Pakistan: పాకిస్థాన్‌లో భారీగా పెరిగిన ఇంధన ధరలు.. భారత్‌పై ఇమ్రాన్‌ ప్రశంసలు

ఆర్థిక సంక్షోభం, విద్యుత్​ కొరత మొదలైన సమస్యలతో సతమతమవుతున్న పాకిస్థాన్​ ప్రజలపై మరో పిడగుపడింది......

Published : 28 May 2022 02:46 IST

ఇస్లామాబాద్‌: ఆర్థిక సంక్షోభం, విద్యుత్​ కొరత మొదలైన సమస్యలతో సతమతమవుతున్న పాకిస్థాన్​ ప్రజలపై మరో పిడగు పడింది. దేశవ్యాప్తంగా అన్ని రకాల పెట్రోలియం ఉత్పత్తులపై లీటరుకు రూ.30 పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ప్రస్తుతం లీటర్​ పెట్రోల్​ ధర రూ.179.85, డీజిల్​ ధర రూ.174.15, కిరోసిన్​ ధర రూ.155.95, లైట్​ డీజిల్​ ధర రూ.148.41కు చేరాయి. ఆర్థిక సాయంపై అంతర్జాతీయ ద్రవ్య నిధితో (ఐఎంఎఫ్​) పాక్​ బుధవారం జరిపిన చర్చలు విఫలం కావడంతో ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ఆ దేశ ఆర్థికమంత్రి మిఫాత్​ ఇస్మైల్​ ఈ మేరకు చర్యలు తీసుకున్నారు.

ఇమ్రాన్​ ఖాన్​ హయాంలో పెట్రోల్​ సహా పలు ఇంధనాలపై సబ్సిడీ అమలులోకి వచ్చింది. ధరల పెంపుపై ఐఎంఎఫ్​ సూచనలను పట్టించుకోకుండా సబ్సిడీలను కొనసాగిస్తూ వచ్చారు. కానీ పెట్రోల్​ ధరలు పెంచితేనే ఆర్థిక సాయం అందిస్తామని ఐఎంఎఫ్​ తేల్చిచెప్పడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ‘ఇంధనంపై అమలులో ఉన్న సబ్సిడీ సదుపాయాన్ని తొలగించే వరకు దేశానికి ఎలాంటి ఆర్థిక సాయం అందించలేమని ఐఎంఎఫ్​ చెప్పింది. ఈ నేపథ్యంలో ప్రజలపై ఈ భారం వేయకతప్పట్లేదు’ అని ఆర్థిక మంత్రి తెలిపారు.

ధరలు నియంత్రించడంలో ప్రభుత్వం విఫలం: ఇమ్రాన్‌ఖాన్‌

పెట్రోల్​ ధరలు పెంచడాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన మాజీ ప్రధాని ఇమ్రాన్​ ఖాన్.​. ధరలు నియంత్రించడంలో ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. ఇందుకు భిన్నంగా ఇటీవల ఇంధన ధరలు తగ్గించడంపై భారత్​ను ప్రశంసించారు. ‘దేశంలో పెట్రోల్​ ధరలను ప్రభుత్వం 20శాతం (రూ.30) పెంచింది. ఒకేసారి ఈ స్థాయిలో ధరలు పెంచడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి. రష్యా నుంచి తక్కువ ధరకు చమురును కొనుగోలు చేయడంలో ప్రభుత్వం విఫలమైంది. మరోవైపు భారత్​.. ఇందుకు భిన్నంగా ఇంధన ధరలను తగ్గించింది. రష్యా నుంచి చౌకగా చమురు కొనుగోలు చేయడమే ఇందుకు కారణం’ అని ఇమ్రాన్‌ ఖాన్‌ పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని