Pakistan: ఇమ్రాన్‌ఖాన్‌ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడినట్లేనా..?

ఇమ్రాన్‌ ప్రభుత్వంలో కీలక భాగస్వామ పక్షాలుగా ఉన్న మూడు పార్టీలు మంత్రివర్గం నుంచి వైదొలిగేందుకు సిద్ధమవుతునట్లు సమాచారం.

Updated : 16 Mar 2022 16:34 IST

మద్దతు ఉపసంహరించుకునే యోచనలో భాగస్వామ్యపక్షాలు

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌కు పదవీగండం తప్పేటట్లు కనిపించడం లేదు. తన ప్రభుత్వంపై విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధమవుతోన్న ఇమ్రాన్‌ ఖాన్‌కు మరో ఎదురుదెబ్బ తగులనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఇమ్రాన్‌ ప్రభుత్వంలో కీలక భాగస్వామ్య పక్షాలుగా ఉన్న మూడు పార్టీలు మంత్రివర్గం నుంచి వైదొలిగేందుకు సిద్ధమవుతునట్లు సమాచారం. ఒకవేళ ఇదే నిజమైతే ఇమ్రాన్‌ ప్రభుత్వం మెజారిటీ కోల్పోయే ప్రమాదం ఉంది.

ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న పాకిస్థాన్‌ ప్రతిపక్ష పార్టీలు.. ఆయనపై ఇటీవలే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాయి. ఇదే సమయంలో ఇమ్రాన్‌ఖాన్‌ ప్రభుత్వంలోని మూడు భాగస్వామ్యపక్షాలు కేబినెట్‌ నుంచి బయటకు వచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. పార్లమెంట్‌ దిగువసభలో (ఐదుగురు సభ్యులతో) కీలక భాగస్వామిగా ఉన్న పాకిస్థాన్‌ ముస్లిం లీగ్‌-ఖయీద్‌ నేత ఛౌద్రీ పర్వేజ్‌ ఎలాహీ ఈ విషయాన్ని వెల్లడించారు. తమతోపాటు ఐదు సీట్లున్న బలోచిస్థాన్‌ ఆవామీ పార్టీ, ఏడు సీట్లున్న ముత్తహిదా ఖామీ మూవ్‌మెంట్‌-పాకిస్థాన్‌ పార్టీలు కూడా ప్రభుత్వంలో ఉండాలా..? లేదా?  అనే విషయంపై సంయుక్త నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైనట్లు తెలిపారు. ఒకవేళ వైదొలగాలని నిర్ణయిస్తే మాత్రం ప్రతిపక్షాలకు మరింత మద్దతు పెరిగినట్లు అవుతుందన్నారు. ఇటువంటి సందర్భంలో ‘భాగస్వామ్యపక్షాలను ఇమ్రాన్‌ ఖాన్‌ వ్యక్తిగతంగా కలిసి ఏమేరకు బుజ్జగిస్తారనేది కీలకం. లేదంటే ఇమ్రాన్‌ఖాన్‌ వందశాతం తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నట్లే’ అని ఓ వార్తా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పర్వేజ్‌ ఎలాహీ స్పష్టం చేశారు.

అవిశ్వాసం ఎందుకంటే..

ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని అక్కడి ప్రతిపక్ష పార్టీలు ఎప్పటినుంచో ప్రయత్నాలు చేస్తున్నాయి. దేశంలో నెలకొన్న తీవ్ర సంక్షోభాలకు ఇమ్రాన్‌ ప్రభుత్వ విధానాలే కారణమంటూ మండిపడుతున్నాయి. ముఖ్యంగా దేశంలో నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, విపరీతంగా పెరిగిన రుణాలు వంటి సంక్షోభాలపై ఇమ్రాన్‌ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. వీటికి బాధ్యత వహిస్తూ ఇమ్రాన్‌ ఖాన్‌ను పదవినుంచి తొలగించాలని ప్రతిపక్ష పార్టీలు అక్కడి నేషనల్ అసెంబ్లీ (పార్లమెంటు)లో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. ఈ నేపథ్యంలో ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు కావాల్సిన 172 మందికిపైగా సభ్యుల మద్దతు తమకు ఉందని పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్ (పీఎంఎల్-ఎన్), పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) తదితర పార్టీలు ప్రకటించాయి. మార్చి 28-30 తేదీల్లో ఈ తీర్మానంపై ఓటింగ్‌ జరిగే అవకాశం ఉంది.

ఇమ్రాన్‌కు గడ్డుకాలమే..

ఇలా ప్రభుత్వంపై విపక్షాలు తీర్మానాన్ని ప్రవేశపెడుతామని చెబుతుండడంపై ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌ ఇప్పటివరకు బెదిరింపు ధోరణిలోనే స్పందిస్తున్నారు. అవిశ్వాస తీర్మానం వీగిపోతే, పర్యవసానాలను ఎదుర్కోవడానికి ప్రతిపక్షాలు సిద్ధంగా ఉన్నాయా..? అంటూ పలుసార్లు హెచ్చరించారు. తాజాగా ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానానికి రెడీ కావడంతో దాన్ని ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగానే ఉన్నామంటూ ఇమ్రాన్‌ ఖాన్‌ సలహాదారులు పేర్కొంటున్నారు. ఇటువంటి కీలక సమయంలో ప్రభుత్వంలో ఉన్న భాగస్వామ్య పక్షాలు మద్దతు ఉపసంహరించుకునేందుకు సిద్ధం కావడం.. నామమాత్రపు మెజారిటీతో నెట్టుకొస్తున్న ఖాన్‌ పార్టీకి (పీటీఐ)కి ఇబ్బంది కలిగించే విషయంగా కనిపిస్తోంది. 342 మంది సభ్యులున్న పాకిస్థాన్‌ నేషనల్ అసెంబ్లీ (పార్లమెంటు)లో 172 మంది ఇమ్రాన్‌ ఖాన్‌కు వ్యతిరేకంగా ఓటు వేస్తే ఆయన పదవి ఊడిపోయినట్లేనని భాగస్వామ్య పక్షాలే చెబుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని