Imran Khan: నన్ను అపహరించి, హత్య చేయడమే వారి లక్ష్యం..!

పాకిస్థాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌(Imran Khan)ను అరెస్టు చేసేందుకు పోలీసులు విఫలయత్నం చేశారు. దీనిపై ఇమ్రాన్ ట్విటర్ వేదికగా పలు పోస్టులు పెట్టారు. 

Published : 15 Mar 2023 17:51 IST

ఇస్లామాబాద్‌: ఆర్థిక ఇక్కట్లు అనుభవిస్తోన్న పాకిస్థాన్‌లో రాజకీయ ఘర్షణ వాతావరణం నెలకొంది. విదేశీ కానుకల దుర్వినియోగం కేసులో పాకిస్థాన్‌(Pakistan) మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌(Imran Khan)పై ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమైంది. పోలీసులు ఆయన అరెస్టుకు యత్నించడంతో లాహోర్‌లో తీవ్ర ఘర్షణ తలెత్తింది. పోలీసులు, పాకిస్థాన్‌ తెహ్రీక్‌ ఏ ఇన్సాఫ్‌ (పీటీఐ) పార్టీ కార్యకర్తలు పరస్పర దాడులకు దిగారు. ఈ నేపథ్యంలో ఇమ్రాన్‌ ఖాన్ ట్విటర్ వేదికగా వరుస పోస్టులు పెడుతున్నారు.

‘నన్ను అపహరించి, హత్య చేయడమే వారి అసలు ఉద్దేశం. అరెస్టు ప్లాన్ అనేది ఒక డ్రామా మాత్రమే. వారు బాష్పవాయువు, జలఫిరంగులు వాడారు. చివరకు లైవ్‌ ఫైరింగ్‌కు పాల్పడ్డారు. నేను నిన్న సాయంత్రం ష్యూరిటీ బాండ్‌పై సంతకం చేసినా.. డీఐజీ దానిని అంగీకరించలేదు. వారి అరెస్టు ప్లాన్‌లో నిస్సందేహంగా ఏదో దురుద్దేశం ఉంది’ అని బుల్లెట్ల షెల్స్‌తో ఉన్న వీడియోను ఇమ్రాన్‌(Imran Khan) పోస్టు చేశారు. 

ఇదంతా లండన్‌ ప్లాన్‌లో భాగమే..! 

తన అరెస్టు కుట్ర అంతా లండన్‌ ప్లాన్‌లో భాగమని ఇమ్రాన్‌ ఖాన్‌ ఆరోపించారు. ఈ మేరకు వీడియో విడుదల చేశారు. ‘ఇదంతా లండన్‌ ప్రణాళికలో భాగం. ఇమ్రాన్‌ను జైల్లో పెట్టడానికి, పీటీఐని లేకుండా చేయడానికి, నవాజ్‌ షరీఫ్ మీద కేసులన్నీ కొట్టివేయించడానికి అక్కడ ఒక ఒప్పందం మీద సంతకాలు జరిగాయి’ అని వ్యాఖ్యలు చేశారు. తాను మార్చి 18న కోర్టుకు వస్తానని హమీ ఇచ్చినప్పటికీ.. తన ప్రజలపై ఎందుకు దాడి చేయాల్సి వచ్చిందో అర్థం కావడం లేదన్నారు. మంగళవారం ఇమ్రాన్‌ను అరెస్టు  చేసేందుకు పోలీసులు భారీ సంఖ్యలో లాహోర్‌లోని జమన్‌ పార్కు నివాసానికి చేరుకున్నారు.

ఆ ప్రాంతంలోని దారులన్నీ కంటైనర్లు అడ్డుపెట్టి మూసివేసి, ఇమ్రాన్‌(Imran Khan) ఇంటిని ముట్టడించారు. పోలీసుల చర్యలను ప్రతిఘటించడానికి ఇమ్రాన్‌ సారథ్యంలోని పాకిస్థాన్‌ తెహ్రీక్‌ ఏ ఇన్సాఫ్‌ (పీటీఐ) పార్టీ కార్యకర్తలు సైతం పెద్దసంఖ్యలో అక్కడికి చొచ్చుకొని వచ్చారు. పీటీఐ కార్యకర్తలను చెదరగొట్టేందుకు బాష్పవాయువు, జల ఫిరంగులను పోలీసులు ప్రయోగించారు. ప్రతిగా కార్యకర్తలు పోలీసుల పైకి రాళ్లు, ఇటుకలు విసిరారు. కర్రలతోనూ దాడికి దిగారు. ఈ పరస్పర దాడుల్లో కొంతమంది పోలీసు అధికారులు, పీటీఐ కార్యకర్తలు గాయపడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని