UN Vote: రష్యాపై ఐరాస తీర్మానం ఓటింగ్‌కు భారత్‌ దూరం..!

రష్యాపై ఐరాసలో ప్రవేశపెట్టిన మరో తీర్మానం ఓటింగ్‌కు భారత్‌ దూరంగా ఉంది. 94 దేశాలు తీర్మానానికి అనుకూలంగా ఓటువేయడంతో ఆమోదం పొందింది.

Published : 15 Nov 2022 13:23 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఉక్రెయిన్‌ యుద్ధంలో అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనకు రష్యా బాధ్యత వహించాలని, కీవ్‌కు జరిగిన నష్టాలకు తగిన పరిహారం చెల్లించాలంటూ ఐరాస జనరల్‌ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు. దీనికి సంబంధించిన ఓటింగ్‌కు భారత్‌ గైర్హాజరైంది. ఈ తీర్మానాన్ని సోమవారం ఉక్రెయిన్‌ ప్రవేశపెట్టగా.. 94 దేశాలు అనుకూలంగా.. 14 దేశాలు వ్యతిరేకంగా ఓటువేశాయి. తీర్మానం ఓటింగ్‌కు 73 దేశాలు గైర్హాజరయ్యాయి.

ఓటింగ్‌కు దూరంగా ఉన్న దేశాల్లో భారత్‌, భూటాన్‌, బంగ్లాదేశ్‌, బ్రెజిల్‌, ఈజిప్ట్‌, ఇండోనేషియా, ఇజ్రాయెల్‌, నేపాల్‌, పాకిస్థాన్‌, దక్షిణాఫ్రికా, శ్రీలంక ఉన్నాయి. తీర్మానానికి వ్యతిరేకంగా ఓటింగ్‌ చేసిన దేశాల్లో బెలారస్‌, చైనా, క్యూబా, ఉత్తరకొరియా, ఇరాన్‌, రష్యా, సిరియా ఉన్నాయి.  మొత్తం మీద ఈ తీర్మానం ఆమోదం పొందింది. ఈ తీర్మానంపై భారత ప్రతినిధి రుచిరా కాంబోజ్‌ మాట్లాడుతూ ‘‘ఐరాస జనరల్‌ అసెంబ్లీ తీర్మానం వల్ల పరిహారం లభిస్తుందా అన్నది పరిగణనలోకి తీసుకోవాలి. ఐరాస జనరల్‌ అసెంబ్లీ తీర్మానం చట్టబద్ధత అస్పష్టమే. ఐరాస, అంతర్జాతీయ సమాజంపై భవిష్యత్తు ప్రభావం అంచనా వేయకుండా కొత్త యంత్రాంగాలను సృష్టించకూడదు. అంతేకాదు.. చర్చలకు, దౌత్యానికి ముందస్తుగానే ముగింపు పలికే అవకాశం ఉంది’’ అని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని