Imran Khan: రూ.1500 కోట్ల పరువు నష్టం దావా వేసిన ఇమ్రాన్‌ఖాన్‌

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్(Imran Khan) ఎన్‌ఏబీపై పరువు నష్టం దావా వేసేందుకు సిద్ధమయ్యారు. అరెస్టు వల్ల తన ప్రతిష్ఠకు భంగం కలిగిందని ఆరోపిస్తూ.. ఈ న్యాయ ప్రక్రియను ప్రారంభించారు. 

Published : 02 Jun 2023 20:06 IST

ఇస్లామాబాద్‌: దాయాది దేశం పాకిస్థాన్‌లో రాజకీయ అనిశ్చితి కొనసాగుతోంది. తాజాగా మాజీ ప్రధాని, తెహ్రీక్‌-ఏ-ఇన్సాఫ్‌(PTI)  పార్టీ అధినేత  ఇమ్రాన్‌ ఖాన్‌ (Imran Khan)..1500 కోట్ల పాకిస్థానీ రూపాయల పరువునష్టం దావా వేసేందుకు సిద్ధమయ్యారు. జాతీయ జవాబుదారీ బ్యూరో(NAB)పై ఈ కేసు వేయనున్నారు. గత నెల జరిగిన అరెస్టు వల్ల తన ప్రతిష్ఠ తీవ్ర భంగం కలిగిందని వెల్లడించారు.

‘ఎన్‌ఏబీ ఛైర్మన్‌పై 15వందల కోట్ల రూపాయాల పరువు నష్టం కేసు వేసేందుకు నిర్ణయించుకున్నాను. ఆయనకు లీగల్ నోటీసు పంపించాను. నా అరెస్టు వారెంట్‌ ప్రభుత్వ సెలవురోజున జారీ అయింది. దానిని ఎనిమిది రోజులు రహస్యంగా ఉంచారు. అల్‌ ఖాదిర్ ట్రస్ట్ కేసులో ఎంక్వైరీని ఇన్వెస్టిగేషన్‌గా మార్చుతున్నట్లు నాకు ముందుగా సమాచారం ఇవ్వలేదు. నన్ను అరెస్టు చేసేందుకు పాకిస్థాన్ రేంజర్లను ఉపయోగించారు. అరెస్టు వారెంట్ అమలు చేసిన తీరు రాజ్యాంగవిరుద్ధమని  సుప్రీంకోర్టు పేర్కొంది. ఇస్లామాబాద్ హైకోర్టు ప్రాంగణంలో నన్ను అరెస్టు చేయడం వెనక నా ప్రతిష్ఠకు భంగం కలిగించడమే అసలు ఉద్దేశం. నేను అవినీతి ఆరోపణలపై అరెస్టయ్యాయని ప్రపంచానికి చూపించాలనుకున్నారు. నేను ఏటా ఛారిటీ కోసం 10 బిలియన్ల పాకిస్థానీ రూపాయలను విరాళంగా అందుకుంటాను. నా నిజాయతీకి ఎప్పుడూ ప్రశ్న ఎదురుకాలేదు. కానీ ఈ బోగస్ అరెస్టుతో నా ప్రతిష్ఠకు తీవ్ర భంగం వాటిల్లింది. అందుకే నా హక్కుల్లో భాగంగా పరువు నష్టం దావా ప్రక్రియను ప్రారంభించా’అని ఇమ్రాన్ శుక్రవారం ట్విటర్ వేదికగా వెల్లడించారు. 

అల్‌ ఖాదిర్‌ ట్రస్టు కేసులో విచారణకు హాజరైన ఇమ్రాన్‌ ఖాన్‌ను గత నెల పాక్‌ రేంజర్లు ఇస్లామాబాద్‌ హైకోర్టు (IHC) ఆవరణలోనే అరెస్టు చేశారు. ఐహెచ్‌సీ ఆదేశాల మేరకు ఆయన్ను నేషనల్‌ అకౌంటబిలిటీ బ్యూరో (ఎన్‌ఏబీ)కు అప్పగించారు. దాంతో ఆగ్రహానికి గురైన పీటీఐ పార్టీ కార్యకర్తలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. అయితే కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. 

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని