China: అక్కడ కొవిడ్ సోకితే.. తల్లి అక్కడ.. బిడ్డ ఇంకో దగ్గర..!

కరోనా వైరస్‌ను కట్టడిచేసే విషయం చైనా కఠిన ఆంక్షలు అమలు చేస్తోంది. కరోనా పరీక్షలు చేయించుకోవడానికి తప్ప ప్రజలు బయటకు రావడానికి వీలు లేకుండా నిర్బంధిస్తోంది

Published : 03 Apr 2022 01:38 IST

షాంఘై: కరోనా వైరస్‌ను కట్టడిచేసే విషయం చైనా కఠిన ఆంక్షలు అమలు చేస్తోంది. కరోనా పరీక్షలు చేయించుకోవడానికి తప్ప ప్రజలు బయటకు రావడానికి వీలు లేకుండా నిర్బంధిస్తోంది. చివరకు కొవిడ్ సోకిన పసికందుల్ని తల్లిదండ్రుల నుంచి వేరుచేస్తోంది..!

చైనాలో అత్యధిక జనాబా కలిగిన నగరం, ఫైనాన్షియల్ హబ్ అయిన షాంఘై ఇప్పుడు కొవిడ్ కోరల్లో చిక్కుకొని ఉంది. ఈ రెండేళ్లలో ఎన్నడూ లేని స్థాయిలో అక్కడ మహమ్మారి విజృంభిస్తోంది. ఈ క్రమంలో మార్చి 26న ఎస్తేర్ ఝావో అనే మహిళ, తన రెండున్నరేళ్ల కుమార్తెతో కలిసి ఆసుపత్రికి వచ్చింది. అక్కడ తల్లీబిడ్డ ఇద్దరికీ పాజిటివ్ అని తేలింది. ఆ వెంటనే తల్లీబిడ్డను వేరు చేసి, ఎవరికి కేటాయించిన నిర్బంధ కేంద్రంలోకి వారిని తరలించేందుకు అధికారులు నిర్ణయించారు. ఈ పరిస్థితుల్లో తానే తన కుమార్తెను చూసుకుంటానని, తన నుంచి వేరు చేయొద్దని ఆ తల్లి అధికారుల్ని వేడుకుంది. కానీ నిబంధనల పేరు చెప్పి, వారిని వేర్వేరు సంరక్షణా కేంద్రాలకు తరలించారు.

అప్పటినుంచి తన బిడ్డకు ఎలా ఉందో అని ఝావోకు కలవరం మొదలైంది. ఒకపక్క ఆమెకూడా క్వారంటైన్‌ కేంద్రంలోనే ఉండిపోయింది. ఆమె కుటుంబ సభ్యులు పాప గురించి వైద్యులను పదేపదే అడిగితే.. ‘మీ పాప బాగానే ఉంది’ అంటూ చిన్న సందేశం పంపించారంతే. ‘నా బిడ్డ ఎలా ఉందో తెలుసుకుందామని అడిగితే.. బాగుందంటూ ఒక సందేశం పెట్టారు. ఒక్క ఫొటో కూడా పెట్టలేదు. నా మనసంతా ఆందోళనగా ఉంది. అసలు తను అక్కడ ఎలా ఉందో నాకు ఏమాత్రం తెలియడం లేదు. ఏదైనా అడిగితే షాంఘైలో ఉన్న నిబంధనల గురించి చెప్తున్నారు. పాజిటివ్ వచ్చిన పిల్లల్ని వారికి కేటాయించిన ప్రాంతంలో ఉంచాలి. పెద్దల్ని క్వారంటైన్ కేంద్రానికి తరలించాలి. అక్కడకు వెళ్లి పిల్లలకు తోడుగా ఉండటానికి వీలు లేదు’ అంటూ కన్నీటి పర్యంతమయ్యారు. వీటికి తోడు తల్లిదండ్రులకు దూరంగా క్వారంటైన్ కేంద్రాల్లో ఉన్న చిన్నారులు ఏడుస్తూ, మూలుగుతున్న దృశ్యాలు వైరల్‌గా మారాయి. ఈ సంగతి తెలిసి, ఆమె ఇంకా భయపడసాగింది. ఆ దృశ్యాలపై షాంఘై యంత్రాంగం కానీ, పిల్లల సంరక్షణా కేంద్రంగానీ స్పందించలేదు. 

తల్లి పాలు తాగాల్సిన మూడునెలల పసికందును కూడా ఆ కేంద్రాల్లో ఉంచినట్లు ఆ చిత్రాలను బట్టి తెలుస్తోంది. మరికొన్నింటిలో సంరక్షణ కేంద్రాల్లో పెద్దలు లేకుండా పిల్లలు మాతమ్రే ఉన్నారు. వీటిని చూసిన ప్రజలు.. ‘ఇది చాలా భయంకరంగా ఉంది. అసలు ఇలాంటి నిబంధనలు ఎలా పెట్టారు?’  అంటూ ప్రశ్నిస్తున్నారు. దాదాపు నెల రోజుల నుంచి షాంఘైలో తాజా కొవిడ్ ఉద్ధృతి మొదలైంది. సుమారు 26 మిలియన్ల మంది ప్రజలు లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోయారు. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం చూసుకుంటే అక్కడ కేసుల సంఖ్య తక్కువగానే కనిపిస్తోంది. కానీ ప్రభుత్వం వైరస్ వ్యాప్తికి ఏ చిన్న అవకాశం కూడా ఉండకూడదని కఠినంగా వ్యవహరిస్తోంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు