India: ఇండోనేసియా రేవులో తొలిసారి సబ్‌మెరైన్‌ నిలిపిన భారత్‌..!

తొలిసారి భారత సబ్‌మెరైన్‌ ఒకటి ఇండోనేసియాలోని జకార్త రేవులో లంగరేసింది. దక్షిణ చైనా సముద్రంపై వివాదం ముదురుతున్న సమయంలో ఈ పరిణామం చోటు చేసుకోవడం విశేషం. 

Updated : 24 Feb 2023 14:57 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: దక్షిణ చైనా సముద్రంపై పెత్తనం కోసం ప్రపంచ దేశాలతో చైనా వివాదం ముదరుతున్న సమయంలో కీలక పరిణామాలు చోటు చేసుకొన్నాయి. ఆసియా దేశాలతో సంబంధాలను భారత్‌ బలోపేతం చేసుకుంటోంది. భారత్‌(India)కు చెందిన ఓ సబ్‌మెరైన్‌ తొలిసారి ఇండోనేసియా(Indonesia)లోని రేవులో లంగరేసింది. దాదాపు 3,000 టన్నుల బరువైన ‘ఐఎన్‌ఎస్‌ సింధుకేసరి’ సుందా జలసంధి మీదుగా జకార్త చేరుకొంది. భారత యుద్ధ నౌకలు.. ఇండోనేసియా, ఇతర ఆసియా దేశాలను తరచూ సందర్శిస్తుంటాయి. కానీ, ఒక సబ్‌మెరైన్‌ను భారత జల సరిహద్దులకు దూరంగా మోహరించడం ఇదే మొదటిసారని నౌకాదళ సీనియర్‌ అధికారులు వెల్లడించారు. భారత్‌-ఇండోనేసియా ఏటా రెండుసార్లు సంయుక్తంగా గస్తీ నిర్వహిస్తాయి. గతేడాది డిసెంబర్‌లో కూడా వీటిని నిర్వహించాయి. ఇరు దేశాలు వ్యూహాత్మక, రక్షణ సంబంధాలను బలోపేతం చేసుకొంటున్నాయి. ఈ క్రమంలోనే 2018లో రక్షణ సహకార ఒప్పందంపై సంతకాలు చేశాయి.

2018లో ఐఎన్‌ఎస్‌ సింధు కేసరికి రూ.1,197 కోట్లు వెచ్చించి రష్యాలో పలు అత్యాధునిక సౌకర్యాలను కల్పించి జీవితకాలం పొడిగించేందుకు చర్యలు తీసుకొన్నారు. దీంతో పాటు మరో నాలుగు సింధుఘోష్‌ శ్రేణి, హెచ్‌డీడబ్ల్యూ శ్రేణి సబ్‌మెరైన్లలో కూడా ఇటువంటి చర్యలు చేపట్టారు.

చైనా వేధింపులకు ప్రధాన భాదిత దేశాల్లో ఫిలిప్పీన్స్‌ కూడా ఒకటి. ఈ దేశానికి చెందిన 21 మంది సైనిక సిబ్బందికి ఇటీవలే నాగ్‌పుర్‌లో బ్రహ్మోస్‌ తయారీపై భారత్‌ శిక్షణ ఇచ్చింది. సముద్ర తీరాల్లో మోహరించే యాంటీషిప్‌ శ్రేణి బ్రహ్మోస్‌ను త్వరలోనే ఫిలిప్పీన్స్‌కు భారత్‌ సరఫరా చేయనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు