Modi - Putin: మాకు భారత్‌ వ్యూహాత్మక భాగస్వామి.. పుతిన్‌తో మోదీ భేటీపై అమెరికా

Modi - Putin: రష్యా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ అధ్యక్షుడు పుతిన్‌తో సమావేశమయ్యారు. దీనిపై అగ్రరాజ్యం అమెరికా స్పందించింది. ఉక్రెయిన్‌ అంశాన్ని పుతిన్‌ వద్ద లేవనెత్తాలని మోదీని కోరింది.

Updated : 09 Jul 2024 12:55 IST

Modi - Putin | వాషింగ్టన్‌: భారత్‌ తమకు ఒక వ్యూహాత్మక భాగస్వామి అని అమెరికా తెలిపింది. వివిధ అంశాలపై నిరంతరం సమగ్ర, స్పష్టమైన చర్చలతో ఇరు దేశాల మధ్య బంధాన్ని ముందుకు తీసుకెళ్తున్నట్లు పేర్కొంది. రష్యాతో మైత్రి కొనసాగింపుపైనా తమ ఆందోళనలను ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నామని తెలిపింది. మోదీ రష్యా పర్యటన, (Modi Russia Tour) ఆ దేశ అధ్యక్షుడు పుతిన్‌తో ద్వైపాక్షిక చర్చల నేపథ్యంలో అగ్రరాజ్యం పైవిధంగా స్పందించింది.

పుతిన్‌ (Vladimir Putin)తో చర్చల్లో ఉక్రెయిన్‌ యుద్ధాన్ని కూడా ప్రస్తావించాలని మోదీకి అమెరికా సూచించింది. రష్యా తీసుకునే ఏ నిర్ణయమైనా.. ఉక్రెయిన్‌ ప్రాంతీయ సమగ్రత, సార్వభౌమత్వం, ఐరాస చట్టాలను గౌరవించేలా ఉండాలని పుతిన్‌కు స్పష్టం చేయాలని చెప్పుకొచ్చింది. రష్యాతో సంబంధాలు కొనసాగించే ఏ దేశాన్నైనా తాము ఇదే కోరతామని అగ్రరాజ్య విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్‌ అన్నారు.

ట్రంప్‌ను ఓడించాలంటే నేనే ఉత్తమం

ఉక్రెయిన్‌ (Ukraine)పై యుద్ధానికి వ్యతిరేకంగా అమెరికా సహా పాశ్చాత్య దేశాలు రష్యాపై ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ఆ దేశంతో వాణిజ్య, వ్యాపార సంబంధాలపై నిషేధం విధించాయి. ముఖ్యంగా చమురు దిగుమతులను నిలిపివేయాలని ప్రపంచ దేశాలను కోరాయి. భారత్‌ మాత్రం వాటిని పెద్దగా పట్టించుకోలేదు. పైగా రష్యా చౌకగా చమురును అందించటంతో పెద్ద ఎత్తున కొనుగోలు చేసింది. దీనిపై ఆయా దేశాలు అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ.. భారత్‌ మాత్రం దేశ ప్రయోజనాల దృష్ట్యా ఎవరి ఒత్తిళ్లకూ తలొగ్గలేదు.

మోదీ సోమవారం రష్యా (Russia) పర్యటనకు బయలుదేరి వెళ్లారు. అక్కడ ఆయనకు ఘన స్వాగతం లభించింది. మోదీ గౌరవార్థం పుతిన్‌ తన అధికారిక నివాసంలో విందు ఇచ్చారు. ఈ సందర్భంగా మోదీని పుతిన్‌ ప్రశంసలతో ముంచెత్తారు. భారత్, భారతీయుల ప్రయోజనాల కోసం జీవితాన్ని అంకితం చేసిన నేతగా అభివర్ణించారు. దీనికి మోదీ స్పందిస్తూ.. ‘‘అవును. మీరు చెప్పింది వాస్తవం. నా దేశం, నా దేశ ప్రజల ప్రయోజనం ఇదొక్కటే నా లక్ష్యం’’ అని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని