Pakistan: ‘జిహాద్‌’కు అలా నిధులు సేకరించడం దేశ ద్రోహమే: పాక్‌ కోర్టు

‘జిహాద్‌’ కోసం నిధులు సేకరించడానికి ప్రజలను ప్రేరేపించడం దేశద్రోహం కిందకే వస్తుందని పాకిస్థాన్‌లోని లాహోర్‌ హైకోర్టు స్పష్టం చేసింది. ఏ వ్యక్తికైనా, సంస్థకైనా ఈ విధంగా నిధులు సేకరించడానికి అనుమతిలేదని తెలిపింది. జిహాద్‌ కోసం తెహ్రీక్‌ ఇ తాలిబన్‌ పాకిస్థాన్‌(టీటీపీ)కి చెందిన ఇద్దరు ఉగ్రవాదులు

Published : 28 Jan 2022 01:43 IST

ఇస్లామాబాద్‌: ‘జిహాద్‌’ కోసం నిధులు సేకరించడానికి ప్రజలను ప్రేరేపించడం దేశద్రోహం కిందకే వస్తుందని పాకిస్థాన్‌లోని లాహోర్‌ హైకోర్టు స్పష్టం చేసింది. ఏ వ్యక్తికైనా, సంస్థకైనా ఈ విధంగా నిధులు సేకరించడానికి అనుమతిలేదని తెలిపింది. జిహాద్‌ కోసం తెహ్రీక్‌ ఇ తాలిబన్‌ పాకిస్థాన్‌ (టీటీపీ)కి చెందిన ఇద్దరు ఉగ్రవాదులు ప్రజలతో నిధులు సమీకరిస్తున్నారన్న ఆరోపణతో అరెస్ట్‌ అయ్యారు. తాజాగా ఈ కేసుపై విచారణ జరిపిన న్యాయస్థానం పైవిధంగా స్పందించింది. ‘ఏదైనా విపత్తు ఏర్పడినప్పుడు దేశవ్యాప్తంగా నిధులు సమీకరించడం ప్రభుత్వాల విధి. కానీ, అదే పని ఇతరులు, సంస్థలు చేయకూడదు. అలా చేస్తే దేశద్రోహంగా పరిగణించాల్సి వస్తుంది’’అని ధర్మాసనం వెల్లడించింది.

2008 ముంబయి పేలుళ్ల ఘటనలో సూత్రధారి, జమాత్‌-ఉద్‌-దవా ఉగ్రవాద సంస్థకు చెందిన హఫీజ్‌ సయీద్‌ కూడా ఉగ్ర కార్యకలాపాలకు నిధుల సమీకరణ నేరం కింద జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. ఐదు కేసుల్లో అతడికి కోర్టు 36 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ముంబయిలో హఫీజ్‌ చేయించిన ఉగ్రదాడిలో 166 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. వారిలో ఆరుగురు అమెరికన్‌ పౌరులున్నారు. ఈ నేపథ్యంలో అదే ఏడాది హఫీజ్‌పై అమెరికా అంతర్జాతీయ ఉగ్రవాదిగా ముద్ర వేసింది. అతడిని పట్టిస్తే 10 మిలియన్‌ డాలర్ల బహుమతి ఇస్తామని రివార్డు కూడా ప్రకటించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని