Imran Khan: ర్యాలీలో వీడియో ప్లేచేసి.. భారత్‌ను ప్రశంసించిన ఇమ్రాన్‌ ఖాన్‌

పాకిస్థాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ (Imran khan) మరోసారి భారత్‌పై ప్రశంసలు కురిపించారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేసినందుకు పశ్చిమ దేశాలు నిందించిన సమయంలో .......

Updated : 14 Aug 2022 18:55 IST

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ (Imran khan) మరోసారి భారత్‌పై ప్రశంసలు కురిపించారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేసినందుకు పశ్చిమ దేశాలు నిందించిన సమయంలో భారత్‌ అనుసరించిన విదేశాంగ విధానాన్ని కొనియాడారు. లాహోర్‌లో భారీ ర్యాలీలో ప్రసంగించిన ఇమ్రాన్‌ ఖాన్‌.. గతంలో స్లోవేకియాలో జరిగిన బ్రాటిస్లోవా వేదిక నుంచి భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌ మాట్లాడిన వీడియోను ప్లే చేసి మరీ వినిపించారు. ఉక్రెయిన్‌-రష్యా యుద్ధ సమయంలో రష్యా నుంచి చౌకగా చమురును కొనుగోలు చేయొద్దంటూ అమెరికా ఒత్తిడిని దీటుగా ఎదుర్కోవడాన్ని ప్రశంసిస్తూ ప్రస్తుతం పాక్‌ సర్కార్‌ తీరును తీవ్రంగా తప్పుబట్టారు.

భారత్‌, పాకిస్థాన్‌లకు ఒకేసారి స్వాతంత్ర్యం వచ్చిందన్న ఇమ్రాన్‌.. భారత పాలకులు తమ ప్రజల అవసరాలకు అనుగుణంగా ఒక దృఢమైన వైఖరి తీసుకుంటున్నారన్నారు. ‘‘రష్యా నుంచి చమురు కొనొద్దని అమెరికా భారత్‌ను ఆదేశించింది. పైగా భారత్‌ అమెరికాకు వ్యూహాత్మక భాగస్వామి. పాకిస్థాన్‌ కాదు. రష్యా చమురు కొనొద్దని చెప్పిన అమెరికాకు భారత విదేశాంగ శాఖ మంత్రి ఏమని సమాధానం ఇచ్చారో చూద్దాం’’ అంటూ అప్పటి వీడియోను వినిపించారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేయొద్దని చెప్పడానికి మీరెవరు అని జైశంకర్‌ అన్నారన్నారు. రష్యా నుంచి యూరప్‌ గ్యాస్‌ కొనుగోలు చేస్తోందని చెప్పారని.. తమ ప్రజల అవసరాలకు అనుగుణంగా కొనుగోలు చేస్తామని దీటుగా చెప్పారని ప్రశంసించారు. స్వతంత్ర దేశమంటే అది అని భారత్‌ను కొనియాడారు.

రష్యా నుంచి చమురుకొనుగోలు విషయంలో పాకిస్థాన్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ ప్రభుత్వం అమెరికా ఒత్తిళ్లకు తలొగ్గిందని మండిపడ్డారు. ‘‘చౌకగా చమురు కొనుగోలు కోసం రష్యాతో మేం మాట్లాడాం. కానీ ఈ ప్రభుత్వానికి అమెరికా ఒత్తిళ్లను ఎదురించే ధైర్యంలేదు. ఇంధన ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.. ప్రజలు దారిద్ర్యరేఖకు దిగువన ఉన్నారు. ఇలాంటి బానిసత్వానికి నేను వ్యతిరేకిని’’ అంటూ పాకిస్థాన్‌ సర్కార్‌ వైఖరిపై మండిపడ్డారు.


Read latest World News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts