UNSC: ఆ తీర్మానం పాక్‌ ఉగ్రవాదులకు కలిసొస్తుంది: ఐరాసలో భారత్‌

ఐక్యరాజ్య సమితిలో అమెరికా తీసుకొచ్చిన తీర్మానంపై ఓటింగ్‌కు భారత్‌ దూరంగా ఉంది. ఆ తీర్మానం వల్ల ఉగ్రవాదులు ప్రయోజనం పొందుతారని దిల్లీ ఆందోళన వ్యక్తం చేసింది.

Published : 10 Dec 2022 13:55 IST

యునైటెడ్‌ నేషన్స్‌: ఐక్యరాజ్య సమితి (United Nations) విధించే ఆంక్షల నుంచి మానవతా సాయాన్ని మినహాయించేందుకు రూపొందించిన తీర్మానంపై ఓటింగ్‌కు భారత్‌ (India) దూరంగా ఉంది. ఈ తీర్మానంతో పాకిస్థాన్‌ (pakistan) లాంటి దేశాల్లో ఉగ్ర ముఠాలు లబ్ధి పొందుతాయని భారత్‌ తెలిపింది. మినహాయింపులను అదనుగా చేసుకుని ఉగ్రవాద సంస్థలు నిధులను సమకూర్చుకుంటాయని భారత్‌ ఆందోళన వ్యక్తం చేసింది.

ప్రస్తుతం ఐరాస భద్రతా మండలికి భారత్‌ అధ్యక్షత వహిస్తోన్న విషయం తెలిసిందే. మానవతా చర్యలను మినహాయిస్తూ ఆంక్షలు రూపొందించేందుకు తీసుకొచ్చిన తీర్మానాన్ని అమెరికా, ఐర్లాండ్‌ కలిసి ఐరాస భద్రతా మండలిలో ప్రవేశపెట్టాయి. దీన్ని ఆమోదిస్తే ఎంతోమంది జీవితాలను కాపాడొచ్చని అమెరికా పేర్కొంది. ఈ తీర్మానంతో ఆంక్షలు అమల్లో ఉన్న దేశాల్లో మానవతా సాయం సమయానికి అందేలా.. నిధుల చెల్లింపులు చేయడం, ఇతర ఆర్థిక వనరులు, ఆస్తులను ఉపయోగించుకోడానికి అనుమతి లభిస్తుంది.

15 మంది సభ్యులున్న ఐరాస భద్రతా మండలిలో ఈ తీర్మానానికి 14 దేశాలు అనుకూలంగా ఓటెయ్యగా.. భారత్ ఒక్కటే ఓటింగ్‌కు దూరంగా ఉంది. ఈ సందర్భంగా భద్రతా మండలి అధ్యక్షురాలు, ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్ మాట్లాడుతూ.. ‘‘ ఇలాంటి మానవతా మినహాయింపుల నుంచి ఉగ్రవాద సంస్థలు పూర్తిగా లబ్ధిపొందిన సందర్భాలు గతంలో ఉన్నాయి. పాకిస్థాన్‌లో కొన్ని నిషేధిత ఉగ్ర ముఠాలు.. మానవతా సంస్థలు, ప్రజా సంఘాల అవతారమెత్తి ఆంక్షల నుంచి తప్పించుకున్న కేసులు చాలానే ఉన్నాయి. ఈ అవకాశాన్ని ఆ ముఠాలు నిధులు సమకూర్చుకోడానికి, ఉగ్రవాదులను నియమించుకోడానికి ఉపయోగించుకుంటాయి. ఆంక్షలు అమల్లో ఉన్న సంస్థలు, దేశాలకు మానవతా సాయాన్ని అందించే ముందు మరింత శ్రద్ధగా ఆలోచించాలని భారత్‌ కోరుతోంది’’ అని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు