Afghanistan: విద్యార్థులపై ఆంక్షల పరంపర.. ‘టై’లు కట్టుకోవద్దంటూ కొత్త నిబంధన

అఫ్గానిస్థాన్‌ను పాలిస్తున్న తాలిబన్ల విచిత్ర, కఠిన నిబంధనలతో ఆ దేశ విద్యార్థులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. తాజాగా మరో నిబంధనను అమల్లోకి తీసుకొచ్చారు........

Published : 17 Apr 2022 02:10 IST

కాబుల్‌: అఫ్గానిస్థాన్‌ను పాలిస్తున్న తాలిబన్ల విచిత్ర, కఠిన నిబంధనలతో ఆ దేశ విద్యార్థులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఇప్పటికే పదులు సంఖ్యలోని ఆంక్షలతో అనేక మంది విద్యార్థులు చదువుకు దూరమయ్యారు. తాలిబన్లు తాజాగా మరో నిబంధనను అమల్లోకి తీసుకొచ్చారు. పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, ఉపాధ్యాయులు ‘టై’లు కట్టుకోవద్దని తాలిబన్లు కొత్త రూల్‌ని తీసుకొచ్చినట్లు అక్కడి ‘టోలో న్యూస్‌’ వెల్లడించింది. విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇకపై పాఠశాలల్లో నెక్‌ టైలు ధరించేందుకు అనుమతించబోమని ఎడ్యుకేషనల్ డైరెక్టరేట్, విద్యా మంత్రిత్వ శాఖ ఓ లేఖలో వెల్లడించాయి. ‘టై’లు ధరించడాన్ని పూర్తిగా నిషేధించినట్లు ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ అఫ్గానిస్థాన్ విద్యా మంత్రిత్వ శాఖ ప్రతినిధి అజీజ్ అహ్మద్ రేయాన్ స్పష్టం చేశారు.

అధికారం చేపట్టినప్పటి నుంచి ప్రజలపై తాలిబన్లు అనేక ఆంక్షలు విధిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా విద్యార్థులు, మహిళలపై ఆంక్షలు కొనసాగుతూనే ఉన్నాయి. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో బాలికలకు ఉన్నత విద్య అడ్డుకట్టవేశారు. బాలికలు ఉన్నత విద్య అభ్యసించేందుకు అనుమతించబోమని.. ఆరో తరగతి వరకే పరిమితం చేస్తున్నట్లు తాలిబన్‌ ప్రభుత్వం కొద్దిరోజల క్రితమే స్పష్టం చేసింది. ఇలా తాలిబన్‌ నేతలు అనేక మంది కఠిన పాలనకే మొగ్గు చూపుతున్నారు. సంస్కరణలు చేపట్టాల్సిన అవసరం ఉందని కొందరు వాదిస్తున్నప్పటికీ.. వారి మాటను ఆలకించేవారు ఎవరూ లేకపోవడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని