Pak PM: విదేశీకుట్ర నిరూపిస్తే.. రాజీనామా చేసి ఇంటికి వెళ్తా: షెహబాజ్‌ షరీఫ్‌

తమ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ‘విదేశీ కుట్ర’ జరిగిందంటూ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ పేర్కొనడం ఓ డ్రామా అని నూతన ప్రధాని షెహబాజ్‌ పేర్కొన్నారు.

Published : 11 Apr 2022 20:24 IST

ఇస్లామాబాద్‌: తమ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ‘విదేశీ కుట్ర’ జరిగిందంటూ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ పేర్కొనడం ఓ డ్రామా అని నూతన ప్రధాని షెహబాజ్‌ పేర్కొన్నారు. ఒకవేళ అవి రుజువైతే రాజీనామా చేసి ఇంటికి వెళ్లిపోతానని స్పష్టం చేశారు. నూతన ప్రధానమంత్రిగా ఎన్నికైన సందర్భంగా పార్లమెంటులో ప్రసంగించిన షెహబాజ్‌.. చెడుపై మంచి విజయం సాధించిందన్నారు.

విదేశీ కుట్రగా చెబుతున్న వివాదాస్పద లేఖకు సంబంధించి పాకిస్థాన్‌ జాతీయ భద్రతా కమిటీకి వివరిస్తామని షెహబాజ్‌ షరీఫ్‌ వెల్లడించారు. ఈ సందర్భంగా ఇమ్రాన్‌ ఖాన్‌ చేసిన కుట్ర ఓ డ్రామా అంటూ పేర్కొన్నారు. తన ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు అమెరికా కుట్ర పన్నిందంటూ ఇమ్రాన్‌ ఖాన్‌ చేసిన ఆరోపణల నేపథ్యంలో షెహబాజ్‌ ఈ విధంగా స్పందించారు. ఇక భారత్‌ సంబంధాలపై మాట్లాడిన షెహబాజ్‌ షరీఫ్‌.. భారత్‌తో సత్సంబంధాలను కొనసాగించాలని కోరుకుంటున్నానని చెప్పారు. అయితే, కశ్మీర్‌ సమస్య పరిష్కారం కాకుండా అది సాధ్యం కాదని చెప్పుకొచ్చారు.

ఇతరుల జోక్యాన్ని వ్యతిరేకిస్తాం: చైనా

పాకిస్థాన్‌లో రాజకీయ మార్పుపై అటు చైనా కూడా స్పందించింది. ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రభుత్వాన్ని గద్దె దింపిన పరిస్థితులు ఏమైనప్పటికీ ఇరు దేశాల సంబంధాలను అవి ప్రభావితం చేయవని పేర్కొంది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్‌ అంతర్గత వ్యవహారాల్లో ఇతరుల జోక్యాన్ని తాము వ్యతిరేకిస్తామని తెలిపింది. పొరుగున ఉన్న అత్యంత మిత్ర దేశంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా.. వారి దేశంలో స్థిరత్వ పాలన, అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తాయని ఆశిస్తున్నట్లు వెల్లడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని