India- China: భారత్‌ గురించి మరింత తెలుసుకోవాలని ఉందట..! చైనాలో ఆసక్తికర సర్వే

చైనీయులు భారత్‌ గురించి మరింత తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారట. చైనా వార్తా సంస్థ ‘ది గ్లోబల్‌ టైమ్స్‌’ ఇటీవల నిర్వహించిన ఓ సర్వేలో ఈ విషయం వెల్లడైంది.

Published : 14 Jun 2024 00:09 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత్‌- చైనాల మధ్య సంబంధాలు (India China Ties) ఇటీవలి కాలంలో అంతంతమాత్రంగానే కొనసాగుతోన్న విషయం తెలిసిందే. అయితే.. చైనీయులు మాత్రం భారత్‌ గురించి మరింత తెలుసుకునేందుకు ఆమితాసక్తి చూపుతున్నారట. చైనా వార్తా సంస్థ ‘ది గ్లోబల్‌ టైమ్స్‌’ ఇటీవల నిర్వహించిన ఓ సర్వేలో ఈ విషయం వెల్లడైంది. ముంబయి, దిల్లీలను సందర్శించాలనుకుంటున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది. చాలామంది భారతీయ సినిమాలపైన తమ అభిమానాన్ని చాటి చెప్పారు.

ప్రపంచ వేదికపై భారత్‌ పాత్ర, చైనా, అమెరికాలతో సంబంధాలపై గ్లోబల్ టైమ్స్ ఇన్‌స్టిట్యూట్ (GTI) ఇటీవల చైనా, భారత్‌లలో ఓ సర్వే నిర్వహించింది. చైనాలో 1,440 మంది, భారత్‌లో 1,466 మంది అభిప్రాయాలను సేకరించింది. దీని ప్రకారం.. దాదాపు 90 శాతం మంది చైనీయులు భారత్‌ గురించి మరింత తెలుసుకునేందుకు, 70 శాతంమంది సందర్శించేందుకు ఆసక్తి కనబర్చారు. భారత్‌కు వెళ్లేందుకు 89 శాతం మంది పర్యాటకాన్ని ప్రధాన కారణంగా చూపారు. వారు చూడాలనుకునే నగరాల్లో ముంబయి (56 శాతం), దిల్లీ (51 శాతం) తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. నాలుగింట ఒక వంతు మంది కోల్‌కతా, బెంగళూరులను సందర్శించాలకుంటున్నారు.

భారతీయుల్లో దాదాపు 48 శాతం మంది చైనాను సందర్శించాలని భావిస్తున్నారు. చదువు, ఉద్యోగం, వలస కోసం అక్కడికి వెళ్లేందుకు ఆసక్తి చూపారు. చూడాలనుకునే టాప్‌ నగరాల్లో బీజింగ్ (51 శాతం), షాంఘై (49 శాతం)లు ఉన్నాయి. 20 శాతం మంది షెన్‌జెన్‌లో పర్యటించాలనుకుంటున్నట్లు చెప్పారు.

ఒక డాలరు పెట్టి కొన్న పాత పేపర్లలో.. అన్నీ సైనిక రహస్యాలే!

చైనీయుల్లో సగం మందికి పైగా భారతీయ సాహిత్యం, సినిమాలు, షోలను ఆస్వాదించారు. దాదాపు 30 శాతం మంది మన ఉత్పత్తులను కొనుగోలు చేశారు. సర్వేలో పొందుపర్చిన ఇండియన్‌ సినిమాలను 90శాతం మంది వీక్షించారు. దంగల్‌, త్రీ ఇడియట్స్‌లను 40 శాతం, స్లమ్‌డాగ్ మిలియనీర్, దేవదాస్‌లను 20 శాతం మంది చూశారు. చైనా చిత్రాలను మనవాళ్లలో సగానికిపైగా వీక్షించారు. జర్నీ టు ది వెస్ట్ (15 శాతం), రొమాన్స్ ఆఫ్ ది త్రీ కింగ్‌డమ్స్ (14 శాతం) టాప్‌లో నిలిచాయి. మీట్ యువర్‌సెల్ఫ్ (10 శాతం), ఫ్రై మీ టు ది మూన్ (10 శాతం) వంటివాటికి ఆదరణ లభించింది. దాదాపు సగం మంది చైనాలో తయారైన లేదా ఆ దేశ బ్రాండెడ్ ఉత్పత్తులు కొనుగోలు చేశారు. 40 శాతం మంది అక్కడి యాప్‌లను ఉపయోగించారు. 30 శాతానికిపైగా మంది చైనా సాహిత్యం, చలనచిత్రాలు, షోలు చూశారు.

‘‘మరింత మంది చైనీయులు భారత్‌ అభివృద్ధిని గుర్తిస్తున్నారని, భవిష్యత్తులో ప్రపంచ వేదికపై దిల్లీని కీలక శక్తిగా పరిగణిస్తున్నారని ఈ సర్వే సూచిస్తోంది. మరిన్ని మార్గాల ద్వారా వారు పొరుగు దేశంలోని వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకోవాలనుకుంటున్నారు’’ అని సింగువా విశ్వవిద్యాలయానికి చెందిన నేషనల్ స్ట్రాటజీ ఇన్‌స్టిట్యూట్‌లోని పరిశోధన విభాగం డైరెక్టర్ కియాన్ ఫెంగ్ ‘గ్లోబల్ టైమ్స్‌’కు చెప్పారు. నేరుగా రాకపోకలు సాగించే విమానాల పునఃప్రారంభం, రెండు దేశాల్లో పాత్రికేయులను ఉంచడం, వీసా ఆంక్షలు సడలించడం, పర్యటకాన్ని ప్రోత్సహించడం, మేధో సంస్థల మధ్య చర్చలు వంటి చర్యలతో ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత మెరుగుపరచవచ్చు’’ అని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని