Imran Khan: ఆరు రోజుల్లో ప్రకటన చేయలేదో.. దేశం మొత్తం రాజధానిలో ఉంటుంది..!

‘ఆరు రోజుల్లో ఎన్నికలపై ప్రకటన చేయండి లేదంటే మొత్తం దేశంతో కలిసి ఇస్లామాబాద్‌కు తిరిగివస్తాను’ అని హెచ్చరించారు పాకిస్థాన్ మాజీ ప్రధాని, పీటీఐ అధినేత ఇమ్రాన్ ఖాన్. దేశ రాజధానిలో నిరసనకారులను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. ప్రభుత్వానికి ఈ డిమాండ్లు వినిపించారు.

Updated : 23 Nov 2022 11:07 IST

ఇస్లామాబాద్‌: ‘ఆరు రోజుల్లో ఎన్నికలపై ప్రకటన చేయండి లేదంటే మొత్తం దేశంతో కలిసి ఇస్లామాబాద్‌కు తిరిగివస్తా’ అని హెచ్చరించారు పాకిస్థాన్ మాజీ ప్రధాని, పీటీఐ అధినేత ఇమ్రాన్ ఖాన్. దేశ రాజధానిలో నిరసనకారులను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. ప్రభుత్వానికి ఈ డిమాండ్లు వినిపించారు. ‘పీటీఐ కార్యకర్తలు మార్చ్‌ను ఆపేందుకు దిగుమతి చేసుకున్న ప్రభుత్వం చేపడుతోన్న అరెస్టులు, సోదాలను ఇమ్రాన్‌ ఖండించారు. ఆ ప్రభుత్వం అనుసరిస్తోన్న వ్యూహాలపై నిరసన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని సుప్రీం కోర్టు పరిగణనలోకి తీసుకోవడంపై ఆయన కృతజ్ఞతలు వ్యక్తం చేశారు’ అంటూ అక్కడి వార్తా సంస్థ డాన్ పేర్కొంది. 

కొద్ది వారాల క్రితం మెజార్టీ కోల్పోవడంతో ఇమ్రాన్ ఖాన్‌ ప్రధాని పదవి కోల్పోయారు. ఆయన స్థానంలో పీఎంఎల్‌(ఎన్‌) పార్టీకి చెందిన షహబాజ్ షరీఫ్ ఆ పదవిని చేపట్టారు. ఇది దిగుమతి చేసుకున్న ప్రభుత్వమంటూ మొదట్నుంచి కొత్త ప్రభుత్వంపై ఇమ్రాన్ విమర్శలు చేస్తున్నారు. అలాగే కొత్తగా ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. దానిలో భాగంగా ఇస్లామాబాద్‌లోని డీ చౌక్ వద్ద శాంతియుత నిరసన ర్యాలీ చేపట్టాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. దీనికి సుప్రీం కోర్టు అనుమతి కూడా ఇచ్చింది. అయితే వేల సంఖ్యలో వచ్చిన నిరసనకారులు బారికేడ్లను తొలగించడంతో వారికి, పోలీసులకు మధ్య ఘర్షణ చెలరేగింది. నిరసనకారుల్ని అదుపు చేసేందుకు పోలీసులు బాష్పవాయువును ప్రయోగించారు. పీటీఐ కార్యకర్తలపై లాఠీ ఛార్జి జరిగినట్లుగా అక్కడి మీడియాలో ప్రసారం అయిన దృశ్యాలను బట్టి తెలుస్తోంది. అలాగే పలువురు మహిళలు, చిన్నారులు గాయపడినట్లు స్థానిక వార్తా సంస్థలు వెల్లడించాయి. 

ఈ ఘర్షణల కారణంగా ప్రస్తుతానికి ఇమ్రాన్ ఆ నిరసన ర్యాలీని నిలిపివేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘మీకు ఆరు రోజుల సమయం ఇస్తున్నాను. ఆరురోజుల్లో ఎన్నికలపై ప్రకటన చేయండి. మళ్లీ కొత్తగా ఎన్నికలు నిర్వహించేందుకు జూన్‌లో పార్లమెంట్‌ను రద్దు చేయండి. ఈ డిమాండ్లు నెరవేర్చకపోతే మళ్లీ రాజధానిలో నిరసనలు చేపడతాం’ అంటూ ప్రభుత్వానికి హెచ్చరికలు పంపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని