Ukraine Crisis: ఉక్రెయిన్‌ యుద్ధంపై మరో ఐరాస తీర్మానానికి భారత్‌ దూరం

ఉక్రెయిన్‌పై రష్యా దాడిని ఖండిస్తూ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి చేసిన తీర్మానాన్ని రష్యా వీటో అధికారంతో అడ్డుకొన్న నేపథ్యంలో.. అమెరికా తదితర దేశాల కూటమి ప్రత్యామ్నాయ చర్యలు ముమ్మరం చేసింది.....

Updated : 28 Feb 2022 10:50 IST

న్యూయార్క్‌‌: ఉక్రెయిన్‌పై రష్యా దాడిని ఖండిస్తూ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి చేసిన తీర్మానాన్ని రష్యా వీటో అధికారంతో అడ్డుకొన్న నేపథ్యంలో.. అమెరికా తదితర దేశాల కూటమి ప్రత్యామ్నాయ చర్యలు ముమ్మరం చేసింది. ఇదే అంశంపై చర్చించేందుకు 193 సభ్య దేశాలున్న ఐరాస సర్వప్రతినిధి సభ అసాధారణ, అత్యవసర ప్రత్యేక సమావేశానికి రంగం సిద్ధంచేసింది. ఈ మేరకు 15 సభ్య దేశాల భద్రతా మండలి ఓటింగులో పాల్గొని నిర్ణయం తీసుకున్నాయి. అయితే, భారత్‌ ఈ ఓటింగ్‌ ప్రక్రియకు దూరంగా ఉంది. రష్యా సైనిక చర్యను ఖండిస్తూ భద్రతా మండలిలో చేసిన తీర్మానానికీ భారత్‌ గైర్హాజరైన విషయం తెలిసిందే. ఐక్యరాజ్య సమితి ఏర్పడిన తర్వాత ఇటువంటి అసాధారణ సమావేశాలు గత ఏడు దశాబ్దాల్లో పది సందర్భాల్లో మాత్రమే జరిగాయి.

‘‘ఉక్రెయిన్‌-రష్యా వివాదంపై భద్రతా మండలి ఇటీవల భేటీ అయిన తర్వాత పరిస్థితులు మరింత దిగజారడం విచారకరం. దౌత్యమార్గాలు, చర్చలు తప్ప మరో మార్గం లేదు. బెలారస్ సరిహద్దుల్లో చర్చలకు ఇరు దేశాలు అంగీకరించడాన్ని స్వాగతిస్తున్నాం. సరిహద్దుల్లో నెలకొన్న క్లిష్ట పరిస్థితుల వల్ల మా పౌరుల తరలింపు కార్యక్రమంపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతోంది. ప్రజల కదలికలపై సరైన అంచనాలతో ఉండాల్సిన అవసరం ఉంది. ఈ అత్యవసర మానవతా సంక్షోభాన్ని వెంటనే పరిష్కరించాల్సి ఉంది. ఈ క్లిష్ట పరిస్థితులన్నింటినీ దృష్టిలో ఉంచుకొని తీర్మానంపై ఓటింగ్‌కు దూరంగా ఉండాలనుకుంటున్నాం’’ అని ఐరాసలోని భారత శాశ్వత రాయబారి టి.ఎస్‌.తిరుమూర్తి అన్నారు.

ఉక్రెయిన్‌కు ఈయూ యుద్ధ విమానాలు...

రష్యా దాడులతో ఉక్కిరిబిక్కిరవుతున్న ఉక్రెయిన్‌కు క్రమంగా ఒక్కో దేశం ముందుకు వచ్చి మిలటరీ సాయంతో అండగా నిలుస్తున్నాయి. ఇప్పటికే భారీ స్థాయిలో ఆయుధాలు అందజేస్తున్న ఐరోపా సమాఖ్య (ఈయూ) సభ్య దేశాలు తాజాగా యుద్ధ విమానాలను సైతం పంపడానికి సిద్ధమయ్యాయి. ‘‘మేం యుద్ధ విమానాలను కూడా పంపుతాం. కేవలం ఆయుధాలు పంపడం గురించే మాట్లాడడం లేదు. యుద్ధానికి కావాల్సిన కీలక ఆయుధాలను సైతం అందజేస్తున్నాం’’ అని ఐరోపా సమాఖ్య విదేశీ విధానం విభాగపు అధిపతి జోసెఫ్‌ బోరెల్‌ వ్యాఖ్యానించారు. అంతకుముందు ఉక్రెయిన్‌ సైన్యం నిర్వహించగల కొన్ని అత్యాధునిక యుద్ధ విమానాలు ఈయూ వద్ద ఉన్నాయని ఆ దేశ విదేశాంగ మంత్రి తెలిపారు. వాటిని తమకు అందజేయాలని విజ్ఞప్తి చేశారు. దీనికి స్పందనగానే ఐరోపా సమాఖ్య తాజా నిర్ణయం తీసుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని