Imran Khan: నాపై మరోసారి హత్యాయత్నం జరగొచ్చు.. భద్రత కల్పించండి..!

తన ప్రాణాలకు ముప్పు ఉందని.. భద్రత కల్పించాలని పాక్‌(Pakistan) మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ కోరారు. ఒక మాజీ ప్రధానికి తగిన స్థాయి భద్రత లేదని ఆరోపించారు. 

Published : 06 Mar 2023 23:24 IST

ఇస్లామాబాద్‌: తన ప్రాణాలకు ప్రమాదం ఉందని, మరోమారు తనపై హత్యాయత్నం జరిగే సూచనలు కనిపిస్తున్నాయని పాకిస్థాన్(Pakistan) మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌(Imran Khan) ఆందోళన వ్యక్తం చేశారు. మార్చి ఏడున తాను కోర్టుకు హాజరుకావడానికి తగిన భద్రత కల్పించాలని కోరారు. ఈ మేరకు పాకిస్థాన్‌ ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. 

‘తీవ్రమైన విషయంపై మీరు దృష్టి సారించాలని కోరుకుంటున్నాను. ఒక ప్రత్యేక ఆపరేషన్‌ ద్వారా నా ప్రభుత్వాన్ని కూలదోసిన దగ్గరి నుంచి నాపై ఎన్నో కేసులు నమోదయ్యాయి. బెదిరింపులు, హత్యాయత్నం జరిగింది. ఒక మాజీ ప్రధాని అయిన నాకు తగిన భద్రత కల్పించడం లేదు. ఇది వరకు నాపై జరిగిన దాడిలో ప్రధాని షెహబాజ్ షరీఫ్ , మంత్రి రాణా సనావుల్లా పాత్ర ఉంది. నాపై మరో హత్యాయత్నానికి సంబంధించి స్పష్టమైన సంకేతాలున్నాయి. నా ప్రాణాలకు ముప్పు ఉందని పోలీసులకు తెలుసు. ఈ క్రమంలో నేను కోర్టుకు వచ్చేందుకు తగిన భద్రత కల్పించండి’ అని ఇమ్రాన్‌(Imran Khan) లేఖలో కోరారు. మంగళవారం ఆయన కోర్టుకు హాజరుకాకపోతే.. పోలీసులు ఆయన్ను అరెస్టు చేసి, కోర్టుకు తీసుకువస్తారని రాణా సనావుల్లా వెల్లడించారు.

ఇప్పటికే తీవ్రమైన ఆర్థిక అస్థిరతను ఎదుర్కొంటున్న పాకిస్థాన్‌(Pakistan)లో రాజకీయంగానూ అశాంతి చెలరేగే ప్రమాదం కనిపిస్తోంది. ఇమ్రాన్‌ఖాన్‌ను అరెస్టు చేసేందుకు పోలీసులు ఆదివారం ఆయన ఇంటికి చేరుకోవడం లాహోర్‌లో తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. అధికారిక కానుకల కేసులో విచారణకు ఇమ్రాన్‌ తరచూ గైర్హాజరు కావడంతో న్యాయస్థానం ఇటీవల ఆయనపై నాన్‌ బెయిలబుల్‌ అరెస్టు వారెంటు జారీ చేసి.. మార్చి 7న హాజరుపరచాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో పోలీసులు.. పీటీఐ మద్దతుదారుల మధ్య జరిగిన ఘర్షణతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మార్చి 7న ఇమ్రాన్‌ కోర్టు ముందు హాజరవుతారని ఆయన తరఫు న్యాయవాదుల బృందం హామీ ఇవ్వడంతో పోలీసులు వెనుదిరిగారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు