేందుకు ముగ్గురు షూటర్లు ప్రయత్నించారన్నారు.

లాంగ్‌మార్చ్‌లో ఒకడు తన పైన, పీటీఐ నేతలపై కాల్పులు జరపగా.. మరోవ్యక్తి కంటెయినర్‌ ముందు భాగంలో కాల్పులు జరిపాడన్నారు. అలాగే, మూడో షూటర్‌ మొదటి సాయుధుడిని చంపేందుకు వచ్చాడని.. ఆ క్రమంలో జరిపిన కాల్పుల సమయంలోనే తూటా తగిలి ఒకరు బలైపోయారన్నారు. వజీరాబాద్‌లో తన హత్యకు ప్రయత్నాలు విఫలం కావడంతో మళ్లీ తనను టార్గెట్‌ చేసుకొనేందుకు ఎదురుచూస్తున్నారంటూ ఆరోపించారు. తనపై దాడి వెనుక ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌, పాక్‌ అంతర్గత వ్యవహారాల మంత్రి రాణా సనావుల్లా, ఐఎస్‌ఐ కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ విభాగం అధిపతి మేజర్‌ జనరల్‌ ఫైసల్‌ నసీర్‌ ఉన్నారంటూ పదే పదే ఆరోపిస్తోన్న ఇమ్రాన్‌ ఖాన్‌.. కొత్త ఎన్నికల తేదీలను ప్రకటించే వరకు తన నిరసన కొనసాగుతుందని తేల్చి చెప్పారు. మరోవైపు, తనపై కాల్పుల ఘటన మరుసటి రోజు జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో తన కుడికాలికి నాలుగు బుల్లెట్లు తగిలాయని.. ఇద్దరు షూటర్లు కాల్పులు జరిపినట్టు ఇమ్రాన్‌ ఖాన్‌ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని