Ukraine Conflict: ఉక్రెయిన్‌ను వీడండి.. మరోసారి అప్రమత్తం చేసిన భారత విదేశాంగశాఖ

ఉక్రెయిన్‌- రష్యాల మధ్య వివాదం నానాటికి ముదురుతోన్న నేపథ్యంలో.. ఉక్రెయిన్‌లో నివసించే భారతీయ పౌరులను కేంద్ర ప్రభుత్వం మరోసారి అప్రమత్తం చేసింది. స్థానికంగా తీవ్రస్థాయి ఉద్రిక్తతలు, అనిశ్చిత పరిస్థితులు కొనసాగుతోన్న దృష్ట్యా.. ఇక్కడ ఉండాల్సిన అవసరం...

Published : 20 Feb 2022 18:41 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఉక్రెయిన్‌- రష్యాల మధ్య వివాదం నానాటికి ముదురుతోన్న నేపథ్యంలో.. ఉక్రెయిన్‌లోని భారతీయ పౌరులను విదేశాంగ శాఖ మరోసారి అప్రమత్తం చేసింది. స్థానికంగా తీవ్రస్థాయి ఉద్రిక్తతలు, అనిశ్చిత పరిస్థితులు కొనసాగుతోన్న దృష్ట్యా.. ఇక్కడ ఉండాల్సిన అవసరం లేని భారతీయ పౌరులు, విద్యార్థులందరూ ఉక్రెయిన్‌ను తాత్కాలికంగా విడిచిపెట్టాలని కీవ్‌లోని భారత దౌత్యకార్యాలయం సలహా ఇచ్చింది. అందుబాటులో ఉన్న కమర్షియల్‌, ఛార్టర్‌ విమానాల ద్వారా స్వదేశానికి చేరుకోవాలని సూచించింది. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసింది. విద్యార్థులు ఛార్టర్ విమానాల వివరాల కోసం సంబంధిత స్టూడెంట్ కాంట్రాక్టర్‌లను సంప్రదించాలని, తాజా సమాచారం కోసం ఎంబసీ సామాజిక మాధ్యమాల ఖాతాలను ఫాలో కావాలని పేర్కొంది.

రష్యా ఏ క్షణానైనా దాడి చేయడం ఖాయమని అమెరికా, ఉక్రెయిన్‌ సహా పలు దేశాలు విశ్వసిస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్‌ ఇదివరకే ఈ మేరకు హెచ్చరికలు జారీ చేసింది. వారికి కావాల్సిన సహాయ సహకారాలు అందజేస్తామని విదేశాంగ శాఖ వెల్లడించింది. తాజాగా మరోసారి అప్రమత్తం చేసింది. ఇప్పటికే పలు దేశాలు ఉక్రెయిన్‌ నుంచి తమ దేశ ప్రజలను వెనక్కి వచ్చేయాలని పిలుపునిస్తున్నాయి. అమెరికా, జర్మనీ, ఇటలీ, బ్రిటన్‌, ఐర్లాండ్‌, బెల్జియం, కెనడా, నార్వే, లిథువేనియా, బల్గేరియా, స్లొవేనియా, ఆస్ట్రేలియా, జపాన్‌, ఇజ్రాయెల్‌, సౌదీ, యూఏఈ తదితర దేశాలు ఈ జాబితాలో ఉన్నాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని