Imran Khan: ఇమ్రాన్‌ నోట అదే మాట.. పదవి పోయిన తర్వాత తొలి కామెంట్ ఇదే..

తనపై విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని ‘విదేశీ కుట్ర’గా అభివర్ణిస్తూ వచ్చిన ఇమ్రాన్‌ ఖాన్‌.. పదవి పోయిన తర్వాత కూడా అదే పల్లవి అందుకున్నారు.

Published : 10 Apr 2022 17:57 IST

ఇస్లామాబాద్‌: తనపై విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని ‘విదేశీ కుట్ర’గా అభివర్ణిస్తూ వచ్చిన ఇమ్రాన్‌ ఖాన్‌.. పదవి పోయిన తర్వాత కూడా అదే రాగాన్ని ఆలపిస్తున్నారు. విదేశీ కుట్రకు వ్యతిరేకంగా దేశంలో మరో స్వాతంత్ర్యోద్యమం ప్రారంభమైందంటూ పేర్కొన్నారు. ఈ మేరకు అవిశ్వాస తీర్మానంలో ఓడిపోయిన అనంతరం తొలిసారి స్పందిస్తూ ట్వీట్‌ చేశారు. ‘‘1947లో పాకిస్థాన్‌ స్వతంత్ర దేశంగా అవతరరించింది. కానీ దేశంలో మరోసారి స్వాతంత్ర్య పోరాటం మొదలైంది. ఈ సారి ప్రభుత్వ మార్పుకోసం జరిగిన విదేశీ కుట్రలపై! దేశ సార్వభౌమాధికారం, ప్రజాస్వామ్యాన్ని కాపాడేది ఎప్పుడూ ప్రజలే’’ అని ట్వీట్‌ చేశారు.

విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని మొదటి నుంచి ఇమ్రాన్‌ విదేశీ కుట్రగానే అభివర్ణిస్తున్నారు. తనను పదవి నుంచి తప్పించేందుకు విపక్షాలకు విదేశాల నుంచి భారీగా నిధులు వస్తున్నాయని ఆరోపించారు. ఇదే కారణాన్ని చూపి జాతీయ అసెంబ్లీని రద్దు చేసినప్పటికీ సుప్రీం కోర్టు నుంచి ఇమ్రాన్‌ తప్పించుకోలేకపోయారు. శనివారం అర్ధరాత్రి జరిగిన ఓటింగ్‌లో 174 ఓట్లతో అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో ఇమ్రాన్‌ పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. మరోవైపు తన తదుపరి కార్యాచరణను ప్రకటించేందుకు ఇమ్రాన్‌ తమ పార్టీ (పీటీఐ) కోర్‌ కమిటీతో ఆదివారం భేటీ అయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని