Lions for Love: ఆడతోడు కోసం అలుపెరగని.. రెండు ‘సింహాల సాహసయాత్ర’!

ఓ ఆడతోడు కోసం రెండు సింహాలు అలుపెరగకుండా సాహస ప్రయాణం చేసిన ఘటన ఆఫ్రికాలో చోటుచేసుకుంది.

Updated : 11 Jul 2024 20:40 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మొసళ్లు, నీటి ఏనుగులతో నిండిన నది అది. అడవి జంతువులు దాన్ని దాటాలంటే ప్రాణాలను పణంగా పెట్టాల్సిందే..! అలాంటి ప్రమాదకర పరిస్థితుల్లో కిలోమీటరుకుపైగా ఈది.. అవతలి ఒడ్డుకు చేరుకున్నాయి రెండు మృగరాజులు. ఇంతకీ ఎందుకోసం అనుకుంటున్నారా? ఓ ఆడతోడు కోసం. అవును.. ఓ లేడీ సింహం కోసం సాహస ప్రయాణం చేసిన రెండు ఆఫ్రికన్‌ సింహాల కథ ఇది.

ఆఫ్రికా ఉగాండాలోని క్వీన్‌ ఎలిజబెత్‌ నేషనల్‌ పార్కులో సింహాల సంఖ్య కొన్నేళ్లుగా తగ్గుతున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. దీంతో అక్కడ ఆడ సింహాల కోసం మగవాటి మధ్య పోటీ ఎక్కువైంది. ఈ క్రమంలో రెండు మృగరాజులు మరో గుంపుతో తలపడి వెనక్కి తగ్గాయి. అయినా.. అక్కడితో ఆగకుండా నది అవతలి వైపు ఆడ సింహాలు ఉండొచ్చనే ఆశతో సాహసోపేత యాత్ర మొదలుపెట్టాయి. ప్రమాదకరమైన నదిని (కజింగా ఛానల్‌) దాటేందుకు సిద్ధమయ్యాయి.

ఐదుగురు ప్రధానులు మారినా.. ‘వేటగాడు’ మాత్రం అక్కడే!

ఈ రెండు సింహాల్లో ఒకటైన ‘జాకబ్‌’కు అత్యంత బలమైన మృగరాజుగా పేరుంది. అడవి దున్నలు, వేటగాళ్ల దాడులు, శరీర భాగాల కోసం విషప్రయోగం.. ఇలా తన జీవితంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్న ‘జాకబ్‌’ గతంలో ఓ ఇనుప ఉచ్చులో చిక్కుకుని తన కాలును కూడా కోల్పోయింది. ఏదేమైనప్పటికీ జాకబ్‌ మాత్రం గమ్యం వైపే ప్రయాణాన్ని కొనసాగించింది. కుంటుతూనే తన సోదర సింహానికి (టిబు) దారి చూపింది. తొలిసారి ఈ ఏడాది ఫిబ్రవరిలో నదిని దాటేందుకు యత్నించాయి. కొంతదూరం వెళ్లగానే నీటి జంతువుల ముప్పుతో వెనక్కి వచ్చాయి. ఇలా మూడుసార్లు విఫలయత్నం చేశాయి.

అయినా.. పట్టువిడవకుండా నాలుగో ప్రయత్నంలో భాగంగా ఫిబ్రవరి 4న విజయవంతంగా ఈది నది అవతలి ఒడ్డుకు చేరుకోగలిగాయి. నివాసం లేదా భాగస్వామి కోసం ఇలా సాహసానికి ఒడిగట్టినతీరు వాటి లింగ నిష్పత్తులు గణనీయంగా తగ్గిపోయాయనడానికి ప్రత్యక్ష నిదర్శనమని పరిశోధకులు పేర్కొన్నారు. ఆ రెండు సింహాలకు సంబంధించిన ప్రతి కదలికలను ప్రత్యేక కెమెరాలు, డ్రోన్ల ద్వారా చిత్రీకరించారు. జీవావరణ శాస్త్ర జర్నల్‌లోనూ వాటి ‘సాహస యాత్ర’ ప్రచురితమైంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని