Myanmar: గాల్లో ఉన్న విమానంలోకి దూసుకొచ్చిన తూటా!

గాల్లో ఉన్న విమానం(Aeroplane)లో ఊహించని పరిణామం! నేలపైనుంచి జరిపిన కాల్పుల్లో(Gunshot).. ఓ తూటా లోపలికి దూసుకురావడం గమనార్హం. ఈ ఘటనలో ఓ ప్రయాణికుడు...

Published : 03 Oct 2022 01:25 IST

నెపిడో: గాల్లో ఉన్న విమానం(Aeroplane)లో ఊహించని పరిణామం! నేలపైనుంచి జరిపిన కాల్పుల్లో(Gunshot).. ఓ తూటా లోపలికి దూసుకురావడం గమనార్హం. ఈ ఘటనలో ఓ ప్రయాణికుడు గాయపడ్డాడు. మయన్మార్‌(Myanmar)లో ఇది చోటుచేసుకుంది. దేశ రాజధాని నెపిడో(Naypyidaw) నుంచి బయల్దేరిన ఆ లోహవిహంగం.. శుక్రవారం ఉదయం లోయికా ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండింగ్‌కు సిద్ధమవుతుండగా ఇది జరిగింది. ఆ సమయంలో విమానం మూడు వేలకుపైగా అడుగుల ఎత్తులో ఉన్నట్లు అధికారులు చెప్పారని స్థానిక వార్తాసంస్థలు పేర్కొన్నాయి. మయన్మార్‌ నేషనల్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఈ విమానంలో మొత్తం 63 మంది ప్రయాణిస్తున్నారు.

లోపలికి చొచ్చుకొచ్చిన తూటాతో విమానంలో ఉన్న ఓ యువకుడి కుడిచెంపకు గాయమైంది. దీంతో ల్యాండ్‌ అయిన వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు. విమానంపై బుల్లెట్‌ రంధ్రం, గాయపడిన ప్రయాణికుడి ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఇది జుంటా వ్యతిరేక మిలీషియా కరెన్ నేషనల్ ప్రోగ్రెసివ్ పార్టీ(కేఎన్‌పీపీ), పీపుల్స్ డిఫెన్స్ ఫోర్స్(పీడీఎఫ్‌)ల పనేనని మయన్మార్ మిలిటరీ ఆరోపించింది. అయితే.. ఇందులో తమ ప్రమేయం లేదని కేఎన్‌పీపీ స్పష్టం చేసింది. మరోవైపు.. అధికారులు తదుపరి నోటీసు వచ్చే వరకు లోయికాకు విమానాలను రద్దు చేశారు. మయన్మార్ మిలిటరీ.. ఎయిర్‌పోర్ట్‌ పరిసరాల్లో సైనికులను మోహరించింది. ఆ ప్రాంతంలో సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని